రూ.35వేలు ఇవ్వండి...!

ABN , First Publish Date - 2022-09-30T05:54:09+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం లక్ష్యం చేరడం లేదు. ఇల్లు లేని పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశ్యంతో ఇళ్ల నిర్మాణ పథకానికి శ్రీకారం చుడితే.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా నిర్మాణాలు ముందుకు సాగడంలేదు. పాదయాత్రలో రూ.5లక్షలతో ఇల్లు కట్టించి

రూ.35వేలు ఇవ్వండి...!
పులివెందుల జేఎన్‌టీయూ సమీపంలో బేస్‌మట్టం లెవల్‌లో ఉన్న జగనన్న నిర్మాణాలు

జగనన్న ఇళ్ల నిర్మాణానికి అదనంగా డబ్బు వసూళ్లు

ఇదీ పులివెందులలో జరుగుతున్న తీరు


‘నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు’ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం. రూ.1.80లక్షలతో ఇంటి నిర్మాణాలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్లు నిర్మించుకోలేని వారికి తామే నిర్మించి ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. నిర్మాణానికి సంబంధించి వాస్తవ లెక్కలు చూశాక కళ్లు తేలేశారు. ప్రభుత్వం తాము నిర్మించలేమని తేల్చి చెప్పేసింది. లబ్ధిదారులే నిర్మించుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అయితే జిల్లాలోని కొన్ని చోట్ల మాత్రం ప్రభుత్వమే కాంట్రాక్టర్ల ద్వారా నిర్మించేందుకు పూనుకుంది. దీనికి లబ్ధిదారులు సంతోషించారు. ఇప్పటికి కేవలం బేస్‌మట్టం వరకు కూడా పూర్తి కాలేదు. తమకు ప్రభుత్వం ఇచ్చే రూ.1.80లక్షలు చాలదని, లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ రూ.35 వేలు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు కమిషనర్‌ చెప్పారంటూ ఓ వలంటీర్‌ పంపిన వాయిస్‌ మెసేజ్‌ బయటకు వచ్చింది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఎక్కడో కాదు.. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో..


(కడప - ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం లక్ష్యం చేరడం లేదు. ఇల్లు లేని పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశ్యంతో ఇళ్ల నిర్మాణ పథకానికి శ్రీకారం చుడితే.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా నిర్మాణాలు ముందుకు సాగడంలేదు. పాదయాత్రలో రూ.5లక్షలతో ఇల్లు కట్టించి లబ్ధిదారులకు ఇంటి తాళం చెవి ఇస్తానని గొప్పగా  చెప్పిన జగన్‌.. సీఎం అయ్యాక మాట మార్చారు. పట్టణాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంటు స్థలమిచ్చి ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు కేటాయించారు. ప్రభుత్వమే సొంతంగా ఇల్లు నిర్మిస్తుందని చెప్పి ఆప్షన్లు కూడా ఇచ్చారు. అయితే చివరికి ప్రభుత్వం ఆ ఆప్షన్లు ఎత్తేసింది. ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరగడం లేదు. అయితే సీఎం సొంత ఊరు పులివెందులలో ప్రభుత్వమే ఓ కాంట్రాక్టు సంస్థ ద్వారా ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. అంటే ప్రభుత్వమిచ్చే రూ.1.80 లక్షల వ్యయంతోనే ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఇంటి నిర్మాణ వ్యయం పెరిగిందని, కనుక ఒక్కో లబ్ధిదారుడు రూ.35వేలు ఇవ్వాలంటూ వలంటీర్లు లబ్ధిదారులకు చెబుతుండడం గమనార్హం. మా దగ్గరే డబ్బుంటే.. మేమే ఇల్లు కట్టుకునేవారం కదా అంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

జగనన్న గృహ నిర్మాణాలను కలెక్టర్‌ విజయరామరాజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిర్మాణాలు వేగవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తున్నారు. వారానికి రెండు రోజులు గృహాల పురోగతిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పులివెందుల, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, చెన్నూరులో మంజూరైన ఇళ్లను కాంట్రాక్టర్ల ద్వారా నిర్మిస్తున్నారు. అంటే లబ్ధిదారులకు సంబంధం లేకుండానే ఇంటిని నిర్మించి లబ్ధిదారులకు అందిస్తారు.


రూ.35వేలు ఇవ్వండి

పులివెందుల అర్బన్‌లో 8,152, రూరల్‌లో 658 జగనన్న ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో పులివెందులలోని జేఎన్‌టీయూ సమీపంలో గల జగనన్న లేఅవుట్‌లో 7,322 ఇళ్లు మంజూరు చేశారు. అనంతపురం జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధికి చెందిన కాంట్రాక్టు సంస్థ ఇళ్ల నిర్మాణాలు మొదలెట్టింది. ఇప్పటి వరకు 3,450 ఇళ్లు బేస్‌మట్టం స్థాయిలో ఉన్నాయి.


నిర్మాణ వ్యయం పెరిగింది

జగనన్న ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వమే తొలుత మూడు ఆప్షన్లు ఇచ్చింది. ఇల్లు నిర్మించుకునేవారికి ప్రభుత్వమే నిర్మిస్తామని మూడో ఆప్షన్‌ ఇచ్చింది. జిల్లాలో సగం మందికి పైగా మూడో ఆప్షన్‌ ఎంచుకున్నారు. ప్రభుత్వమే ఇల్లు కట్టించాలంటే ఖజానాకు ఆర్థిక భారం పడుతుందని చేతులెత్తేసింది. దీంతో కొన్ని చోట్ల స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధులు, నేతలు ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతోనే నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వచ్చారు. సీఎం సొంతూరు పులివెందులలో కూడా కాంట్రాక్టరు ద్వారా ఇళ్లు నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇళ్ల నిర్మాణ వ్యయం పెరిగిందనే సాకుతో లబ్ధిదారుల వద్ద డబ్బులు గుంజేందుకు శ్రీకారం చుట్టారు. నిర్మాణ వ్యయం పెరిగింది, కనుక ఒక్కో లబ్ధిదారు రూ.35వేలు ఇవ్వాలని కమిషనర్‌ చెప్పారని ఓ వలంటీరు ఆమె పరిధిలో పోస్టు చేసిన వాట్సప్‌ వాయిస్‌ కాల్‌తో లబ్ధిదారుల్లో ఆందోళన రేకెత్తుతోంది. సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల కావడంతో ప్రభుత్వమే ఇళ్లు నిర్మిస్తుందని సంతోషించారు. ఇప్పుడు నిర్మాణానికి ఒక్కో ఇంటికి రూ.35వేలు ఇమ్మంటున్నారు. ఆ డబ్బే మా వద్ద ఉంటే మేమే నిర్మించుకునేవారం కదా అంటూ లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పుడీ వ్యవహారం పై పులివెందులలోని జగనన్న ఇళ్ల లబ్ధిదారుల్లో చర్చలు సాగుతున్నాయి. అయితే పులివెందులలో కాంట్రాక్టర్‌ ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ చాలా మటుకు బేస్‌మట్టం స్థాయికి దాటకపోవడం గమనార్హం.

కాగా.. ఒక్కో ఇంటికి రూ.35 వేలు అడగడంపై పులివెందుల కమిషనర్‌ నరసింహారెడ్డిని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా.. డబ్బులు అడిగింది వాస్తవమేనని, నిర్మాణాలలో నాణ్యత కోసమే అడిగామని చెప్పారు.

Updated Date - 2022-09-30T05:54:09+05:30 IST