ఐక్యంగా ఉద్యమిద్దాం

ABN , First Publish Date - 2022-12-09T23:44:33+05:30 IST

ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ఐక్యంగా ఉద్యమిద్దామని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ పిలుపునిచ్చారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటును డిమాండ్‌ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేపట్టిన ‘కన్యతీర్థం నుంచి కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర’ను శుక్రవారం జెండా ఊపి నారాయణ ప్రారంభించారు.

ఐక్యంగా ఉద్యమిద్దాం

సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ

ఉక్కు ఫ్యాక్టరీ సాధనకోసం..

కన్యతీర్థం నుంచి కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర ప్రారంభం

పాల్గొన్న అఖిలపక్ష నేతలు

ప్రొద్దుటూరు / జమ్మలమడుగు రూరల్‌, డిసెంబరు 9 : ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ఐక్యంగా ఉద్యమిద్దామని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ పిలుపునిచ్చారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటును డిమాండ్‌ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేపట్టిన ‘కన్యతీర్థం నుంచి కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర’ను శుక్రవారం జెండా ఊపి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019లో జగన్‌మోహన్‌రెడ్డి కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారన్నారు. మూడేళ్ల సమయంలో పరిశ్రమ పూర్తిచేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పారన్నారు. మూడు సంవత్సరాలు పూర్తయినప్పటికీ పునాది రాయి తప్ప ఎటువంటి పనులు సాగలేదన్నారు. పరిశ్రమ ఏర్పాటు స్థలంలో గడ్డి మొలుస్తోందన్నారు. ఉక్కు పరిశ్రమ పూర్తయితే రాయలసీమకు ప్రయోజనం కలుగుతుందన్నారు. విభజన హామీల్లోని ఉక్కు పరిశ్రమకు నిధులను ప్రధానిని ఎందుకు అడగడంలేదని ఆయన ప్రశ్నించారు. ఇది మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదన్నారు.

మూడుసార్లు శంకుస్థాపన చేసినా..

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ముగ్గురు ముఖ్యమంత్రులు మూడుసార్లు శంకుస్థాపన చేసినా ఉక్కు పరిశ్రమ పనుల్లో ఎలాంటి పురోగతి లేదన్నారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తామంటే పోలీసులు అనుమతినివ్వకుండా వైసీపీ నేతలు చెప్పినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లాలో పోలీసులు రాజకీయాలు చేస్తున్నారని, తమ పాదయాత్రకు నిరాకరించి ఒకరిపై ఒకరు పెట్టుకోవడంతో చివరికి న్యాయస్థానానికి వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో జాకీ, కియా, అమరరాజలాంటి పరిశ్రమల అనుబంధంగా ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్లిపోతున్నాయన్నారు.

సమాధి రాయిగా మిగిలిపోనుంది

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం ఏర్పాటు చేసిన శంకుస్థాపన రాయి సమాధి రాయిగా మిగిలిపోనుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. సీపీఐ చేపడుతున్న పాదయాత్రకు టీడీపీ తరపున సంఘీభావాన్ని తెలియపరుస్తున్నామన్నారు. 2018లో జమ్మలమడుగు నియోజకవర్గంలోని కంబాలదిన్నె వద్ద అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిశ్రమ స్థాపన కోసం శంకుస్థాపన చేశారని, ఎన్నికలు రావడంతో పనులు ముందుకు సాగలేదన్నారు. జగన్‌ సీఎం అయ్యాక పరిశ్రమను కన్యతీర్థం వద్దకు మార్పు చేశారన్నారు. మూడు సంవత్సరాల్లో పూర్తి చేసి పదివేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి ఆ తరువాత పరిశ్రమ ఊసే ఎత్తలేదన్నారు.

జిల్లా ప్రజల ఆకాంక్షలు కేంద్రం వద్ద తాకట్టు

రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజల ఆకాంక్షలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారని అన్నారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనేది ఇక్కడ ప్రజల ఆకాంక్ష అన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద బానిస బతుకు బతుకుతున్న వైసీపీ ప్రభుత్వం కడప ఉక్కు పరిశ్రమను పూర్తి చేస్తే చరిత్రలో నిలిచిపోయేదని అన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిశ్రమ పనులు ప్రారంభించకపోవడంతో చరిత్ర హీనులుగా జగన్‌మోహన్‌రెడ్డి నిలిచిపోయారన్నారు.

ప్రజలు ప్రశ్నించినప్పుడే ప్రభుత్వాలకు బుద్ధి వస్తుంది

ప్రజలు తమ సమస్యలపై ప్రశ్నించినప్పుడే ఈ ప్రభుత్వాలకు బుద్ధి వస్తుందని సీపీయం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. సత్వరమే ఉక్కు పరిశ్రమ స్థాపించాలని జిల్లా ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఉక్కు పరిశ్రమపై నమ్మకం పోతోంది

ఉక్కు పరిశ్రమపై నమ్మకం పోతోందని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత దేవగుడి నారాయణరెడ్డి పేర్కొన్నారు. మూడు సంవత్సరాల్లో ఉక్కు పరిశ్రమ పూర్తవుతుందని, ప్రారంభోత్సవ సమయంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారని అయితే ఇక్కడ సబ్‌ స్టేషన్‌, ఒక పర్లాంగు దూరం ప్రహరీగోడ మినహా ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. నియోజకవర్గంలో ఒక ఉక్కు పరిశ్రమే కాదు మిగిలిన అభివృద్ధి పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లు కూడా స్థానిక ప్రజాప్రతినిధులకు పర్సంటేజీలు ఇచ్చుకోలేక వెళ్లిపోతున్నారన్నారు. ఈ తరుణంలో ఉక్కు పరిశ్రమ పూర్తవుతుందనేది ప్రశ్నార్థకంగా మిగులుతుందన్నారు. త్వరలో టీడీపీ అధికారంలోకి వస్తుందని, ఆ తరువాతనే ఉక్కు పరిశ్రమ పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు.

మధ్యాహ్నం 11.50 గంటలకు కన్యతీర్థం వద్ద ప్రారంభమైన పాదయాత్ర సున్నపురాళ్లపల్లె మీదుగా జమ్మలమడుగుకు సాయంత్రం 5.30 గంటలకు చేరుకుంది. పరిశ్రమల కోసం భూములు ఇచ్చామని, పరిహారం మాత్రం ఇవ్వలేదని సున్నపురాళ్లపల్లె గ్రామస్తులు నేతల దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు గుజ్జుల ఓబులేసు, ఈశ్వరయ్య, గాలిచంద్ర, టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ముక్తియార్‌, కుతుబుద్దీన్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్‌, జనసేన, బీఎస్పీ తదితర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

Updated Date - 2022-12-09T23:44:40+05:30 IST