పశు సంపద వరదార్పణం

ABN , First Publish Date - 2022-11-24T23:46:24+05:30 IST

అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో భారీగా పాడి పరిశ్రమ దెబ్బతింది. ఒక్కసారిగా వచ్చిన వరదతో ఏకంగా 1928 ఆవులు, గేదెలు, 3004 గొర్రెలు, మేకలు చనిపోయాయి. ఇక కోళ్లు కంటికి కనిపించకుండాపోయాయి.

పశు సంపద వరదార్పణం
అన్నమయ్య ప్రాజెక్టు వరదతో మందపల్లెలో నీట మునిగి చనిపోయిన బర్రెలు (ఫైల్‌)

అన్నమయ్య ప్రాజెక్టు వరదతో వేలాది పశువులు నీటి పాలు

రూ.12 కోట్లకు పైబడి నష్టం

ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.1.52 కోట్లు

ప్రభుత్వం ఆదుకోవాలంటున్న పాడి రైతులు

రాజంపేట, నవంబరు 24 : అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో భారీగా పాడి పరిశ్రమ దెబ్బతింది. ఏ దేశమైనా బాగుపడాలంటే పంటకు ముందే పాడి అభివృద్ధి జరిగి ఉండాలి. పెన్నానది తరువాత ఎంతో పెద్ద నదిగా పిలువబడే చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతాల్లో అటు గుట్టలు, కొండలు, వ్యవసాయ పొలాలు భారీ ఎత్తున ఉండటం వల్ల పశు సంపద వేలాదిగా ఉండేది. ఒక్క పులపత్తూరు, తొగూరుపేట, గుండ్లూరు, మందపల్లె, రామచంద్రాపురం ప్రాంతాల్లోనే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆవులు, గేదెలు 2044, గొర్రెలు, మేకలు 6787, కోళ్లు 7 వేలు పైబడి ఈ ప్రాంతంలో ఉండేవి. ఒక్కసారిగా వచ్చిన వరదతో ఏకంగా 1928 ఆవులు, గేదెలు, 3004 గొర్రెలు, మేకలు చనిపోయాయి. ఇక కోళ్లు కంటికి కనిపించకుండాపోయాయి. ఒక పాలిచ్చే ఆవును, గేదెను కొనుగోలు చేయాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం రూ.30 వేల నుంచి 50 వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక గొర్రెలు, మేకలు కొనాలంటే ఒక్కో గొర్రె, మేకను 10 వేల నుంచి 15 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏకంగా 1928 ఆవులు, గేదెలు, 3004 మేకలు, గొర్రెలు చనిపోతే ఎన్ని కోట్లలో నష్టం జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు. 2044 ఆవులు, గేదెలు మరణించాలంటే వాటిని మనం సరాసరి లెక్కిస్తే కనీసం 6 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. ఇక 6787 మేకలు, గొర్రెలను సరాసరిగా లెక్కిస్తే మరో 6 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. ఇక సుమారు 7 వేల కోళ్లకు రమారమి 200 రూపాయలతో లెక్కిస్తే 14 లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. మొత్తంగా 12 కోట్ల రూపాయలు పైబడి నష్టం వాటిల్లింది. అయితే పశు సంవర్థక శాఖ అధికారులు వేసిన లెక్కల ప్రకారం మొత్తం కోటి 51 లక్షల 560 రూపాయలు నష్టాన్ని పాడిపరిశ్రమ బాధితులకు అందజేశారు. 300 టన్నుల దాణా కూడా అందించారు. అంటే ఏ స్థాయిలో నష్టం జరిగితే.. ఎంత తక్కువ నష్టపరిహారం అందజేశారో అర్థం చేసుకోవచ్చు. 12 కోట్లకు పైబడి నష్టం జరిగితే.. కేవలం 1,51,00,560 రూపాయలు మాత్రమే అందజేశారు.

ప్రభుత్వ నిబంధనలు అనేక ఏళ్లుగా చాలా కఠినతరంగా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎన్ని పశువులు చనిపోయినా ఒక్కో ఇంటికి రెండు పశువులకు మాత్రమే నష్టపరిహారం అందజేస్తారు. పాలిచ్చే ఆవుకు లేదా గేదెకు 20 వేలు, ఒక్కో పంటకు 16 వేలు ఇస్తారు. అంటే ఒక ఇంటిలో 20 పశువులున్నా ఒక గేదెకు, ఒక ఆవుకు మాత్రమే నష్టపరిహారాన్ని అందజేస్తారు. దీనివల్ల భారీ ఎత్తున రైతులు నష్టపోయారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో చట్టాలను సవరించి ఉదారంగా రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. సరికదా.. తిరిగి ఆ గ్రామీణ ప్రాంతాలు నిలదొక్కుకోవాలంటే పాడిపరిశ్రమను అభివృద్ధి చేయాల్సి ఉంది. ప్రస్తుతం పంట పొలాలన్నీ ఇసుక మేటలతో ఎడారిని తలపిస్తూ వ్యవసాయపరంగా ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడిపోయింది. పాడి పరిశ్రమను ఈ ప్రాంతంలో ప్రోత్సహించాల్సి ఉంది. అంటే గతంలో చనిపోయిన పశువుల స్థానంలో కొత్త పశువులను కొనుగోలు చేయించడానికి ప్రభుత్వం వీరికి సబ్సిడీ రుణాలను అందజేయాల్సి ఉంది. గతంలో ప్రాంతం నుంచి వేలాది లీటర్ల పాలను తీసుకెళ్లేవారు. ఇప్పుడు వందల నుంచి పదుల సంఖ్యకు పశుసంపద పడిపోవడంతో ఇక్కడికి పాల కేంద్రాల వారు వచ్చేవారే లేరు. మామూలుగా డ్వాక్రా సంఘాలు, ఇతర బ్యాంకులు ఇక్కడి రైతులను, మహిళలను, నిరుద్యోగులను ప్రోత్సహించి పాడిపరిశ్రమ అభివృద్ధికి విస్తృతంగా సబ్సిడీ రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తే తప్ప తిరిగి ఈ ప్రాంతంలో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశాలు కనుచూపుమేర కాన రావడం లేదు.

