-
-
Home » Andhra Pradesh » Kadapa » Make applications do without pending-MRGS-AndhraPradesh
-
దరఖాస్తులు పెండింగ్ లేకుండా చేయండి
ABN , First Publish Date - 2022-07-06T04:38:59+05:30 IST
చుక్కల భూములు, 22ఏ, మ్యుటేషన్ దరఖాస్తులను పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలని తహసీల్దార్లను కలెక్టర్ పీఎస్ గిరీషా ఆదేశించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
కలెక్టర్ పీఎస్ గిరీషా
రాయచోటి (కలెక్టరేట్), జూలై 5: చుక్కల భూములు, 22ఏ, మ్యుటేషన్ దరఖాస్తులను పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలని తహసీల్దార్లను కలెక్టర్ పీఎస్ గిరీషా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో చుక్కల భూములు, 22ఏ, మ్యుటేషన్ సమస్యల పెండింగ్ దరఖాస్తులతో పాటు రీసర్వేపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చుక్కల భూములకు సంబంధించి 3017 దరఖాస్తులు లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్నాయని, వచ్చే నెలలోగా క్లియర్ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. 1365 దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించారని, ఏ కారణాలతో తిరస్కరించారో ఆ ఫైళ్లను శుక్రవారం జరిగే సమీక్ష సమావేశానికి తీసుకురావాలని తెలిపారు. 22ఏ సంబంధించి 993 దరఖాస్తులు ఉన్నాయని, 599 దరఖాస్తులు తిరస్కరణలో ఉన్నాయన్నారు. మ్యుటేషన్ కరెక్షన్కు సంబంధించి 522 దరఖాస్తులు రిసీవ్ అయ్యాయన్నారు. మ్యుటేషన్ కరెక్షన్ ఫారం-8 గడువు దాటి నోటీసులు ఇవ్వకుండా గడువులోగా నోటీసులు ఇవ్వాలని చెప్పారు. ప్రతిరోజూ ఆర్డీవోలు పర్యవేక్షణ చేయాలన్నారు. తహసీల్దార్ కార్యాలయాల తనిఖీలకు ఆర్డీవోలు వెళ్లినప్పుడు వెబ్‌ల్యాండ్ మీద సమీక్ష నిర్వహించాలన్నారు. ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్‌లో వెనుకబడ్డ మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీసర్వేలో అధికారులందరూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు. భూవివాదాలను పరిష్కరించడం అన్నది సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యమని, సమగ్ర సర్వేను నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని తీసుకోవాలన్నారు. పీలేరు, కేవీపల్లె, తంబళ్లపల్లె, సంబేపల్లె తదితర మండలాలు రీసర్వేలో వెనుకబడడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, డీఆర్వో సత్యనారాయణ, రాయచోటి, మదనపల్లె, రాజంపేట ఆర్డీవోలు రంగస్వామి, మురళి, కోదండరామిరెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ జయరాజ్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.