ఇసుకాసురుల ఇష్టారాజ్యం

ABN , First Publish Date - 2022-11-30T23:45:48+05:30 IST

జిల్లాలోని పెన్నా, పాపాఘ్ని, చిత్రావతి నదుల్లో ఇసుక తవ్వకాలకు భూగర్భ గనుల శాఖ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం 14 రీచ్‌లు అందుబాటులో ఉన్నాయి. కొండాపురం మండలంలోని చిత్రావతి నదిలో వెంకయ్యకాల్వ వద్ద 4.6 హెక్టార్లలో రీచ్‌ ఏర్పాటు

ఇసుకాసురుల ఇష్టారాజ్యం

నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు

రీచ్‌ అనుమతి ఓ చోట.. తవ్వేది మరో చోట

3 నుంచి 5 మీటర్ల మేర తవ్వకాలు

క్వారీల్లో భారీ యంత్రాల ఏర్పాటు

అడ్డగోలు తవ్వకాలను అడ్డుకోని అధికారులు

పొంచి ఉన్న భూగర్భ జలాల ముప్పు

ప్రకృతి సంపదను సొంత ఆస్తిలా తవ్వుకుంటున్న వైనం

ఇసుకాసురులు ఇసుక రీచ్‌లలో ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోకుండా నదిలో ఇసుక ఎంత లోతు ఉంటే అంతా భారీ యంత్రాలతో తోడేస్తున్నారు. వాల్టా చట్టం ఇతర నిబంధనలన్నీ గాలికొదిలేశారు. ఇప్పుడంతా అధికార పార్టీ చట్టమే అమలవుతోంది. నిబంధనల ప్రకారం తవ్వకాలు జరిపేలా పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు పూర్తిగా చేష్టలుడిగిపోయారు. చెడు వినం, చెడు చూడం అన్నట్లుగా ఎక్కడ ఎన్ని మీటర్లు తవ్వినా ఏమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వెరసి ఇసుకాసురులు ఇసుకలో తైలం పిండేసి కోట్లు కొల్లగొడుతున్నారు. ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటాయి, పనులు నిలిపివేయాలని పలు చోట్ల మొత్తుకుంటున్నా కూడా జనం గోడు వినే నాధుడే లేడు.

(కడప - ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని పెన్నా, పాపాఘ్ని, చిత్రావతి నదుల్లో ఇసుక తవ్వకాలకు భూగర్భ గనుల శాఖ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం 14 రీచ్‌లు అందుబాటులో ఉన్నాయి. కొండాపురం మండలంలోని చిత్రావతి నదిలో వెంకయ్యకాల్వ వద్ద 4.6 హెక్టార్లలో రీచ్‌ ఏర్పాటు చేశారు. కమలాపురం మండలంలోని పాపాఘ్నినది ఎర్రబల్లె వద్ద 4.98 హెక్టార్లు, చాపాడు మండలంలోని వెదురూరులో 4.87 హెక్టార్లు, సిద్దవటం మండలం జంగంపల్లెలో 4.8 హెక్టార్లు, సిద్దవటం మండలంలోని పెన్నానదిలో 1.5 హెక్టార్లు, సిద్దవటం మండలం జ్యోతిలో 3.3 హెక్టార్లు, తొండూరు మండలంలో పాపాఘ్నినదిపై 3.4 హెక్టార్లు, జమ్మలమడుగు మండలం కన్నెలూరు, అంబవరం మధ్య పెన్నాపై 3 హెక్టార్లు, కొండాపురం, జమ్మలమడుగు మధ్య చిత్రావతిలో, పొట్టిపాడు - వెదురూరు మధ్య, వీఎన్‌పల్లె మండలం కాటిమానుపల్లె వద్ద 4.92 హెక్టార్లు, ఖాజీపేట చెన్నముక్కపల్లెలో 4.53 హెక్టార్లు, పెండ్లిమర్రి కొత్తగంగిరెడ్డిపల్లెలో 4.6 హెక్టార్లు, జమ్మలమడుగు సమీపంలో 4.9 హెక్టార్లలో తవ్వకాలకు అనుమతినిచ్చారు.

క్వారీ ఒక చోట - తవ్వకాలు మరో చోట

ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి ఎలాంటి ఆటంకం కలగకూడదు. వాల్టా చట్టం మేరకే తవ్వకాలకు అనుమతినివ్వాల్సి ఉంది. అనుమతిచ్చిన రీచ్‌లో భూగర్భ గనుల శాఖ అధికారులు సూచించిన మేరకే ఇసుక తవ్వుకోవాలి. సాయంత్రం 6 లోపే ఇసుక తవ్వకాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు గత ప్రభుత్వాల హయాంలో అమల్లోకి వచ్చాయి. కొన్ని చోట్ల ఉల్లంఘనలు జరిగినప్పటికీ మరీ శృతి మించలేదని చెబుతారు. అయితే జగన్‌ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత నిబంధనలన్నీ తూచ్‌ అయ్యాయి. మేం చెప్పిందే వేదం, మా మాటే శాసనం అన్నట్లుగా అప్పటి దాకా ఉన్న నిబంధనలను అటకెక్కించారన్న విమర్శలు ఉన్నాయి. కేటాయించిన రీచ్‌లలో ఇసుక తవ్వకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడబడితే అక్కడ బరి తెగించి తవ్వుతుండడం కొంత మంది అధికారులనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

