జగన్‌రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువు

ABN , First Publish Date - 2022-04-25T04:50:47+05:30 IST

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా దుయ్యబట్టారు.

జగన్‌రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువు
విలేకర్లతో మాట్లాడుతున్న టీడీ పీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా 

రాయచోటిటౌన్‌, ఏప్రిల్‌24: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా దుయ్యబట్టారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఆయన విలే కర్లతో మాట్లాడుతూ  దిశ చట్టం తీసుకువచ్చి మహిళలకు మేలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేడు రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు. ఈ మూడేళ్లలో వైసీపీ నేతలు దాదాపు 1500 మంది మహిళలపై దాడి చేసినా ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదన్నారు. తాడేపల్లిలో జగన్‌మోహన్‌రెడ్డి  నివాసం సమీపంలో మహిళపై అత్యాచారం చేసిన వెంకటరెడ్డిని ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రభుత్వాసుపత్రిలో దివ్యాంగురాలికి 30 గంటల పాటు ముగ్గురు మృగాళ్లు నరకం చూపించడాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ అసలు ఉందా అని ప్రశ్నించారు. ఓ చిన్నారిపై అఘాయిత్యం చేయడంతోపాటు, వ్యభిచార గృహానికి అమ్మేసిన అధికార పార్టీనేతలు భూశంకర్‌, ఆప్కాబ్‌ చైర్మన్‌ కొండూరు అనిల్‌బాబుతో పాటు, ఈ ఘటనలో ప్రమేయం ఉన్న 70 మందిపై నేటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నరసారెడ్డి, మండల మాజీ  ఉపాధ్యక్షుడు అనుంపల్లె రాంప్రసాద్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాసులు నాయుడు, రాజంపేట పార్లమెంట్‌ రైతు విభాగం ఉపాధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి, బాబురెడ్డి, పెమ్మాడపల్లె సర్పంచ్‌ వాసు, మాజీ సర్పంచ్‌ బసయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-25T04:50:47+05:30 IST