భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-12-01T23:58:11+05:30 IST

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.చంద్రారెడ్డి, ఎ.రామమోహన డిమాండ్‌ చేశారు. గురువారం ఆ సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది.

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కడప (సెవెనరోడ్స్‌), డిసెంబరు 1: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.చంద్రారెడ్డి, ఎ.రామమోహన డిమాండ్‌ చేశారు. గురువారం ఆ సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా గురువారం కడప ఎమ్మార్వో కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దారుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2009 సంవత్సరంలో పోరాడి సాధించుకున్న సంక్షేమ చట్టాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసే కుట్ర చేస్తుందన్నారు. వెంటనే ఈ ఆలోచన విరమించుకోవాలన్నారు. మెమో నెం.1214 తీసుకువచ్చి నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా చేసిందన్నారు. వివిధ సంక్షేమ పథకాలకు సంక్షేమ బోర్డు నిధులను 1280 కోట్లను వాడుకుందని, వెంటనే ఆ డబ్బు సంక్షేమ బోర్డుకు చెల్లించాలన్నారు. పెండింగులో ఉన్న క్లైమ్‌లకు డబ్బు చెల్లించాలన్నారు. అలాగే ఇసుకను గతంలో మాదిరి ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు జాఫర్‌, వెంకటరామయ్య, వెంకటసుబ్బయ్య, పెద్దన్న, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-01T23:58:14+05:30 IST