జగన్‌ అరాచక పాలనకు ఫుల్‌స్టాప్‌ పెడదాం

ABN , First Publish Date - 2022-10-02T04:33:43+05:30 IST

రాష్ట్రంలో సాగుతున్న జగన్‌రెడ్డి అరాచక పాలనకు ఫుల్‌స్టాప్‌ పెడదామని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణ పరిధిలోని సుండుపల్లె రోడ్డులో ఉన్న నారాయణ కళ్యాణ మండపంలో రాయచోటి నియోజకవర్గ క్లస్టర్‌ ఇన్‌చార్జిల సమావేశం జరిగింది.

జగన్‌ అరాచక పాలనకు ఫుల్‌స్టాప్‌ పెడదాం
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

ప్రజలు అసంతృప్తిలో ఉన్నారు  

రైతన్నల పరిస్థితి మరింత అధ్వానం  

రాయచోటి నియోజకవర్గ క్లస్టర్‌ ఇన్చార్జిల సమావేశంలో మాజీ మంత్రి సోమిరెడ్డి

రాయచోటి, అక్టోబరు 1: రాష్ట్రంలో సాగుతున్న జగన్‌రెడ్డి అరాచక పాలనకు ఫుల్‌స్టాప్‌ పెడదామని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణ పరిధిలోని సుండుపల్లె రోడ్డులో ఉన్న నారాయణ కళ్యాణ మండపంలో రాయచోటి నియోజకవర్గ క్లస్టర్‌ ఇన్‌చార్జిల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి, అక్రమాలు, అరాచకాలు పెరిగిపోయాయన్నారు. వీరి ఆటలు ఇక సాగవని, ఇంటికి వెళ్లిపోయే రోజులు దగ్గరపడ్డాయన్నారు. రాయలసీమ జిల్లాల్లో అధికశాతం రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని,  అలాంటి రైతులకు ఎంతగానో ఉపయోగపడే డ్రిప్‌ స్పింకర్ల పథకానికి జగన్‌ అధికారంలోకి వచ్చాక మంగళం పాడారని ఆరోపించారు. రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే జగన్‌ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు.  వ్యవసాయ మోటర్లకు మోటర్లు బిగించి రైతులకు ఉరితాళ్లు వేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రివర్స్‌పాలన సాగుతుందని, టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులన్నీ కుంటుపడ్డాయని ఎద్దేవా చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన మూడున్నరేళ్లుగా వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీనే అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్‌ మాఫియా, బూ దందాలు సాగుతున్నాయని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాంగోపాల్‌రెడ్డిని గెలిపించేందుకు ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిగ్రామంలో గ్రామకమిటీ నాయకులు, క్లస్టర్‌ ఇన్‌చార్జులు బాధ్యతలు తీసుకోవాలని, ఆ గ్రామంలో టీడీపీకి మెజార్టీ వచ్చే విధంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ అరాచక పాలన గురించి, చేస్తున్న అవినీతి, అక్రమాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. ఓట్ల నమోదు, సభ్యత్వ నమోదులోనూ అందరూ సమష్టిగా పనిచేయాలన్నారు. రాజంపేట పార్లమెంట్‌ నేత గంటా నరహరి మాట్లాడుతూ వైసీపీని అంతం చేయాలంటే చంద్రబాబును సీఎంను చేయాలన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి వైసీపీని ఇంటికి సాగనంపాలన్నారు. టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు ప్రసాద్‌బాబు మాట్లాడుతూ 2024 ఎన్నికలే టార్గెట్‌గా ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు. అనంతరం టీడీపీ నియోజకవర్గ నాయకుడు రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌కు రోజులు దగ్గర పడ్డాయని, ఇప్పటి నుంచే వైసీపీ ప్రభుత్వంపై పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, రాజంపేట పార్లమెంట్‌ ఆర్టీఎస్‌ ట్రైనర్‌ మౌనిక, రాయచోటి నియోజకవర్గ  టీడీపీ పరిశీలకులు గోపీనాథ్‌, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి వెంకటశివారెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి దొరస్వామినాయుడు, నియోజకవర్గంలోని మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Read more