ఆయకట్టుకు నీరందేనా..?

ABN , First Publish Date - 2022-09-26T04:58:41+05:30 IST

వరుణుడు కరుణించి జిల్లాలోని పడమటి మండలాల్లో సమృద్ధిగా వర్షాలు కురిశాయి.

ఆయకట్టుకు నీరందేనా..?
తంబళ్లపల్లె మండలంలో పూర్తి సామర్థ్యంతో ఉన్న పెద్దేరు ప్రాజెక్టు

నిండుకుండల్లా సాగునీటి ప్రాజెక్టులు

కంపచెట్లతో నిండిపోయిన కాలువలు

ప్రకృతి కరుణించినా..ప్రభుత్వం కనికరించలేదు


వరుణుడు కరుణించి జిల్లాలోని పడమటి మండలాల్లో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. వాగులు, ఏరుల్లో ప్రవహించిన నీరు చెక్‌డ్యాంల్లో ఇంకి మోతుబరి రైతుల వ్యవసాయ బోర్లలో సాగునీరు అందుబాటులో ఉంది. కానీ ఆయకట్టు నీటిపైనే ఆధారపడిన రైతులకు ఈ రబీ సీజన్‌లో సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారనుంది. కారణమేమంటే.. ప్రాజెక్టులు, చెరువుల నుంచి భూములకు సాగు నీరందించే కాలువల నిర్వహణ లేక పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇందులో ముళ్ల కంపల చెట్లు, పిచ్చి చెట్లు ఏపుగా పెరిగిపోవడంతో పాటు పూడికతో నిండిపోయి, నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారనున్నాయి. దీంతో పాటు పలు ప్రాంతాల్లో ఈ కాలువలకు స్లూయి్‌సల వద్ద రైతులు అడ్డంకులు పెట్టిన కారణంగా నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ కాలువల చివరన ఉన్న భూములకు సాగునీరు సరఫరా సమస్యగా మారనుంది.


మదనపల్లె టౌన్‌, సెప్టెంబరు 25: వరుణుడు కరుణించి జిల్లాలోని పడమటి మండలాల్లో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. వాగులు, ఏరుల్లో ప్రవహించిన నీరు చెక్‌డ్యాముల్లో ఇంకి మోతుబరి రైతుల వ్యవసాయ బోర్లలో సాగునీరు అందుబాటులో ఉంది. కానీ ఆయకట్టు నీటిపైనే ఆధారపడిన రైతులకు ఈ రబీ సీజన్‌లో సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారనుంది. డివిజన్‌లోని పెద్దేరు, బాహుదా ప్రాజెక్టులతో పాటు అతిపెద్ద చెరువులైన కందుకూరు వ్యాసరాయసముద్రం, పీటీఎం, సీటీఎం పెద్దచెరువులు ఇటీవల కురిసిన వర్షాలకు సమృద్ధిగా నీరు చేరి నిండుకుండలను తలపిస్తున్నాయి. కాగా గతంలో ఈ చెరువులు కరువుతో ఎండిపోవడంతో చెరువు, ప్రాజెక్టుల కింద ఆయకట్టు భూములకు నీరందించే సప్లయ్‌ ఛానల్‌ (కాలువలు) ఎండిపోయి, ముళ్ల చెట్లు, పొదలతో నిండిపోయాయి. దీంతో పాటు కొన్నిచోట్ల ఎలుకలు, బొరియలు పెట్టడంతో సీపేజి అయ్యాయి. మరికొన్ని చోట్ల రైతుల భూములకు ట్రాక్టర్లు వెళ్లేందుకు కాలువ గట్లు చెడగొట్టారు. ఈ క్రమంలో ఈ ఏడాది రబీ సీజన్‌లో ఒకవేళ ఆయకట్టు భూములకు సాగునీరు సరఫరా చేస్తే కాలువ చివరన ఉన్న ఆఖరు ఎకరాకు నీరందేదే ప్రశ్నార్థకంగా మారుతోంది.

