Kadapa : జగనన్నా.. బయటకు పోలేకున్నాం!

ABN , First Publish Date - 2022-11-08T05:22:53+05:30 IST

ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే, సొంత పార్టీకి చెందిన సర్పంచులు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. నయా పైసా నిధులు

Kadapa : జగనన్నా.. బయటకు పోలేకున్నాం!

పంచాయతీల్లో ప్రజలు తిరగబడుతున్నారు

మా విధులు, నిధులు ఇవ్వాలి.. లేకుంటే వచ్చే ఎన్నికల్లో సత్తా చూపిస్తాం

ముఖ్యమంత్రికి వైఎస్సార్‌ కడప జిల్లా సర్పంచుల హెచ్చరిక

గ్రామాల్లో చిన్నపాటి సమస్యలనూ తీర్చలేకున్నాం. బల్బులు వేయలేని, కాలువల్లో బ్లీచింగ్‌ పౌడరు చల్లించలేని దుస్థితి. ప్రజలు తిరగబడుతున్నారు. పైౖసా నిధులు లేకుండా ఉత్సవ విగ్రహాల్లా మిగిలాం

-కడప జిల్లా సర్పంచులు

కడప(కలెక్టరేట్‌), నవంబరు 7: ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే, సొంత పార్టీకి చెందిన సర్పంచులు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. నయా పైసా నిధులు ఇవ్వకుండా సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా చేశారని మండిపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే త్వరలో కార్యాచరణ రూపొందించి సీఎం ఇంటి వద్ద, ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద సర్పంచులంతా నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. విధానాలు మార్చుకోకపోతే సొంత పార్టీ సర్పంచులే వచ్చే ఎన్నికల్లో పుట్టి ముంచేందుకు వెనుకాడరని స్పష్టం చేశారు. సర్పంచుల సంఘం వైఎస్సార్‌ కడప జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి మునిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని దాదాపు 70 మంది సర్పంచులు తమ మొర సీఎం దృష్టికి తీసుకెళ్లాలని సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు.

అనంతరం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. శివచంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రఽథమ పౌరుడిగా ప్రతి సమస్య తమదిగా భావించి పనిచేయాల్సిన సర్పంచులకు నిధులు లేక ఏ పనీ చేయని కారణంగా గౌరవం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన 14, 15వ ఫైనాన్స్‌ నిధులన్నీ(దాదాపు రూ.10 వేల కోట్లు) పంచాయతీల అభివృద్ధికి వెచ్చించకుండా ప్రభుత్వమే వాడుకోవడం అన్యాయమన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి దుస్థితి లేదన్నారు. ‘గ్రామాల్లో చిన్నపాటి సమస్యలను తీర్చలేకున్నాం. విద్యుత్‌ బల్బులు వేయలేని, మురుగు కాలువల్లో బ్లీచింగ్‌ పౌడరు చల్లించలేని దుస్థితి ఉంది. ప్రజలు తిరగబడుతున్నారు. పైౖసా నిధులు లేకుండా ఉత్సవ విగ్రహాల్లా మిగిలాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచులుగా కొనసాగాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తమకొచ్చిన 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మునిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలున్నా పైసా పని చేయలేని సర్పంచులను వాళ్లు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం పంచాయతీలకు వచ్చిన నిధులను ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వాడుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. రాజ్యంగంలోని, 73, 74 ఆర్టికల్‌ను తీసివేసి, సీఎం తన ఇష్టప్రకారం పాలన చేస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీల సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం పరిష్కరించకపోతే త్వరలో కార్యాచరణ రూపొందించి సీఎం ఇంటి వద్ద, ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద సర్పంచులంతా నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి విధానాలు మార్చుకోకపోతే సొంత పార్టీ సర్పంచులే వచ్చే ఎన్నికల్లో పుట్టి ముంచేందుకు వెనుకాడరన్నారు.

Updated Date - 2022-11-08T05:22:54+05:30 IST