జగన్‌ సార్‌... మేము గుర్తున్నామా..?

ABN , First Publish Date - 2022-05-30T05:30:00+05:30 IST

జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ఎదురుగా సోమవారం ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ప్లాంట్‌కు భూములు ఇచ్చిన రైతులు నిరసన తెలిపారు.

జగన్‌ సార్‌... మేము గుర్తున్నామా..?
జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న స్టీల్‌ప్లాంట్‌ బాధిత రైతులు

చావలేక బతుకుతున్నాం

మూడు సంవత్సరాలు అవుతున్నా పరిహారం ఇవ్వలేదు

బ్యాంకర్లు నోటీసులు ఇస్తున్నారు

ధరలు పెరిగి కూలి డబ్బులు తిండికి చాలడం లేదు

స్టీల్‌ప్లాంట్‌ బాధిత రైతుల ఆవేదన


‘‘జగన్‌ సార్‌.. మేము గుర్తున్నామా.. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని చెప్పి మూడేళ్లు అవుతా ఉంది. పరిహారం ఇస్తామని మా భూములు తీసుకున్నారు. పరిహారం లేదు. ఫ్యాక్టరీ లేదు. ఉద్యోగం లేదు. నిత్యావసరాల ధరలు పెరిగాయి. కూలి డబ్బులతో పూటగడవడం కష్టంగా ఉంది. బ్యాంకర్లు రుణాలు కట్టాలని నోటీసులు ఇస్తున్నారు. మీరేమో పరిహారం ఇవ్వరు. చావలేక బతుకుతున్నాం.. మమ్మల్ని ఆదుకోండి’’ అంటూ స్టీల్‌ ప్లాంట్‌కు భూములిచ్చిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 


జమ్మలమడుగు రూరల్‌, మే 30: జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ఎదురుగా సోమవారం ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ప్లాంట్‌కు భూములు ఇచ్చిన రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని సున్నపురాళ్లపల్లె, సరిగేపల్లె, పెద్దదండ్లూరు తదితర గ్రామాలకు చెందిన రైతులు విలేకర్లతో మాట్లాడారు. 

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన అనంతరం రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మలమడుగు రోజా టవర్‌ పక్కన ఏర్పాటు చేసిన సమావేశంలో  స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించి ప్రస్తావించారన్నారు. జమ్మలమడుగు ప్రాంతంలోనే స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని, త్వరలో పూర్తి చేసి కడప జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారన్నారు. ఆ తర్వాత శిలాఫలకాన్ని 2019 డిసెంబరు 23వ తేదీ వేశారన్నారు. అప్పట్లో సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు, సిరిగేపల్లె గ్రామాల్లో సుమారు 192 మంది రైతుల నుంచి 409 ఎకరాల పొలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. అదే సమయంలో తమ వద్ద ఉన్న పాస్‌పుస్తకాలు, టైటిల్‌డీడ్‌ తీసుకుని ఎకరాకు రూ.7.50 లక్షలు ఇస్తామని చెప్పారన్నారు. స్థానిక బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకుని పొలాలు అభివృద్ధి చేసుకుని పంటలు పండుతున్న సమయంలో వాటిని తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తొందరగా ఇస్తామని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే, ఆర్డీవో, తహసీల్దారు అందరూ కలిసి మోసం చేస్తున్నారన్నారు. ఎంపీ అవినాశ్‌ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధి సున్నపురాళ్లపల్లెలో సమావేశం ఏర్పాటు చేసి రైతులందరికీ న్యాయం చేస్తామని చెప్పారని మూడు సంవత్సరాలు దగ్గర పడుతున్నా ఒక్క రైతుకు నష్టపరిహారం అందించలేదన్నారు. పాస్‌పుస్తకాలు తీసుకుని తమ పేర్లు తొలగించడంతో తమకు రైతు భరోసా, అమ్మవొడి తదితర పథకాలన్నీ అందడంలేదన్నారు. దానికితోడు గతంలో తీసుకున్న రుణాలకు బ్యాంకు అధికారులు తమ పేర్లను బ్లాక్‌లిస్టులో ఉంచి నోటీసులు పంపించి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. 

తామంతా సుమారు 130 మంది ఎస్సీ, ఎస్టీలున్నామని, భూములు పోయినా ఫ్యాక్టరీ వచ్చి ఉద్యోగ, ఉపాధి లభిస్తుందని ఆశపడ్డామన్నారు. ఇటీవల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. చేసిన పనితో వచ్చే ఆదాయం తిండికి చాలక ఉన్న భూమి పోయి బ్యాంకర్ల ద్వారా నోటీసులు అందుతూ చావలేక బతుకుతున్నామని వాపోయారు. వారంలోగా ఎకరాకు గతంలో చెప్పినట్లు రూ.7.50 లక్షలు ఇస్తే సరి... లేకుంటే రాజోలి రైతులకు ఇచ్చినట్లుగా తాము రూ.14 లక్షలు ఇచ్చేదాకా తమ భూములు ఇవ్వకుండా స్టీల్‌ప్లాంట్‌ శిలాఫలకాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. 

అనంతరం ఆర్డీవో శ్రీనివాసులుకు రైతులంతా మూకుమ్మడిగా వెళ్లి సమస్యలు చెప్పుకుని న్యాయం చేయాలని కోరారు. ఆయన రైతులతో మాట్లాడి రూ.30 కోట్లకు రిపోర్టు పంపించామని, ఎప్పుడు బడ్జెట్‌ ఇచ్చినా రైతుల అకౌంట్లలో డబ్బులు పడతాయన్నారు. వెంటనే ఓ వృద్ధురాలు మాట్లాడుతూ బ్యాంకర్లు నోటీసులు ఇవ్వడంతో తమకు ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించిన రైతుల సమస్యలు కలెక్టర్‌కు తాను కడపకు వెళ్లి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. దీంతో బాధిత రైతులంతా వెనుదిరిగారు.

  

Read more