డివిజన్‌లో పెద్దేరు, బాహుదా ప్రాజెక్టులతో పాటు పీటీఎం మండలంలోని కందుకూరి వ్యాసరాయసముద్రం, పీటీఎం చెరువు, రంగసముద్రం చెరువులతో పాటు మదనపల్లె మండలంలోని సీటీఎం పెద్ద చెరువులకు వేలాది ఎకరాల ఆయకట్టు భూములున్నాయి. ఇందులో తంబళ్లపల్లె మండలంలోని పెద్దేరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో నిండిపోయి 0.57 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు కుడి కాలువ 15 కిలోమీటర్ల పొడవు, ఎడమ కాలువ 26 కిలోమీటర్ల పొడవునా రెండు కాలువలకు కలిపి 5200 ఎకరాల ఆయకట్టు భూములున్నాయి. నిమ్మనపల్లె మండలంలోని బాహుదా ప్రాజెక్టు నిండిపోయి 387 ఎంసీఎ్‌ఫటీ నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు కుడికాలువ మూడు కిలోమీటర్లు, ఎడమ కాలువ రెండున్నర కిలోమీటర్ల పొడవుంది. 2880 ఎకరాల ఆయకట్టు ఉంది. వీటితో పాటు మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో ఉన్న చెరువుల కింద 36 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ క్రమంలో ఇటీవల కురిసిన వర్షాలకు కొంత మేర చెరువులు నిండాయి. 


రబీకి సాగునీరు సరఫరా అయ్యేనా...?

వచ్చే రబీ సీజన్‌లో చెరువులు, ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు చివరన ఉన్న భూములకు సాగునీరు అందేదే ప్రశ్నార్థకంగా మారుతోంది. కారణమేమంటే.. ప్రాజెక్టులు, చెరువుల నుంచి భూములకు సాగునీరందించే కాలువల నిర్వహణ లేక పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇందులో ముళ్ల కంపల చెట్లు, చెత్తచెట్లు ఏపుగా పెరిగిపోవడంతో పాటు పూడికతో నిండిపోయి నీటి ప్రవాహానికి అటంకంగా మారనున్నాయి. దీంతో పాటు పలు ప్రాంతాల్లో ఈ కాలువలకు స్లూయి్‌సల వద్ద రైతులు అడ్డంకులు పెట్టిన కారణంగా నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ కాలువల చివరన ఉన్న భూములకు సాగునీరు సరఫరా సమస్యగా మారనుంది.


నిధుల కొరతతో..నిర్వహణ సాగేదెలా..!

మదనపల్లె జల వనరుల శాఖ కింద ఉన్న చెరువులు, ప్రాజెక్టుల కాలువల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. ఇదిలా ఉండగా కాలువల నిర్వహణకు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయగా 1990 నుంచి ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయడం లేదు. అంతేకాకుండా వరదలు, వర్షాలు భారీగా పడినప్పుడు దెబ్బతిన్న చెరువు కట్టలు, కాలువల మరమ్మతుల కోసం అత్యవసర పనులు చేపట్టారు. ఎఫ్‌డీఆర్‌ (ఫ్లడ్‌ డ్యామేజి రిపేర్స్‌) కింద 2015 సంవత్సరంలో చేపట్టిన పనులకు రూ.42 లక్షలు, 2020 సంవత్సరంలో రూ.35 లక్షలు, గత ఏడాది నిర్వహించిన ఎఫ్‌డీఆర్‌ పనులకు రూ.16 లక్షలు మొత్తం కలిపి రూ.93 లక్షల వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో రాబోయే వర్షాకాలంలో చెరువు కట్టలు దెబ్బతింటే మరమ్మతులు చేయించడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం గగనమే. ఇకపోతే ప్రస్తుతం పెద్దేరు, బాహుదా కాలువల్లో పేరుకుపోయిన ముళ్లకంపలు, చెత్త, పూడిక తొలగించాలంటే, సీపేజి లేకుండా నీరు కాలువల చివర భూములకు చేరాలంటే పెద్దఎత్తున నిధులు అవసరమవుతాయి. పాత బిల్లుల చెల్లింపులకే దిక్కులేని ఈ పరిస్థితుల్లో కొత్త పనులు చేయడానికి ఎవరు ముందుకు వస్తారో అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోనుంది.


కాలువల నిర్వహణ కోసం ప్రతిపాదనలు పంపాము

- టి.సురేంద్రరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, జల వనరుల శాఖ, మదనపల్లె.

పెద్దేరు, బాహుదా కాలువల మరమ్మతుల పనుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాము. పెద్దేరు ప్రాజెక్టు రెండు కాలువల క్లీనింగ్‌, మరమ్మతు పనులకు రూ.3 కోట్లు, బాహుదా ప్రాజెక్టు కాలువల మరమ్మతు పనులకు రూ.కోటి అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాము. రబీ సీజన్‌లో కచ్చితంగా కాలువలకు నీరు వదులుతాము. నీటి సరఫరాలో సమస్యలేవైనా వస్తే అప్పటికప్పుడు పరిష్కారానికి కృషి చేస్తాం.Read more