భూహక్కు పత్రాలు పంపిణీ చేయాలి
ABN , First Publish Date - 2022-12-13T00:01:23+05:30 IST
భూహక్కు పత్రాలను త్వరితగతిన రైతులకు అందజేయాలని కలెక్టర్ పీఎస్ గిరీషా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తుఫాన్, ఎలెక్షన్స్, రీసర్వే తదితర అంశాలపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మ్యుటేషన్స్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించండి
కలెక్టర్ పీఎస్ గిరీషా
రాయచోటి (కలెక్టరేట్), డిసెంబరు 12: భూహక్కు పత్రాలను త్వరితగతిన రైతులకు అందజేయాలని కలెక్టర్ పీఎస్ గిరీషా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తుఫాన్, ఎలెక్షన్స్, రీసర్వే తదితర అంశాలపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో మాట్లాడి వచ్చే బుధవారం లోపల భూహక్కు పత్రాలు పంపిణీ చేయాలన్నారు. మిగతా గ్రామాల్లో రీసర్వే పనులను వేగవంతం చేయాలన్నారు. మ్యుటేషన్స్ కోసం అందిన దరఖాస్తుపై వీఆర్వోలు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో విచారణలు జరిపి క్లియర్ చేయాలన్నారు. ఈ దరఖాస్తులన్నీ నిర్దేశించిన గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఓటరు కార్డుకు ఆధార్‌కార్డు అనుసంధానానికి సంబంధించి పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలన్నారు. ఓటు హక్కుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని, ఓటర్ల నిష్పత్తి తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా చేపట్టి మరణించిన వారి ఓట్లను జాబితా నుంచి తొలగించి ఒకే ఇంటి నెంబరు కలిగిన కుటుంబ సభ్యుల పేర్లు ఒకేచోట ఉండేటట్లు చూడాలన్నారు. సమావేశంలో డీఆర్వో సత్యనారాయణ, భూముల సర్వే విభాగం సహాయ సంచాలకులు జయరాజ్, ఎన్నికల విభాగ తహసీల్దార్ శ్రావణి, కలెక్టరేట్ ఏవో బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read more