146 పరుగుల ఆధిక్యంతో చిత్తూరుపై కడప జట్టు విజయం

ABN , First Publish Date - 2022-08-17T04:34:19+05:30 IST

కడప నగరంలో నిర్వహిస్తున్న అంతర్‌ జిల్లాల అండర్‌-19 మల్టీ డేస్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం కడప జట్టు 146 పరుగుల తేడాతో చిత్తూరు జట్టుపై విజయం సాధించింది.

146 పరుగుల ఆధిక్యంతో చిత్తూరుపై కడప జట్టు విజయం

డ్రాగా ముగిసిన నెల్లూరు--కర్నూలు జట్ల మ్యాచ్‌


కడప (స్పోర్ట్స్‌) ఆగస్టు, 16 : కడప నగరంలో నిర్వహిస్తున్న అంతర్‌ జిల్లాల అండర్‌-19 మల్టీ డేస్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం కడప జట్టు 146 పరుగుల తేడాతో చిత్తూరు జట్టుపై విజయం సాధించింది. కేవోఆర్‌ఎం మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కడప-చిత్తూరు జట్టు తలపడుతున్న సంగతి తెలిసిందే. వివరాలిలా... కడప జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 37.5 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌట్‌ కాగా, చిత్తూరు జట్టు 34 ఓవర్లకు 115 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కడప జట్టు 105.4 ఓవర్లలో 376 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. దీంతో మొదటి, రెండు ఇన్నింగ్స్‌లకు కలిసి కడప జట్టు 491 పరుగులు చేసింది. ఇదిలావుండగా విజయమే ధ్యేయంగా రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 56.3 ఓవర్లలో 246 పరుగులకే కుప్పకూలింది. దీంతో చిత్తూరు జట్టు ఆడిన మొదటి, రెండు ఇన్నింగ్స్‌లో కలిసి 361 పరుగులు చేసినట్లయ్యింది. దీంతో కడప జట్టు 146 పరుగుల ఆధిక్యత సాధించి చిత్తూరు జట్టుపై విజయం సాధించింది. 


డ్రాగా ముగిసిన నెల్లూరు- కర్నూలు జట్ల మ్యాచ్‌

కడప వైఎ్‌స రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియంలో నెల్లూరు-కర్నూలు జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌ మంగళవారం డ్రాగా ముగిసింది. తొలుత మొదటి ఇన్నింగ్స్‌లో నెల్లూరు జట్టు 106.4 ఓవర్లలో 382 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు ధీటుగా మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కర్నూలు జట్టు 78 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. ఇందులో కె.రేవంత్‌రెడ్డి 63 పరుగులు, పవన్‌ రిత్విక్‌ 61 పరుగులు చేశారు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.  

Read more