జగనన్న కాల‘నీళు’్ల

ABN , First Publish Date - 2022-12-13T00:15:58+05:30 IST

మాండస్‌ తుఫాను పీలేరు ప్రాంతంలోని జగనన్న కాలనీలు నీటితో నిండిపోయాయి. తుఫాను ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి కొన్ని కాలనీలు నీటికుంటలను తలపిస్తుండగా, వాటిలోని పునాదులు నీట మునిగాయి.

జగనన్న కాల‘నీళు’్ల
కంకర ఫ్యాక్టరీ లేఔట్‌లో నీట మునిగిన పునాదులు

పునాదుల్లో నీళ్లు....కట్టేదెలా ఇళ్లు...

‘మాండస్‌’ తుఫానుతో లబ్ధిదారులకు కొత్త కష్టాలు

కుంటలను తలపిస్తున్న ఇళ్ల పునాదులు

మాండస్‌ తుఫాను పీలేరు ప్రాంతంలోని జగనన్న కాలనీలు నీటితో నిండిపోయాయి. తుఫాను ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి కొన్ని కాలనీలు నీటికుంటలను తలపిస్తుండగా, వాటిలోని పునాదులు నీట మునిగాయి. నీట మునిగిన పునాదుల్లో ఇళ్ల నిర్మాణం ఎలా చేపట్టాలో తెలియక, ఒకవేళ నిర్మాణాలు చేపట్టినా భవిష్యత్తులో నీటి ప్రవాహానికి నిలబడతాయో లేదోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జగనన్న కాలనీల కోసం స్థల కేటాయింపుల్లో అధికారులు, అధికార పార్టీ నేతలకు కొరవడిన ముందు చూపు కారణంగా ఇప్పుడు తాము మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు.

పీలేరు, డిసెంబరు 12: పీలేరు పట్టణంలోని పేదలకు ప్రభుత్వం తిరుపతి మార్గంలోని కంకర ఫ్యాక్టరీ, ఆయిల్‌ సీడ్స్‌ వద్ద రెండు ప్రధాన లేఔట్లు కేటాయించింది. కంకర ఫ్యాక్టరీ లేఔట్‌లో సుమారు 1100, ఆయిల్‌ సీడ్స్‌ లేఔట్‌లో 600 ఇళ్లు కేటాయించారు. ఆ రెండు ప్రాంతాలు కూడా కొండలు, గుట్టలు, ఏటవాలు ప్రాంతాలతో నిండి ఉండేవి. ప్రభుత్వం కేటాయించిన చోట ఇళ్లు కట్టుకోకపోతే మరోమారు వస్తాయో లేదోనన్న అనుమానంతో చాలామంది లబ్ధిదారులు తమకు ఇష్టం లేకపోయినా అనేక వ్యయప్రయాసాలకోర్చి నిర్మాణ పనులు చేపట్టారు. కంకర ఫ్యాక్టరీ లేఔట్‌లో కొంతమంది లబ్ధిదారులకు కేవలం పునాదులు నిర్మించుకోవడానికి దాదాపు రూ.2 లక్షలు వరకు ఖర్చు అయ్యిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే లేఔట్‌ వేసే సమయంలో అధికారులు ఏటవాలు ప్రాంతాల్లో కూడా ప్లాట్లు కేటాయించారు. తుఫాను ప్రభావంతో కురిసిన వర్షానికి ఆ రెండు లేఔట్లు కుంటలను తలపిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ నీరు నిలిచి ఏది ఫ్లాటో, ఏది ఖాళీ స్థలమో తెలియని పరిస్థితి నెలకొంది. ఏటవాలు ప్రాంతాల్లో ఉన్న అనేక పునాదులు ప్రస్తుతం నీటమునిగాయి. కొన్ని పునాదులు నీటి ప్రవాహానికి కోసుకుపోయాయి. అటువంటి ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం ఎలా చేపట్టాలని, ఒకవేళ మొండిగా ఇల్లు కట్టినా భవిష్యత్తులో నిలుస్తాయో లేదోనని పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ లేఔట్లలో కొన్ని ఫ్లాట్లు కుంటలను తలపిస్తుండగా అంతర్గత రోడ్లు సెలయేళ్లను తలపిస్తున్నాయి. లేఔట్‌ పైభాగంలోని నీరు కిందకు ప్రవహిస్తూ తమ మార్గంలోని పునాదులను కబళిస్తోంది. వర్షం దెబ్బకు ఆయా రోడ్లలో అడుగు పెడితే కాళ్లు సుమారు రెండు అడుగుల మేర దిగబడిపోతున్నాయి. వర్షం తగ్గినా మరో వారం రోజులపాటు ఇళ్ల నిర్మాణ పనుల జోలికి వెళ్లలేమని, అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు వర్షం దెబ్బకు పూర్తిగా పాడైపోయాయని, ఆ రోడ్లపై నిర్మాణ సామాగ్రి తరలించడం తలకు మించిన భారమవుతుందని పలువురు లబ్ధిదారులు తెలిపారు. ముందుచూపు కొరవడిన అధికారుల కారణంగా ప్రస్తుతం తాము మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని వారు వాపోయారు.

Updated Date - 2022-12-13T00:16:01+05:30 IST