చినుకు రాలితే.. పట్టలు కప్పాల్సిందే..!

ABN , First Publish Date - 2022-10-04T05:41:48+05:30 IST

మండల కేంద్రంలోని తహసీల్దార్‌, పశువైద్యశాల కార్యాలయాలు చినుకు రాలితే రికార్డులపై ప్లాస్టిక్‌ పట్టలు కప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏ భవనం చూసినా పెచ్చులూడుతూ.. భవనంలోని కడ్డీలు బయటకు కనబడుతున్నాయి.

చినుకు రాలితే.. పట్టలు కప్పాల్సిందే..!
వర్షానికి తహసీల్దారు కార్యాలయంలోని రికార్డు రూములో పట్టలు కప్పిన దృశ్యం

పెచ్చులూడుతున్న ప్రభుత్వ కార్యాలయాలు

ఇబ్బందిపడుతున్న అధికారులు

చిన్నమండెం, అక్టోబరు 3: మండల కేంద్రంలోని తహసీల్దార్‌, పశువైద్యశాల కార్యాలయాలు చినుకు రాలితే రికార్డులపై ప్లాస్టిక్‌ పట్టలు కప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏ భవనం చూసినా పెచ్చులూడుతూ.. భవనంలోని కడ్డీలు బయటకు కనబడుతున్నాయి. 

2005 సంవత్సరంలో మండలంలోని తహసీల్దార్‌ నూతన కార్యాలయాన్ని నిర్మించారు. అయితే కార్యాలయం ఎక్కడ చూసినా జల్లెడలో నీళ్లు పోసినట్లు చినుకురాలితే రికార్డులన్నీ తడిసి ముద్దవుతున్నాయి. రికార్డు రూముల్లో వర్షపు నీరు నిల్వ ఉన్నాయి. ఎంతో ముఖ్యమైన రికార్డులు తడిసి ముద్దవుతున్నాయి. కొన్ని రూములకు అయితే కనీసం కిటీకీలు కూడా లేవు. అలాగే మండల కేంద్రంలో 1964 సంవత్సరంలో దాతలు ఇచ్చిన విస్తీర్ణంలో పశువైద్యశాల నిర్మించారు. చాలాకాలం నాటి ఆసుపత్రి కావడంతో పెచ్చులూడుతూ కొద్దిపాటి వర్షానికే నీరు గారుతోంది. వర్షాభావ ప్రాంతమైన చిన్నమండెం మండల రైతులు కొందరు పాడి పరిశ్రమపై దృష్టి పెట్టి జెర్సీ ఆవులను మండ లంలో అధిక సంఖ్యలో పెంచుతున్నారు. దీంతో ఆవులకు అనారోగ్య సమస్యలు ఎక్కువై పశువైద్య శాలకు వస్తుంటారు. ఆసుపత్రిలో కూర్చోవాలంటే ఎక్కడ పెచ్చులూడి మీద పడతాయో అంటూ భయపడుతున్నారు. చాలా వరకు పెచ్చులు ఊడిపోయి కాంక్రీట్‌ కడ్డీలు దర్శనమిస్తున్నాయి. ఆసుపత్రి పరిసర ప్రాంతంలో పిచ్చిమొక్కలు, కంపచెట్లు దర్శనమిస్తూ కనీసం బాత్‌రూములు, మంచినీటి సౌకర్యం లేక తాళం వేళారు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కాలకృత్యాలకు వెళ్లాలన్నా వెళ్లలేని దయనీయ స్థితిలో పశువైద్యశాల దర్శనమిస్తోంది. 



Updated Date - 2022-10-04T05:41:48+05:30 IST