రైతుల్లో మాండస్‌ భయం

ABN , First Publish Date - 2022-12-09T23:41:41+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడ్డ మాండస్‌ తుఫాను జిల్లా రైతులను భయాందోళనకు గురిచేస్తోంది. తుఫాను జిల్లాపై ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ ముందస్తుగానే ప్రకటించింది. అందుకు తగ్గట్లుగానే శుక్రవారం ఉదయం నుంచే వాతావరణం మేఘావృతమై, చలిగాలులు

రైతుల్లో మాండస్‌ భయం

8 వేల ఎకరాల్లో కోతకు వచ్చిన వరి

వర్షం కురిస్తే పంటలు దెబ్బతింటాయన్న భయం

జిల్లాలో వర్షం.. అధికారుల అలర్ట్‌

(కడప - ఆంరఽధజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడ్డ మాండస్‌ తుఫాను జిల్లా రైతులను భయాందోళనకు గురిచేస్తోంది. తుఫాను జిల్లాపై ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ ముందస్తుగానే ప్రకటించింది. అందుకు తగ్గట్లుగానే శుక్రవారం ఉదయం నుంచే వాతావరణం మేఘావృతమై, చలిగాలులు వీచాయి. సాయంత్రం నుంచి జిల్లాలో అక్కడక్కడా చినుకులు పడడం మొదలయ్యాయి. ఇదే రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే జిల్లాలో వరి సాగుచేసిన రైతు కుదేలయ్యాడు. కనీసం పెట్టుబడి రాకపోవడంతో ఈ ఏడాది చాలామంది రైతులు వరి సాగు చేయలేదు. అయితే వ్యవసాయం తప్ప వేరే వ్యాపకం తెలియని రైతులు భూమి తల్లిని నమ్ముకుని పంట సాగు చేశారు. వరి వేస్తే రైతులకు ఉరి అనే ప్రచారం ఉన్నప్పటికీ పలువురికి పట్టెడన్నం పెట్టే రైతన్న ఆ ప్రయత్నం విరమించుకోక సాగు చేశారు. ఇప్పుడు ఆ రైతులకు మాండస్‌ రూపంలో ముప్పు ముంచుకొస్తోంది.

వరి రైతుల్లో బెంగ

తుఫాను ప్రభావం వరి రైతుపై తీవ్ర ప్రభావం చూపనుంది. జిల్లాలో కేసీ కెనాల్‌, బ్రహ్మంసాగర్‌తో పాటు, వ్యవసాయ బోర్ల పరిధిలో వరి సాగులో ఉంది. వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారమే 26వేల హెక్టార్లలో సాగులో ఉండగా, 10వేల హెక్టార్లలో పంట దిగుబడి వచ్చింది. మరో 16 వేల హెక్టార్లలో వివిధ దశల్లో ఉంది. సుమారు 8వేల ఎకరాల్లో పంట కోతకు వచ్చింది. కొందరు రైతులు కోతలకు సిద్ధమవుతుండగా మరికొంత మంది రైతులు తుఫానును అంచనా వేయలేక వరికోతలు కోసేశారు. ఇప్పుడు తుఫాను రావడడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధికార యంత్రాంగం రైతుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఆర్‌బీకేలో నమోదు చేసుకున్న మేరకే వీరు వరి సాగును లెక్కిస్తున్నారు. ఆ మేరకు వీరికి అధికారులు ఏదైనా సాయం చేసే అవకాశం ఉంది. వాస్తవానికి ఆర్‌బీకేలో నమోదు కాని సాగు విస్తీర్ణం మరింత ఉంటుంది. దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని సమాచారం. చెన్నూరు, ఖాజీపేట, మైదుకూరు, చాపాడు, రాజుపాలెం, ప్రొద్దుటూరు, దువ్వూరు, కడప పరిధిలో వరి ఎక్కువగా సాగులో ఉంది. తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలోని కలసపాడు, పోరుమామిళ్ల, కాశినాయన, బి.కోడూరు, బద్వేలు మండలాల్లో వరిసాగులో ఉంది. ఆరుగాలం కష్టపడి కన్నబిడ్డల్లా సాక్కున్న వరి పంట ఇప్పుడు నోటికాడకొచ్చింది. అయితే మాండస్‌ రూపంలో ఆ పంట ఉనికికే ప్రమాదం పొంచి ఉండడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొట్టదశ, నూర్పిడి దశలో ఉన్న వరి తుఫానుతో దెబ్బతినే అవకాశం ఉంది.

ఇలా చేయండి

తుఫాను నేపథ్యంలో వరి పంటను కాపాడుకునేందుకు వ్యవసాయశాఖ అధికారుల సూచనలను రైతులు పాటించాలని జేడీ నాగేశ్వర్‌రావు వివరించారు. నాలుగైదు రోజుల పాటు ఎవరూ కోతలు కోయకూడదన్నారు. ఒకవేళ కోత కోసినా వెంటనే ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. భారీ వర్షం కురిస్తే పంట దెబ్బతినకుండా ఉండేందుకు గట్లకు గండి కొడితే వర్షం నీరు నిల్వ ఉండదన్నారు. జిల్లాలో రబీలో ఎక్కువగా వేరుశెనగ, శెనగ పంట సాగు చేశారని అన్నారు. ఒకవేళ వర్షం వస్తే ఈ పంటలు దెబ్బతినకుండా ఉండేందుకు గట్లు తెగ్గొట్టాలని సూచించారు.

అలర్ట్‌... అలర్ట్‌

భారీ వర్షాలు కురిసే అవకాశం

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నాలుగు డివిజన్లలో కంట్రోల్‌ రూముల ఏర్పాటు

హెచ్చరికలు జారీ చేసిన కలెక్టర్‌

కడప(కలెక్టరేట్‌), డిసెంబరు 9 : తుఫాను ప్రభావం వల్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ విజయరామరాజు శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. తఫాను మరింత బలపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ప్రజల ఇబ్బందులు తెలిపేందుకు కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశామన్నారు. తుఫాను దృష్ట్యా నదులు, వంకలు, పరివాహ ప్రాంతాలు, అన్ని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రెవెన్యూ సహాయక శిబిరాలకు సన్నద్ధంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు తాత్కాలిక పునరావాస కేంద్రాలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తక్షణమే కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లకు పోన్‌ చేయాలని ప్రజలకు సూచించారు.

కంట్రోల్‌ రూమ్‌ల ఫోన్‌ నెంబర్లు

కలెక్టరేట్‌ కార్యాలయం : 08562-246344

కడప రెవెన్యూ డివిజన్‌ : 08562-295990

జమ్మలమడుగు డివిజన్‌ : 94407 67485

బద్వేలు డివిజన్‌ : 91821 60052

పులివెందుల డివిజన్‌ : 98664 69303

విద్యుత్‌ సమస్యలు ఏర్పడితే..

మాండస్‌ తుఫాన్‌తో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడే విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం కడపలో కంట్రోల్‌ రూము ఏర్పాటు చేశామని కడప డివిజన్‌ విద్యుత్‌ శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు ఎల్‌ఎన్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ కంట్రోలు రూము 24గంటలు పనిచేస్తుందన్నారు. విద్యుత్‌ సమస్యలపై 08562 - 242572, 9440817441 నెంబర్లకు కాల్‌ చేసి పరిష్కరించుకోవాలన్నారు. విద్యుత్‌ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెగి పడిన లైన్లను తాకకుండా సంబంధిత అధికారులకు ఫోన్‌ చేసి తెలపాలని సూచించారు.

Updated Date - 2022-12-09T23:41:44+05:30 IST