అంతర్‌ జిల్లా ముఠా గుట్టురట్టు

ABN , First Publish Date - 2022-07-19T05:09:18+05:30 IST

దొంగనోట్లు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్న అంతర్‌జిల్లా ముఠా గుట్టును మదనపల్లె టూటౌన్‌ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ముగ్గురి నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ రవిమనోహరాచారి చెప్పారు. సోమవారం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.

అంతర్‌ జిల్లా ముఠా గుట్టురట్టు
నిందితులను అరెస్టు చూపుతున్న పోలీసులు

దొంగనోట్లను తయారు చేసే ముగ్గురు నిందితుల అరెస్టు    

నకిలీ నోట్లు స్వాధీనం

వాహనాలతో సహా నోట్లు తయారు చేసే సామగ్రి సీజ్‌

మదనపల్లె క్రైం, జూలై 18: దొంగనోట్లు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్న అంతర్‌జిల్లా ముఠా గుట్టును మదనపల్లె టూటౌన్‌ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ముగ్గురి నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ రవిమనోహరాచారి చెప్పారు. సోమవారం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. డీఎస్పీ కథనం మేరకు.. చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం పాలేరు పంచాయతీ నేతాజీనగర్‌కు చెందిన సోమశేఖర్‌(32), చిత్తూరు పట్టణం బీఎన్‌ఆర్‌ పేటకు చెందిన కరణం జగదీష్‌(35) టైల్స్‌ పనులు చేస్తుండేవారు. కాగా జగదీష్‌ సోదరుడు కరణం వెంకటేష్‌(32) భవన కార్మిక మేస్ర్తీగా పనిచేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురూ స్నేహితులుగా ఉండేవారు. జల్సాలు, విలాసా లకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో దొంగనోట్ల తయారీని వృత్తిగా ఎంచుకున్నారు. ఇందులో భాగంగా నోట్ల తయారీకి కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేసి నకిలీనోట్లు తయారు చేసేవారు. ముఖ్యం గా రూ.500, రూ.200 నోట్లను తయారు చేసి తిరునాళ్లు, వారపుసంత, మార్కెట్లలో చెలామణి చేసేవారు. ఈ క్ర మంలోనే రెండేళ్ల కిందట కోయంబత్తూరు నుంచి దొంగనో ట్లను తీసుకొచ్చి ఇక్కడ చెలామణి చేసేవారు. ఆ తరువాత ఈ ఏడాది జనవరిలో తమిళనాడు రాష్ట్రం వేలూరులో ప్రింటింగ్‌ యంత్రాన్ని, వాటికి అవసరమయ్యే సామగ్రిని కొనుగోలు చేసి నోట్లు తయారు చేస్తున్నారు. ఇదిలా వుండ గా ఇటీవల మదనపల్లె వారపుసంతలో నోట్లు చెలామణి చేస్తుండగా, వ్యాపారులు గుర్తించి టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు సంతకెళ్లి వీరి ముగ్గురినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం విచారణలో నేరం అంగీకరించారు. దీంతో వీరి గుట్టు రట్ట యింది. కాగా నిందితుల నుంచి నకిలీ రూ.500 నోట్లు 10, నకిలీ రూ.200 నోట్లు 142, ప్రింటర్‌, కత్తెర, దారం, ప్లాస్టిక్‌ టేపు, ఖరీదైన పేపర్‌తో సహా మూడు ద్విచక్ర వాహనాల ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సోమవారం నిందితులను రిమాండుకు తరలించి, వాహనాలతో సహా నకిలీనోట్లు, సామగ్రిని సీజ్‌ చేసినట్లు డీఎస్పీ వివరించారు. మరిన్ని కోణాల్లో కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. కాగా కేసు ఛేదనకు కృషి చేసిన సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ చంద్రమోహన్‌, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

ఒరిజనల్‌, నకిలీ కరెన్సీ నోట్ల చెలామణిలో ప్రజలు అప్ర మత్తంగా ఉండాలి. ఒరిజనల్‌, నకిలీ నోటుకు చాలా తే డా ఉంది. ముఖ్యంగా పేపర్‌ నాణ్యత, సెక్యూరిటీ త్రెడ్‌ పై ఆర్బీఐ అక్షరాలు, వాటర్‌మార్క్‌లో మహాత్మాగాంధీ బొమ్మను తప్పనిసరిగా పరిశీలించాలి. ఇవన్నీ ఉంటేనే అది ఒరిజనల్‌ నోటు అవుతుంది. ఈ అంశాలను ప్రజలు గుర్తుపెట్టుకుని నోట్లు చెలామణి చేయాలి. పొరపాటు పడితే డబ్బు పోగొట్టుకోక తప్పదు. నకిలీ నోట్ల చెలామణిపై పోలీసులకు సమాచారం ఇవ్వండి. 

- కె.రవిమనోహరాచారి, డీఎస్పీ, మదనపల్లె

Updated Date - 2022-07-19T05:09:18+05:30 IST