మహేందర్‌రెడ్డి అనే వ్యక్తి మరో ఐదుగురితో కలిసి మందపల్లెలో పాడిపరిశ్రమ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 25 గేదెలను ఇందులో ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేవారు. ఇందుకోసం సుమారు 13 లక్షలు ఖర్చు చేశారు. అయితే గత ఏడాది నవంబరు 19వ తేదీ అన్నమయ్య ప్రాజెక్టు, పింఛా ప్రాజెక్టులు తెగిపోవడం వల్ల ఒక్కసారిగా వరద నీరు పడి పశువులు చనిపోయాయి. రోజూవారి ఒక్కొక్క బర్రె 20 లీటర్లకు తగ్గకుండా పాలిచ్చేది. రోజూవారి ఆదాయం 10 వేలు వస్తుండేది. ఒక్కో బర్రెకు 30 వేల నుంచి 50 వేలు పెట్టుబడి పెట్టి కొనుగోలు చేశారు. ఒక్కసారిగా అవి చనిపోవడంతో మొత్తం నష్టం వాటిల్లింది. ఈ పశువులతో పాటు 2 లక్షల దాణా కూడా కొట్టుకుపోయింది. దీంతో వీరి ఆశలు అడియాశలయ్యాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు వీరికి మొత్తం 2.30 లక్షలు మాత్రమే నష్టపరిహారం అందజేశారు. తిరిగి వీరు కొనుగోలు చేసుకోవడానికి ప్రభుత్వం సహాయం చేయలేదు. దీంతో పశు సంపదను ఆధారంగా చేసుకుని జీవించాలనుకున్న వీరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

తొగూరుపేట గ్రామం చెయ్యేరు ఒడ్డునే ఉంది. ఈ గ్రామంలో వేలాది పశువులు ఉన్నాయి. అయితే వరదల్లో ఒక్క పశువు కూడా మృతి చెందలేదు. కారణం చిన్నప్పటి నుంచి మూగజీవాలైన పశువులపై ఎంతో ప్రేమతో ఉండే శివరామయ్య వరద వస్తుందని తెలిసి ముందుగానే పశువులన్నింటినీ తమ గ్రామానికి ఆనుకుని ఉన్న దాసాలమ్మ గుట్టపై వాటిని తోలి కిందకి దిగనివ్వకుండా రాత్రంతా కాపలా కాశాడు. దీనివల్ల గ్రామంలోని సుమారు 500 పైబడి ఆవులు, గేదెలు, మేకలు ఉండగా ఒక్కటి కూడా చనిపోలేదు. కారణం శివరామయ్యనే... అందువల్లే అతడిని ఆ ప్రాంతంలో మరో గోపాలుడిగా పిలుస్తుంటారు. ఇంతటి పశుసంపదను వరద వచ్చే ముందు అర్ధరాత్రి వేళ పశువులన్నింటినీ గుట్టపైకి తోలి కాపలా కాసిన ఈ వ్యక్తిని ప్రభుత్వం ప్రోత్సహించి సహాయపడాల్సి ఉండగా నామమాత్రం కూడా గత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లోనూ ఇతడికి ఒక మెమొంటో కూడా అందజేసి సత్కరించలేదు.

నిబంధనల మేరకే.. నష్టపరిహారం అందజేశాం

- అబ్దుల్‌ అరీఫ్‌, పశు సంవర్ధక డిప్యూటీ డైరెక్టర్‌, రాజంపేట డివిజన్‌

ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి రైతు నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని అంచనా వేసి వారికి నష్టపరిహాలు అందజేశాం. ఏకంగా 1,51,00,560 రూపాయల నష్టపరిహారాన్ని అందజేశాం. అంతేకాక కిలో 12 రూపాయల విలువ చేసే 300 టన్నుల పశుదాణాను కూడా పంపిణీ చేశాము. ఎవరైనా పాడి రైతులు ముందుకు వస్తే పాడి పరిశ్రమ అభివృద్ధికి మా వంతు కృషి చేస్తాము. పశుసంవర్ధక శాఖ ద్వారా అన్నమయ్య ప్రాజెక్టు రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటాం.

20 పశువులు చనిపోతే రూ.15 వేలు నష్టపరిహారం ఇచ్చారు

-గంధం నరసరాజు, పాడి రైతు, పులపత్తూరు

వరదల్లో మాకు సంబంధించిన 20కి పైబడి పశువులు చనిపోతే 15 వేలు నష్టపరిహారం ఇచ్చారు. మా ఇంటిలో ఆవులు, గేదెలు, మేకలు 20 వరకు చనిపోయాయి. మాకు నష్టపరిహారం ఇచ్చింది కేవలం 15 వేల రూపాయలు మాత్రమే. ఈ విధంగా నష్టపరిహారం అందజేస్తే మేము ఏం కోలుకుంటాం. మా పులపత్తూరు గ్రామంలో వందలాది ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు నీళ్ల పాలయ్యాయి. వాటి స్థానంలో తిరిగి పశు సంపద అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం ఆదుకోవాలి కదా.. ఇంత వరకు ప్రభుత్వం సబ్సిడీ రణాలు ఇచ్చి తిరిగి పశువులు కొనివ్వకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం.

Updated Date - 2022-11-24T23:46:26+05:30 IST