పద్యం పుట్టిన నేలలో.. మద్యం ప్రవహిస్తోంది

ABN , First Publish Date - 2022-08-21T06:38:00+05:30 IST

వైఎస్సార్‌ కడప జిల్లా సిద్దవటంలో జనసేన ఆధ్వర్యంలో శనివారం ‘కౌలు రైతుల భరోసా యాత్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డ 168 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున

పద్యం పుట్టిన నేలలో.. మద్యం ప్రవహిస్తోంది
ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలురైతు కుటుంబానికి ఆర్థికసాయం అందజేస్తున్న పవన్‌ కళ్యాణ్‌

కౌలు రైతులకు గుర్తింపుకార్డులు ఏవీ 

సరస్వతి విలసిల్లిన నేలలో ఉపాధి ఉద్యోగ వ్యవస్థలేవీ 

రాయలసీమ ఫ్యాక్షన్‌ ఆధిపత్య పోరులో ప్రజలు వెనకబడ్డారు

అన్నం పెట్టే రైతుకు కులం చూస్తారా 

కౌలు రైతు భరోసా యాత్రలో పవన్‌ కళ్యాణ్‌


‘‘రాయలసీమలో అల్లసాని పెద్దన నుంచి పద్యం పుట్టింది.  మరి అలాంటి నేలపై ఇప్పుడు మద్యం ప్రవహిస్తోంది. చీప్‌ లిక్కర్‌ తాగి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. సరస్వతి విలసిల్లిన ఈ నేలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. ఫ్యాక్షన్‌, ఆధిపత్య పోరాటంలో ప్రజలు మాత్రమే వెనుకబడ్డారు. నాయకులు వెనబడలేదు’’ అని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. 


కడప, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): వైఎస్సార్‌ కడప జిల్లా సిద్దవటంలో జనసేన ఆధ్వర్యంలో శనివారం ‘కౌలు రైతుల భరోసా యాత్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డ 168 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక చేయూత అందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలో సుమారు 60 వేల మంది కౌలు రైతులు ఉంటే కేవలం 2,223 మందికి మాత్రమే గుర్తింపు కార్డులు ఇచ్చారన్నారు. కౌలు రైతులకు గుర్తింపుకార్డు ఇవ్వాలన్న జ్ఞానం కూడా లేని వ్యక్తి ముఖ్యమంత్రి అన్నారు. ఇడుపుల పాయలో ఎస్టేట్‌లు ఉన్నాయని, ఆస్తులు సంపాదించారే కానీ కనీసం రైతులకు ఎందుకు సాయం చేయలేకపోతున్నారని అన్నారు.


ఒక్కసారి అవకాశం ఇవ్వండి

‘‘మార్పు కోసం గట్టి సంకల్పంతో జనసేన వచ్చింది. దెబ్బలు తినడానికి సిద్దమే, మార్పు కోసం ప్రయత్నం చేస్తాను. దెబ్బతగిలే కొద్ది బంతిలాగా పైకి లేస్తాను. అన్ని వ్యవస్థలను బలోపేతం చేస్తాను. జనసేనకు ఒకసారి అవకావం ఇవ్వండి’’ అన్నారు. పంటలు పండక ఆర్థిక సాయంత అందక కౌలు రైతులు ఆత్మహత్య పాల్పడుతున్నారన్నారు.


ఆ రోజు పార్టీని విలీనం చేయకుండా ఉంటే..

రాయలసీమ చదువుల నేల  అని, ఇలాంటి చోట ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుంటే యువత ఏమి చేయాలని పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించారు. ‘‘సమాజంలో అసమానతలను తొలగించేందుకు  2008లో అన్నయ్య పార్టీ పెట్టారు. అయితే ఇప్పుడు మంత్రులుగా ఉన్న వారు దగ్గరుండి ఆ పార్టీని జాతీయ పార్టీలో విలీనం చేశారు. ఆ రోజు విలీనం చేయకుండా ఉంటే ఈ రోజు రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదు. విలీనం చేయించినా ఏ నాడు పట్టించుకోలేదు. ఎన్టీఆర్‌ లాగా 9 నెలల్లో అధికారంలోకి వస్తానని పార్టీ పెట్టలేదు. మార్పు కోసం 2014లో పార్టీ పెట్టాను. రాజకీయాల్లో కష్టనష్టాలు తెలుసు. అందుకే పాతికేళ్ల ప్రస్థానం అన్నాను’’ అన్నారు.

 

ప్రజల మఽధ్య గొడవలు పెడుతున్నారు

‘‘కులాల మతాల గురించి నేనెప్పుడూ ఆలోచించను. మన దేశ సామాజిక మూల లక్షణం కులం. నేనెప్పుడూ వ్యక్తులపై పోరాటం చేయను. భావాలపై పోరాటం చేస్తాను. వారసత్వ రాజకీయాలకు ఎంతో కొంత అడ్డుకట్ట వేయాలని యువత, ఆడపడుచులను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నా. కులం, ప్రాంతం, మతం దాటొచ్చిన మనిషిని. వైసీపీ ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి మేలు జరుగుతుందనే ప్రచారం ఉంది. అయితే ఆత్మహత్య చేసుకున్న చాలా మంది కౌలు రైతుల్లో రెడ్డి  కుటుంబంలో వారే ఉన్నారు.  రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఆర్థిక వెసలుబాటు ఉంది. నేనెప్పుడూ కులాల గురించి మాట్లాడను. ఒక సోషల్‌ డాక్టర్‌లా మాట్లాడతాను. వైసీపీ ప్రభుత్వం అనంతపురం జిల్లాలోని జేసీ దివాకర్‌రెడ్డిని, జనసేనకు చెందిన మధుసూధన్‌రెడ్డిలను ఇబ్బందిపెడుతోంది. రాయలసీమ ప్రజలకు ఉపాధి లేకుండా చేసి ప్రజల మధ్య గొడవలు పెట్టి కులాల వారీగా విభజిస్తారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


కౌలు రైతులకు అండగా ఉంటా

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందని పవన్‌ కళ్యాణ్‌ భరోసా ఇచ్చారు. ‘‘నేను ఇచ్చే సాయంతో మీకు అన్నీ జరిగిపోతాయని కాదు. మీకు మేమున్నామనే భరోసా కల్పిస్తున్నాం. పులివెందుల్లో 45 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే సభకు రానివ్వకుండా 19 మందిని అడ్డుకున్నారు. మైదుకూరుకు చెందిన దివ్యాంగుడు పిడుగు నాగేంద్రరె డ్డి రైతు భరోసా కార్యక్రమంపై సోషల్‌ మీడియాలో చిన్న పోస్టు పెడితే.. దివ్యాంగుడు అని కూడా చూడకుండా బెదిరించారు. మీకు సిగ్గు ఉందా... వైసీపీ నేతలు సిగ్గుపడాలి. పేద వానికి, రైతులకు కులం ఉండదు. కులాల గురించి నేనెప్పుడూ ఆలోచించను. సిద్దవటం చూస్తే ఇక్కడ పుట్టి ఉంటే ఎలా ఉండేదనిపిస్తోంది. ఎంతో చూడతగ్గ ప్రదేశం. వెనుకబాటు తనానికి గురైంది. ఫ్యాక్షన్‌, ఆధిపత్య కారణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, విభజిత ఆంధ్రప్రదేశ్‌ను రాయలసీమ నాయకులే పరిపాలించారు. ప్రజలు మాత్రం వెనుకబడ్డారు’’ అంటూ పరోక్షంగా గత ముఖ్యమంత్రులను విమర్శించారు.


రూ.కోటి 68 లక్షలు పంపిణీ

కౌలు భరోసా యాత్రలో భాగంగా ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లాలో మొత్తం 168 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున పవన్‌ కళ్యాణ్‌ రూ.168 లక్షలు పంపిణీ చేశారు. మొత్తం 187 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు జనసేన గుర్తించింది. వీరిలో పులివెందుల నుంచి 19 మంది కుటుంబాలను రానివ్వకుండా అడ్డుకున్నారు. 3 గంటలా 47 నిమిషాలకు సభా ప్రాంగణానికి చేరుకున్న పవన్‌ కళ్యాణ్‌ 4.06 గంటలకు స్టేజిపైకి వచ్చారు. ఈ సందర్భంగా అప్పుల బాధతో చనిపోయిన కౌలు రైతు కుటుంబాలను ఆప్యాయంగా పలకరించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భరోసా ఉంటామని హామీ ఇచ్చారు. సుమారు గంట పైగా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.


ఆలస్యంగా కార్యక్రమం

పవన్‌ కళ్యాణ్‌ కార్యక్రమం శనివారం అనుకున్న సమయానికంటే రెండుగంటలు ఆలస్యంగా సాగింది. దీంతో ప్రజలు ఎండకు ఇబ్బంది పడ్డారు. షెడ్యూల్‌ ప్రకారం ప్రత్యేక విమానంలో పవన్‌ కళ్యాణ్‌ కడపకు మధ్యాహ్నమే చేరుకోవాల్సి ఉంది. రెండు గంటలకు సభ కార్యక్రమం మొదలు కావాల్సి ఉంది. దాదాపు 2 గంటలు ఆలస్యంగా పవన్‌ కళ్యాణ్‌ వచ్చారు. విమానాశ్రయం నుంచి ఓపెన్‌ టాప్‌ వాహనంలో ర్యాలీగా సిద్దవటంలో ఏర్పాటు చేసిన సభాస్థలి వద్దకు చేరుకున్నారు. పవన్‌ను చూసిన వెంటనే జనసైనికులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. జనసైనికులతో ఆ ప్రాంతం అంతా సందడి నెలకొంది. కార్యక్రమంలో పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, పార్టీ నేతలు నాగేంద్ర, అతికారి వెంకటయ్య, అతికార దినేష్‌, అతికారి క్రిష్ణ, రైతులు పాల్గొన్నారు.


కౌలు రైతులను అడ్డుకోవడం సిగ్గు చేటు : నాదెండ్ల మనోహర్‌

ఒంటిమిట్ట, ఆగస్టు 20: కౌలు రైతులను అడ్డుకోవడం సిగ్గుచేటని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. శనివారం సిద్దవటంలో జరిగిన కౌలురైతు భరోసా యాత్రలో ఆయన మాట్లాడుతూ సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో కౌలు రైతులను జనసేన పార్టీ సభకు రానివ్వకుండా అడ్డుకున్నారన్నారు. జిల్లాలో 187 మంది కౌలు రైతులకు లక్ష రూపాయల చొప్పున జనసేన పార్టీ పరిహారం అందించేందుకు నిర్ణయం తీసుకోగా వారిలో పులివెందుల నియోజకవర్గం నుండి 19 మంది కౌలు రైతులను రెండు రోజులుగా పోలీసులు, స్థానిక నాయకులతో కలిసి భయభ్రాంతులకు గురిచేశారన్నారు. జిల్లాలో ఏ ఒక్క కౌలు రైతులు మరణించలేదని మంత్రులు, వైసీపీ నాయకులు ప్రకటనలు జారీ చేస్తున్నారని తాము సొంతంగా సిద్ధం చేసిన జాబితా కాదని, ప్రభుత్వం, పోలీసుల నుంచి అందిన జాబితా ప్రకారమే జిల్లాలోని కౌలు రైతులకు పరిహారం చెల్లించామన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక్కొక్క కుటుంబానికి 7లక్షల రూపాయల నగదును చెల్లించి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 


పవన్‌ కళ్యాణ్‌ కాన్వాయిలో ప్రమాదం

జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ కాన్వాయిలో ముందు వెళుతున్న కొందరు యువకులు వేగంగా బైకులు నడపడంతో జాతీయ రహదారిపై స్పీడు బ్రేకరు వద్ద అదుపు తప్పి నాలుగు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. దీంతో నలుగురు గాయపడ్డారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించార. కౌలు రైతు భరోసా యాత్రకు వచ్చిన వారిలో ఓ బాలుడు శనివారం మధ్యాహ్నం ఎండవేడిమి తట్టుకోలేక స్పృహ కోల్పోయాడు. జనసైనికులు, స్థానికులు బాలుడిని స్థానిక ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.Read more