మార్కెట్‌యార్డులో లారీ అడ్డగింత

ABN , First Publish Date - 2022-09-28T04:05:23+05:30 IST

మదనపల్లె టమోటా మార్కెట్‌లో బయటి ప్రాంతాల లారీలు లోడింగ్‌కు రాకూడదంటూ స్థానిక ఐషర్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు అడ్డుకున్నారు.

మార్కెట్‌యార్డులో లారీ అడ్డగింత
మార్కెట్‌యార్డు ఎదుట ధర్నా చేస్తున్న టమోటా వ్యాపారులు, ప్రజాసంఘాల నేతలు

లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ దౌర్జన్యం అంటూ వ్యాపారి ఆవేదన

మద్దతిచ్చిన వ్యాపారులకు బెదిరింపు ఫోన్‌కాల్స్‌

మార్కెట్‌యార్డు ఎదుట ధర్నా


మదనపల్లె టౌన్‌, సెప్టెంబరు 27: మదనపల్లె టమోటా మార్కెట్‌లో బయటి ప్రాంతాల లారీలు లోడింగ్‌కు రాకూడదంటూ స్థానిక ఐషర్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు అడ్డుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన టమోటా వ్యాపారి తాతాజి గత 18 ఏళ్లుగా మదనపల్లెలో నివాసం ఉంటూ టమోటా వ్యాపారం చేస్తున్నాడు. బాధితుడి కథనం మేరకు... మంగళవారం ములకలచెరువులోని టమోటా మండీలో రూ.5 లక్షలకు టమోటాలు కొనుగోలు చేశాడు. కాగా అతడికి సంబంఽధించిన ఖాళీ టమోటా క్రేట్లు మదనపల్లె మార్కెట్‌యార్డులో ఉండటంతో ఇక్కడికి వచ్చి ఐషర్‌ లారీలో ఖాళీ క్రేట్లను లోడ్‌ చేసి వెళుతుండగా ఐషర్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ వాళ్లు వచ్చి అతడు కిరాయికి తీసుకున్న బయటి లారీని అడ్డగించి అసోసియేషన్‌ కార్యాలయానికి తరలించారు. అతడు మార్కెట్‌కు వచ్చి తన లారీని వదలాలని చెప్పినా వదల్లేదు. తాను టమోటా వ్యాపారంలో అప్పులపాలయ్యానని, తనను భార్య, బిడ్డలు వదిలి వెళ్లిపోయారన్నారు. బయటి లారీలతో టమోటా రవాణా చేస్తే తనకు రోజుకు రూ.3 నుంచి రూ.4 వేలు మిగులుతోందని, ఈ మిగులుతో అప్పులు తీరుస్తున్నానని తెలిపాడు. కాగా అతడికి మద్దతుగా కొందరు వ్యాపారులు అక్కడి చేరుకుని మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు వారికి ఫోన్లు చేసి అతడికి మద్దతు ఇవ్వవద్దని ఒత్తిడి తెచ్చారు. అలా చేస్తే మీ మండీల్లో టమోటాలను కొనుగోలు చేయమని బెదిరించినట్లు తెలిపారు. కాగా బాధతుడికి మద్దతుగా కొంతమంది మండీల యజమానులు, సీపీఐ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు మార్కెట్‌యార్డు ఎదుట ధర్నా చేశారు. అధికారులు స్పందించి బయటి వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చూస్తే టమోటా ధరలు పెరుగుతాయని, దీని వలన రైతులకు లాభాలు వస్తాయని తెలిపారు. 

ఈ విషయమై మార్కెట్‌యార్డు కార్యదర్శి అభిలాష్‌ మాట్లాడుతూ బయటి లారీ లోడ్‌ చేసుకుని వెళుతుంటే మార్కెట్‌ బయట నుంచి కొందరు లారీని స్వాధీనం చేసుకున్నారని దీనిపై మార్కెట్‌కు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఎవరైనా అక్రమంగా వసూళ్లకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఐషర్‌ లారీ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు రెడ్డిప్రసాద్‌ మాట్లాడుతూ మదనపల్లెలో ఐషర్‌ లారీల లోడింగ్‌ తగ్గిపోయిందని, కిరాయిలు లేక ఫైనాన్స్‌ డ్యూలు కట్టేందుకు కష్టంగా ఉందని తెలిపారు. మా అసోసియేషన్‌లో సీరియల్‌ ప్రకారం బండ్లు లోడ్‌ కావడానికి పది రోజులు పడుతోందని, ఇలాంటి సమయంలో బయటి లారీలు లోడ్‌కు వస్తే మా బండ్లు ఖాళీగా ఉంటున్నాయన్నారు.  ఇదే జరిగితే మా పరిస్థితి ఏంటని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Read more