రహస్య నియామకాలతో అర్హులకు అన్యాయం

ABN , First Publish Date - 2022-10-09T04:31:22+05:30 IST

ఏపీ మోడల్‌ స్కూళ్లు, కళాశాలల్లో జరుగుతున్న రహస్య నియామకాల వల్ల అర్హులైన వారికి తీరని అన్యాయం జరుగుతోందని వాటిలో పనిచేస్తున్న పలువురు అతిథి ఉపాధ్యాయులు వాపోయారు.

రహస్య నియామకాలతో అర్హులకు అన్యాయం

ఏపీ ఆదర్శ పాఠశాలల అతిథి ఉపాధ్యాయ సంఘం నాయకులు


పీలేరు, అక్టోబరు 8: ఏపీ మోడల్‌ స్కూళ్లు, కళాశాలల్లో జరుగుతున్న రహస్య నియామకాల వల్ల అర్హులైన వారికి తీరని అన్యాయం జరుగుతోందని వాటిలో పనిచేస్తున్న పలువురు అతిథి ఉపాధ్యాయులు వాపోయారు. అధికారులు చేపట్టిన రహస్య నియామకాలను నిరసిస్తూ తాము త్వరలోనే రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ఏపీ ఆదర్శ పాఠశాలల అతిథి ఉపాధ్యాయుల సంఘ నాయకులు స్పష్టం చేశారు. పీలేరులో శనివారం జరిగిన సంఘ సమావేశంలో రాయలసీమ కన్వీనర్‌ నౌషాద్‌ఖాన్‌ మాట్లాడుతూ 2015 నుంచి రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లు, కళాశాలల్లో వేలాది మంది అతిథి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, రెగ్యులర్‌ ఉపాధ్యాయులతో సమానంగా పూర్తి స్థాయిలో విధులు నిర్వహించడమే కాకుండా కొవిడ్‌ సమయంలో కూడా సేవలు అందించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల్లో లాంగ్‌ స్టాండింగ్‌లో ఉన్న అతిథి ఉపాధ్యాయులకు ప్రాధాన్యత కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కడప ఆర్‌జేడీ, జేడీ, కమిషనర్‌లు వాటిని తుంగలో తొక్కి తమకు అనుకూలమైన వారికే పోస్టులు ఇస్తున్నారని ఆరోపించారు. రోస్టరు, మెరిట్‌ అంశాల్లో తమను మోసం చేయడమే కాకుండా దరఖాస్తుల పరిశీలనలో కూడా తమ దరఖాస్తులను దాచి పెడుతున్నారని ఆరోపించారు. వేలాదిమంది అతిథి ఉపాధ్యాయుల కుటుంబాలకు తీరని అన్యాయం చేస్తున్న అధికారుల తీరుపై తాము త్వరలోనే కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు అన్ని మార్గాల్లో శాంతియుత పోరాటాలు చేస్తామన్నారు. సమావేశంలో సంఘ నాయకులు రెడ్డిశేఖర్‌, రమేశ్‌బాబు, ఈశ్వర్‌, వెంకటేశ్‌, వెంకటరమణ, జింకా రమణ, ధనకొండయ్య, విజయ్‌కుమార్‌ నాయక్‌, తదితరులు పాల్గొన్నారు. 

Read more