పెద్దలే గద్దలు..!

ABN , First Publish Date - 2022-11-17T00:46:10+05:30 IST

కడప నగరంలో ఇప్పుడు భూములకు ఎక్కడ లేని విలువ వచ్చింది. ముఖ్యంగా కడప నగరం చుట్టూ సీకేదిన్నె, చెన్నూరు, వల్లూరు మండలాల పరిధిలోని భూములు ఎకరం రూ.3కోట్ల నుంచి రూ.8 కోట్ల మధ్య పలుకుతున్నాయి. ముఖ్యంగా సీకేదిన్నె రెవెన్యూ భూములన్నీ

పెద్దలే గద్దలు..!

గొర్రెల కాపరుల స్థలంపై కన్ను

తప్పుడు మార్గాల్లో దక్కించుకునే యత్నం

రూ.15 కోట్ల భూమిపై కన్ను

దున్నేవాడిదే భూమి.. ఇదొకప్పటి నినాదం. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ డైలాగ్‌ చేంజ్‌ అయింది. ఇప్పుడు బలవంతుడిదే భూమి.. నువ్వు ఎన్నో ఏళ్లుగా కుటుంబ పెద్దల నుంచి వారసత్వంగా వచ్చే భూములను అనుభవిస్తున్నప్పటికీ విలువైనదైతే చాలు.. అది బలవంతుని చేతుల్లో పెట్టాల్సిందే. వారు చెప్పిన రేటుకు ఇస్తే గుట్టు చప్పుడు కాకుండా డీల్‌ కుదుర్చుకుని భూమి సొంతం చేసుకుంటారు. లేదు గీదు అంటే ఆ భూమిపైన మాకూ హక్కులున్నాయంటూ పత్రాలు వస్తాయి. అధికారం ముందు పేదోనికి న్యాయం కరువు అవుతుంది. ఇటీవల కడపలో ఇలాంటి సెటిల్‌మెంట్లు కోకొల్లలుగా జరుగుతున్నాయి. తాజాగా గొర్రెల కాపరుల స్థలంపై పెద్దల కన్ను పడింది.

(కడప - ఆంఽధ్రజ్యోతి): కడప నగరంలో ఇప్పుడు భూములకు ఎక్కడ లేని విలువ వచ్చింది. ముఖ్యంగా కడప నగరం చుట్టూ సీకేదిన్నె, చెన్నూరు, వల్లూరు మండలాల పరిధిలోని భూములు ఎకరం రూ.3కోట్ల నుంచి రూ.8 కోట్ల మధ్య పలుకుతున్నాయి. ముఖ్యంగా సీకేదిన్నె రెవెన్యూ భూములన్నీ కడప నగర పరిధిలో ఉన్నాయి. ఇటు ఎర్రముక్కపల్లె మొదలుకుని మామిళ్లపల్లె, రింగు రోడ్డు, రిమ్స్‌, అటు పులివెందుల రోడ్డు వరకు ఎటు చూసినా సీకేదిన్నె రెవెన్యూ పరిధిలోనే ఉన్నాయి. పులివెందుల రింగు రోడ్డు చుట్టూ పెద్ద ఎత్తున వెంచర్లు వెలుస్తున్నాయి. కొప్పర్తిలో పరిశ్రమలు ఎప్పుడు ఏర్పడుతాయో తెలియదు కానీ దాని ఆశగా చూపించి రియల్‌భూంకు తెరలేపారు. రింగు రోడ్డు నుంచి పది కి.మీ లోపు ఎటు చూసినా మరీ ఎంత తక్కువ అనుకున్నా ఎకరా రూ.కోటి నుంచి రూ.2 కోట్ల మేర పలుకుతోంది. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న వాగులు, వంకలు, కాల్వలు, రోడ్లు ఇలా అన్నీ ఆక్రమించేసి వెంచర్లు వేసి అమ్ముకుంటున్నారు. రెవెన్యూ అధికారులు కూడా సహకరించడంతో విలువైన ప్రభుత్వ స్థలాలన్నీ అన్యాక్రాంతమయ్యాయి. అక్కడ భూమికి డిమాండ్‌ ఉండడంతో కొన్ని ముఠాలు ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి.. వాటి యజమానులు ఎవరు అని వెతికే పనిలో నిమగ్నమవుతున్నట్లు చెబుతున్నారు. ఈ అన్వేషణలో తీగ కాలికి తగిలితే చాలు.. వెంటనే డొంక అంతా మా ఆస్తి అంటూ వాలిపోతున్నారు. ఇప్పుడు సీకేదిన్నె మండలంలోని అశ్వత్తుగారిపల్లెలో గొర్రెల కాపరులకు చెందిన రూ.15 కోట్ల విలువ చేసే భూమి వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు ఈ భూమిపై కొందరు కన్నేయడంతో పెద్ద చర్చ జరుగుతోంది. సీకేదిన్నె మండలంలోని అశ్వత్తుగారిపల్లెలో యాదవుల కుటుంబాలు ఉన్నాయి. వీరు గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మేత కోసం పగలు పూట అడవులకు తీసుకెళ్లి సాయంత్రానికి గ్రామ సమీపంలో ఉన్న ఐదెకరాల భూమిలో గొర్రెలను ఉంచేవారు. ఇది అనాదిగా పూర్వీకుల నుంచి వస్తున్నట్లు చెబుతున్నారు.

ఎకరం రూ.3కోట్లు

సీకేదిన్నె మండలంలో ఎకరం ఉంటే చాలు కోట్లకు అధిపతే. అక్కడ భూములకు అంత డిమాండ్‌ ఉంది. అశ్వత్తుగారిపల్లె సమీపంలో సీకేదిన్నె, బాబాసాహెబ్‌పేట, పబ్బాపురం, చింతకొమ్మదిన్నె గ్రామాలున్నాయి. అశ్వత్తుగారిపల్లెలోని యాదవులు పగలంతా గొర్రెలను సమీప బయళ్లలో మేపుకుని రాత్రిపూట తోలుకోవడానికి వంశపారంపర్యంగా 5.24 ఎకరాల స్థలాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది రింగురోడ్డుకు కూతవేటు దూరంలో చెర్లోపల్లె లే అవుట్‌ సమీపంలో ఉండడంతో ఇక్కడ మంచి ధర ఉంది. ఎకరం రూ.3కోట్లు పలుకుతుండడంతో ఈ భూమిపై కొంత మంది కన్నేశారు. ఈ భూమి తమ పూర్వీకులది అంటూ తెర పైకి వచ్చారు. దీంతో యాదవులు ఆందోళనకు గరయ్యారు. ఇటీవల సీపీఐతో కలసి రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అయినా ఆక్రమణదారులు అడుగులు ముందుకే వేశారు. మొత్తం 11 మంది యాదవులకు ఈ స్థలంపై హక్కు ఉందని సమాచారం. వీరిలో నలుగురిని ఆక్రమణదారులు తమవైపు తిప్పుకున్నారు. దీంతో మిగిలినవారంతా ఆ భూమి తమకు ఎక్కడ దక్కకుండా పోతుందోనని ఆందోళన చెందుతున్నారు. వీరంతా కలసి అక్కడ ‘ఇది అశ్వత్తుగారిపల్లె యాదవుల స్థలం. ఎవరైనా అక్రమాలకు పాల్పిడితే చర్యలు తీసుకోబడును’ అంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. తమ గొర్రెల భూమి పెద్దల పాలు కాకుండా అధికారులు కాపాడాలని వీరు వేడుకుంటున్నారు.

Updated Date - 2022-11-17T00:46:15+05:30 IST