చాపాడు మండలంలోని వెదురూరు వద్ద పెన్నాపై 4.87 హెక్టార్లలో ఇసుక రీచ్‌ తవ్వకాలకు అనుమతినిచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గడువు లోపు అక్కడ ఉన్న క్వాంటిటీ ఇసుక మాత్రమే సంబంధిత కాంట్రాక్టరు తవ్వుకోవాల్సి ఉంది. అయితే అక్కడ క్వారీని వదిలేసి ఆ సమీపంలో ఉన్న కొండాపురం మండలంలోని సంబటూరు, విభరాపురం ప్రాంతాల మధ్య తవ్వుతున్నారు. కేటాయించిన రీచ్‌కు ఇసుక తవ్వకాల మధ్య సుమారు 400 మీటర్ల దూరంలో వేరే చోట బార్డర్‌ దాటి తవ్వేస్తున్నారు. పెద్ద పెద్ద భారీ హిటాచి యంత్రాలతో తవ్వుతున్నారు. ఇసుక తవ్వకాల కోసం పెన్నా నీటి ప్రవాహాన్నే మళ్లించి మరీ తవ్వారు. దీంతో నీరు వెళ్లి రైతుల పొలాలు కోతలకు గురయ్యాయి. ఇక్కడ అక్రమ ఇసుక తవ్వకాల గురించి టీడీపీ నేతలు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైంది. దీంతో టీడీపీ కమలాపురం, మైదుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు పుత్తా నరసింహారెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్‌ చాపాడు, కమలాపురం సరిహద్దుల్లో ఇసుక తవ్వకాలను మంగళవారం పరిశీలించారు. క్వారీ ఒక చోట ఉంటే మరో చోట తవ్వడాన్ని తీవ్రంగా పరిగణించారు. వాల్టా చట్టం ప్రకారం కేవలం మీటరు లోతు మాత్రమే తవ్వకాలు జరపాల్సి ఉంది. అయితే ఇక్కడ కొన్నిచోట్ల 5 మీటర్ల వరకు తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు. ఇసుక తీసిన గుంతల నిండా నీరు ఉంది. నీటి ప్రవాహం ఉన్నప్పుడు ఇసుక తవ్వకాలు చేపట్టకూడదని చెబుతారు. ఎంత ఇసుక తవ్వామన్నది నీటి ప్రవాహం వల్ల గుర్తించలేరు. ఇసుక తవ్వకాల్లో ఎందుకు నిబంధనలు పాటించడంలేదని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తే మేం రోజుకు రూ.6లక్షలు చెల్లించాలి. నిబంధనల ప్రకారం తవ్వితే అంత డబ్బులు మేం ఎక్కడ కట్టేది అంటూ సమాధానమివ్వడం గమనార్హం. ఇదే పరిస్థితి జిల్లాలోని చాలా రీచ్‌లలో ఉందని అంటున్నారు. కొండాపురం సమీపంలో ఉన్న ఇసుక రీచ్‌ పరిధిలో వెదురూరు ఫారెస్టులో తవ్వకాలు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి.

రాత్రీ పగలు అని లేదు

ఇసుక తవ్వకాలు సాయంత్రం 6గంటల్లోపు జరపాల్సి ఉంది. అయితే జిల్లాలో ఇసుక కొరత లేకండా ఉండేందుకు గాను కలెక్టరు నిబంధనలను నాలుగు నెలల క్రితం సడలించారు. అప్పట్లో రీచ్‌లు తక్కువగా ఉండడంతో కొరత ఉండేది. అయితే ఇప్పుడు రీచ్‌లు అందుబాటులోకి వచ్చినా కూడా రేయి పగలు అని తేడా లేకుండా తవ్వేస్తున్నారు. పెద్ద పెద్ద హిటాచీలు పెట్టి 20 టైర్ల లారీలు, పెద్ద పెద్ద ట్రక్కులలో నింపి తరలిస్తున్నారు.

నిక్కచ్చిగా తనిఖీ చేస్తే గుట్టురట్టు

అధికార యంత్రాంగం నిక్కచ్చిగా రీచ్‌లు తనిఖీ చేస్తే అక్రమ ఇసుక తవ్వకాల గుట్టు బట్టబయలవుతుందని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం మీటరు లోతు ఇసుక తవ్వాలి. అది కూడా కేటాయించిన రీచ్‌లోనే. అయితే చాలామటుకు రీచ్‌ల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయి. మీటరుకు బదులు నాలుగు మీటర్లు తవ్వకాలు జరుగుతున్నాయి. కమలాపురం, వెదురూరు రీచ్‌ల మధ్య జరిగిన తవ్వకాలతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. చేపల చెరువులను తలపించే విధంగా ఎటు చూసినా నీరే ఉంది. సుమారు 5 అడుగులలోతు తవ్వినట్లు చెబుతున్నారు. క్వారీల్లో ఉన్న యంత్రాలను చూస్తే వారికి కేటాయించిన ఇసుక క్వాంటిటీని ఎప్పుడో తవ్వేశారని స్పష్టంగా అర్థమవుతోంది. అడ్డగోలు తవ్వకాల వల్ల ఆ నదుల పరిధిల్లోని గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగు, సాగునీరు నదుల నుంచే సరఫరా అవుతుంది. తిప్పిరెడ్డిపల్లె, రాజుపాలెం, వెదురూరు గ్రామాలకు సుమారు రూ.20కోట్లు వెచ్చించి పైపులైన్లు ