2022లో.. నేరచరిత్ర

ABN , First Publish Date - 2022-12-30T23:58:01+05:30 IST

జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్లలో కలిపి ఈ ఏడాది 12,842 కేసులు నమోదయ్యాయి. జరిగిన అన్ని రకాల నేరాలను ఒకసారి పరిశీలిస్తే.. 32 హత్యలు జరిగాయి.

2022లో.. నేరచరిత్ర
స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలతో ఎస్పీ

మానవత్వానికే మచ్చతెచ్చేలా హత్యలు

స్ర్తీలపై పెరిగిన దాడులు, అత్యాచారాలు

రక్తం చిందిన రోడ్లు

ఆగని ఎర్రచందనం అక్రమ రవాణా

అన్నమయ్య జిల్లాలో ఈ ఏడాది నేరచరిత్రను రాసింది. మానవత్వానికే మచ్చ తెచ్చే విధంగా పలు హత్యలు జరిగాయి. గతంతో పోల్చితే స్ర్తీలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎందరో ప్రాణాలు పోగొట్టు కోవడంతో పాటు మరెందరో అనాథలుగా మిగిలిపోయారు. పోలీసులు ఎన్ని దాడులు చేస్తున్నా.. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. 2022 సంవత్సరంలో జిల్లాలో జరిగిన నేరాలు- ఘోరాలపై ఆంధ్రజ్యోతి అందిస్తున్న ప్రత్యేక కథనం..

(రాయచోటి-ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్లలో కలిపి ఈ ఏడాది 12,842 కేసులు నమోదయ్యాయి. జరిగిన అన్ని రకాల నేరాలను ఒకసారి పరిశీలిస్తే.. 32 హత్యలు జరిగాయి. హత్యదోపిడీ సంఘటన 1 జరిగింది. డెకాయిట్‌ కేసు 1, రాబరీ కేసులు 4, ఇళ్ల తాళాలు పగులగొట్టి దోపిడీ సంఘటనలు 4, సాధారణ దొంగతనాలు 3, అత్యాచారాలు 36, ఆత్మహత్యలు 3, ఘోర రోడ్డు ప్రమాదాలు 7, స్ర్తీలపైన దాడులు 691, ఎస్సీ, ఎస్టీ కేసులు 70 జరిగాయి. నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లపైన పీడీయాక్టు అమలు చేశారు.

కోట్ల రూపాయల రికవరీ

ఎక్కువ తీవ్రత కలిగిన దోపిడీ నేరాలలో 13 కేసుల్లో రూ.10,002,202 విలువ చేసే సొమ్ము చోరీకి గురైంది. అందులో 12 కేసుల్లో రూ.82,47,612ను నిందితుల నుంచి స్వాధీన పర్చుకున్నారు. కొంత తీవ్రత తక్కువగా ఉన్న దోపిడీ కేసులు 368 గానూ రూ.2,98,34,931 చోరికి గురైంది. అందులో 249 కేసుల్లో రూ.1,60,02,335లు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.

ఆగని ఎర్రచందనం స్మగ్లింగ్‌

నూతన జిల్లాలో ఇప్పటి వరకు నలుగురు స్మగ్లర్లపై పీడీ యాక్టును అమలు చేశారు. 22 కేసుల్లో 135 మందిని అరెస్టు చేశారు. రూ.2,45,97,600 విలువ చేసే 272 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు ఉపయోగించే 25 వాహనాలను స్వాధీనపర్చుకున్నారు. పాత ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో పరారీలో ఉన్న 188 ముద్దాయిలను అరెస్టు చేశారు.

బంగారు దుకాణంలో చోరీ..

జిల్లాలో పలు దొంగతనాలు జర గ్గా.. అందులో ముఖ్యమైనది చి న్నమండెం మండల కేంద్రంలోని న్యూ వీఆర్‌ జ్యువెలర్స్‌ దుకాణంలో జరిగిన కేసు గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. జులై 15న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జ్యువెలర్స్‌ తాళాలు పగులగొట్టి.. దుకాణంలోకి వెళ్లి.. రూ.30 లక్షల విలువైన బంగారు నగలు, రూ.38 వేలు విలువైన వెండిని దోచుకెళ్లారు. ఈ సంఘటన స్థలంలో పోలీసులకు ఎటువంటి క్లూ దొరకలేదు. అయితే సంఘటన జరిగిన ప్రాంతానికి దాదాపు పది కి.మీ. దూరంలో, ఒక బైక్‌ వెళ్లిన సీసీ పుటేజ్‌ ఆధారంగా రాయచోటి రూరల్‌, అర్బన్‌ పోలీసులు, ప్రత్యేక బృందాలు వందల కిలోమీటర్లు విచారణ చేసుకుంటూ.. వెళితే.. చిత్తూరు జిల్లా బంగారుపాల్యెం హరిజనవాడకు చెందిన రాజేష్‌ అనే ముద్దాయి దొరికాడు. అతని వద్ద నుంచి మొత్తం సొత్తు రికవరీ చేశారు.

అంతర్జాతీయ కాల్స్‌ ముఠా గుట్టురట్టు

కేరళకు చెందిన మగ్గురు నేరస్థులు చట్ట విరుద్దంగా టెలిఫోన్‌ ఎక్సేంజిని ఏర్పాటు చేసి భారత టెలికాం శాఖకు మోసం చేస్తున్నారు. ఈ సమాచారంతో రాయచోటి అర్బన్‌ పోలీసులు బెంగుళూరులో నిందితుల స్థావరాలపై దాడులు చేసి అరెస్టు చేశారు. వారి నుంచి అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌ చేయడానికి ఉపయోగించే 74 గేట్‌ వే డివైన్లు, 28 రూటర్స్‌, ల్యాప్‌టాప్‌, ఆరు సెల్‌ఫోన్లు, నిస్సాన్‌ సన్నీ కారును స్వాధీనం చేసుకున్నారు.

రక్తం చిందిన రోడ్లు

జిల్లాలో ఏడాది కాలంలో 299 ఘోర రోడ్డు ప్రమాదాలు, 419 సాధారణ ప్రమాదాలు జరిగాయి. అందులో 337 మంది మృతిచెందారు. 835 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే..

-మదనపల్లె మండల పరిధిలో రింగురోడ్డు 150 మైల్‌ స్టోన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. ఈ ప్రమాదంలో నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన గంగిరెడ్డి, మధులత, కొడుకు దేవాన్స్‌రెడ్డి, కూతురు కుషితలు అక్కడికక్కడే చనిపోయారు. వివాహానికి వెళ్లి వస్తుండగా.. అర్ధరాత్రి పూట ఈ ప్రమాదం జరిగింది.

- రైల్వేకోడూరు మండలం మంగంపేట సమీపంలో జూలై 24న ఆటో-లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు.

- రాయచోటి డివిజన్‌లో 28, మదనపల్లె డివిజన్‌లో 09, రాజంపేట డివిజన్‌లో 23 బ్లాక్‌స్పాట్లుగా (ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రదేశాలు) పోలీసులు గుర్తించారు.

మిస్సింగ్‌ కేసులు

ఈ ఏడాది జిల్లాలో ఇప్పటి వరకు 475 మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో 390 కేసుల్లో తప్పిపోయిన వారిని పోలీసులు పట్టుకొచ్చి సంబంధీకులకు అప్పజెప్పారు.

632 కిలోల గంజాయి ధ్వంసం

జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా కేసులు 44 నమోదయ్యాయి. ఈ కేసుల్లో రూ.96 లక్షల విలువైన 632 కిలోల గంజాయిని స్వాధీన పర్చుకుని.. ఈనెల 25న ధ్వంసం చేశారు. అదే విధంగా 2362 నాటుసారా కేసుల్లో 15570 లీటర్లు స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమ రవాణా 359 కేసుల్లో 1537 లీటర్లు స్వాదీనం చేసుకున్నారు. 16066 మద్యంబాటిళ్లను స్వాధీనం చేసుకుని 3422 మందిని అరెస్టు చేశారు. నాటుసారా, మద్యాన్ని ధ్వంసం చేశారు.

మానవత్వానికే మచ్చ తెచ్చేలా..

ఈ ఏడాది జిల్లాలో 32 హత్యలు జరగ్గా.. అందు లో కొన్ని మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి.

- రాయచోటి పట్టణం కొత్తపేట రామాపురంలో ఆగస్టు 11న వసుంధర అనే మహిళను ఆమె చిన్నత్త, సోదరుని వరుస అయ్యే ఇద్దరు కలిసి దారుణంగా హత్య చేశారు. మృతురాలి తలను వేరు చేసి.. తలను చేతితో పట్టుకుని పోలీసుస్టేషన్‌కు నిందితులు వెళ్లారు. ఆస్తి కోసం ఈ హత్య జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేపింది.

- మార్చి 11న పట్టణంలోని సయిదియా థియేటర్‌ సమీపంలో నివాసం ఉంటున్న కొప్పు కళావతి అనే మహిళ శిబ్యాల గ్రామం అనుంపల్లె సమీపంలోని అడవిలో దారుణ హత్యకు గురైంది. ఆమెతో పరిచయం ఉన్న ఆటో డ్రైవర్‌.. తన అప్పులు తీర్చుకోవడం కోసం.. ఆమెను నమ్మించి ఒంటరిగా తీసుకెళ్లి గొంతుకోసి ఆమె ఒంటిపైన ఉన్న బంగారు నగలను దోచుకున్నాడు. పెట్రోలు పోసి ఆమె శవాన్ని తగులపెట్టాడు. ఎటువంటి ఆనవాళ్లు దొరక్కపోయినా.. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోలీసులు కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు.

- రాజంపేట పట్టణంలో ఈ నెల 16న అంకాలరెడ్డి అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. అతనిపైన పెట్రోలు పోసి తగులపెట్టారు. సీసీ పుటే జి ఆధారంగా.. కేసును విచారించిన పోలీసులు అతనితో 10 సంవత్సరాలుగా సహజీవనం చేస్తు న్న మహిళే హత్య చేసి తగులపెట్టినట్లు గుర్తించారు. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.

-2020 జూలై 17న రైల్వేకోడూరు మైసూరుపల్లిలో జ్యోతిరాజా అనే వ్యక్తి హత్యకు గురయ్యా డు. హత్యా స్థలంలో ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు. అయితే పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారించి, హత్య చేసి పరారై.. చెన్నైలో ఉం టున్న నిందితుడిని రెండు సంవత్సరాల తర్వాత అరెస్టు చేశారు.

Updated Date - 2022-12-30T23:58:01+05:30 IST

Read more