వరి పట్ల రైతుల అనాసక్తి

ABN , First Publish Date - 2022-10-03T05:05:27+05:30 IST

వరి సాగు పట్ల రైతులు అనాసక్తిగా ఉన్నారు. పెరిగిన ఎరువుల ధరలు అలాగే కూలీ రేట్ల పెరుగుదలతో రైతులు అనాసక్తిగా ఉన్నారు.

వరి పట్ల రైతుల అనాసక్తి
అక్కిసిద్దుపల్లె చెరువు కింద బీళ్లుగా ఉన్న భూములు

పెరిగిన కూలి, ఎరువుల ధరలు

తిండి గింజలకే సాగు చేస్తున్న వైనం

కలసపాడు, అక్టోబరు 2: వరి సాగు పట్ల రైతులు అనాసక్తిగా ఉన్నారు. పెరిగిన ఎరువుల ధరలు అలాగే కూలీ రేట్ల పెరుగుదలతో రైతులు అనాసక్తిగా ఉన్నారు. గతేడాది ఖరీఫ్‌ సీజన్‌లో అనధికారికంగా ఐదువేల ఎకరాల్లో వరి సాగైంది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ఈ క్రాప్‌ నమోదు చేసినం త వరకు వెయ్యి నుంచి 1200 ఎకరాల్లో మాత్రమే వరి సాగైంది. గతేడాది వర్షాలు, తెగుళ్లతో దాదాపు 30 శాతం మేర కూడా దిగుబడి రాలేదు. దీంతో ఈ ఏడాది వరి సాగు పట్ల రైతన్నలు అనాసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాచ్చెరువు కింద, పెండ్లిమర్రి చెరువు కింద, పిడుగుపల్లె, అక్కిసిద్దుపల్లె, తడుకు చెరువుల కింద వరి ఎక్కువగా సాగవుతుంది. ప్రస్తుతం ఈ చెరువుల కింద వరి సాగు ఏ మాత్రం చేపట్టలేదు. కేవలం తిండి గింజల కోసం బోర్ల కింద రైతన్నలు అరెకరా, ఎకరా పొలంలో వరి నాటారు. ఎకరాకు దాదాపు కూలీలు, ఎరువులు, దుక్కులు అన్నీ కలిపి రూ.35వేల వరకు ఖర్చు వస్తుంది. గతేడాది దిగుబడి ఎకరాకు 10 నుంచి 12 మూటలు మాత్రమే వస్తోంది.

అకాల వర్షాలతో కొందరు రైతులకు అది కూడా రాలేదు. వడ్లు దాదాపు వెయ్యి రూపాయలు వంతున లెక్క వేసుకున్నా పది నుంచి రూ.12 వేలు మాత్రమే రావడంతో రూ.23వేలు నష్టపోయారు. దీంతో రైతన్నలు వరి మీద కంటే వాణిజ్య పంటలైన సజ్జ, పత్తి పంటలు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలాగే కొనసాగితే బియ్యం కొనాలంటే ప్రస్తుతం ఉన్న కిలో రూ.50లు వంద దాటినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఒక్క కలసపాడు మండలంలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా కానీ సన్న రకాలైనా ఎన్‌డీఎల్‌ఆర్‌ జిలకర మసూర బియ్యాన్ని భవిష్యత్తులో కొనలేని పరిస్థితులు వస్తాయి. 

ఖర్చులు పెరిగాయి - ఆసక్తి తగ్గింది

ఖర్చులు పెరిగాయి. రైతుల్లో వరి పైరు పట్ల ఆనాసక్తి పెరిగింది. విపరీతమైన తెగుళ్లతో కూడా పెట్టుబడులు పెరుగుతుండడంతో రైతన్నలు వరి పంటను ఎక్కువగా సాగు చేయడంలేదు. కేవలం తినేందుకు మాత్రమే వరి నాటుకుంటున్నారు. వాతావరణం గతేడాది అనుకూలించలేదు. ఈ ఏడాది అనుకూలించినా రైతన్నలు వరి పంట వేయడం పట్ల ఏ మాత్రం ఆసక్తి చూపడంలేదు. 

- సురే్‌షరెడ్డి, వ్యవసాయాధికారి, కలసపాడు

Read more