నేడు జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి రాక

ABN , First Publish Date - 2022-05-31T05:01:24+05:30 IST

జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఈనెల 31వ తేదీ మంగళవారం రాయచోటికి రానున్నట్లు కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నేడు జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి రాక
ఏర్పాట్లను పరిశీలిస్తున్న జేసీ తమీమ్‌ అన్సారియా

ప్రధానితో వర్చువల్‌ మీటింగ్‌.. డీఆర్‌సీ సమావేశం

రాయచోటి (కలెక్టరేట్‌), మే 30: జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఈనెల 31వ తేదీ మంగళవారం రాయచోటికి రానున్నట్లు కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి 31వ తేదీ ఉదయం 8 గంటలకు కడప నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 9 గంటలకు రాయచోటిలోని అభి ఫంక్షన్‌ హాల్‌ చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు దేశ ప్రధాని వర్చువల్‌ సమావేశంలో పాల్గొంటారు. అక్కడే మధ్యాహ్నం 2 గంటలకు జరిగే జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు రోడ్డు మార్గాన నెల్లూరు బయలుదేరి వెళ్తారని కలెక్టర్‌ పేర్కొన్నారు. 


ఏర్పాట్లను పరిశీలించిన జేసీ

అభి ఫంక్షన్‌లో జరుగుతున్న ఏర్పాట్లను జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఆర్డీవో రంగస్వామి, డీఆర్‌వో సత్యనారాయణ సోమవారం పరిశీలించారు. ప్రజలు, అధికారులు కూర్చోవడానికి, భోజన వసతులు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి విషయాలను ఆర్డీవోను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రధానితో వర్చువల్‌ సమావేశంలో పాల్గొనడానికి వచ్చే మహిళలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ జాయింట్‌ కలెక్టర్‌ పరిశీలించారు. వారి వెంట కలెక్టరేట్‌ ఏవో బాలకృష్ణ, తహసీల్దార్‌ సుబ్రమణ్యంరెడ్డి, లక్కిరెడ్డిపల్లె, చిన్నమండెం, రామాపురం తహసీల్దార్‌లు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2022-05-31T05:01:24+05:30 IST