బాలింతలకు పౌష్టికాహారం అందించాలి

ABN , First Publish Date - 2022-09-20T04:57:53+05:30 IST

అంగన్వాడీ సెంటర్ల ద్వారా బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందచేయాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా తెలిపారు.

బాలింతలకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడీ టీచర్లకు సెల్‌ఫోన్లు అందిస్తున్న కలెక్టర్‌ గిరీషా

అంగన్వాడీ టీచర్లకు సెల్‌ఫోన్లు అందజేసిన కలెక్టర్‌


రాయచోటి (కలెక్టరేట్‌), సెప్టెంబరు 19: అంగన్వాడీ సెంటర్ల ద్వారా బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందచేయాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో కలెక్టర్‌ చేతుల మీదుగా అంగన్వాడీ టీచర్లకు సెల్‌ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని, అంగన్వాడీ సెంటర్లలో జరిగే ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అంగన్వాడీ సెంటర్ల ఉపాధ్యాయులకు సూచించారు. అంగన్వాడీ సెంటర్ల పరిధిలో జరిగే వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఆన్‌లైన్‌ సర్వీసులు సెల్‌ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు పంపాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వం జిల్లాలోని 374 అంగన్వాడీ సెంటర్లలో పనిచేస్తున్న టీచర్లకు సెల్‌ఫోన్లు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కోడిగుడ్లు, బాలామృతం తదితర పౌష్టికాహారాలను చిన్నపిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు క్రమం తప్పకుండా ఇవ్వాలన్నారు. అంగన్వాడీ సెంటర్‌ పరిధిలో రక్తహీనత చిన్నారులు, బాలింతలు, గర్భవతులు ఉండకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ నిర్మల, సీడీపీవో శశికళ, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.


గడువులోపు అర్జీలు పరిష్కరించాలి

స్పందన అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, డీఆర్‌వో సత్యనారాయణ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి తమ సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమానికి వస్తున్నారన్నారు. అధికారులు బాధితుల సమస్యలు గుర్తించి వెంటనే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. స్పందన అర్జీలను పరిష్కార నివేదికతో పాటు ఫొటో కూడా అప్లోడ్‌ చేసి పరిష్కకరించాలన్నారు. సోమవారం స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను శనివారం లోపు క్లియర్‌ అయ్యేటట్లు చూడాలన్నారు. అధికారులు స్పందన అర్జీలను పరిశీలించిన తర్వాత అర్జీదారులకు అర్థమయ్యే విధంగా పరిష్కార నివేధిక పంపాలన్నారు. 

Updated Date - 2022-09-20T04:57:53+05:30 IST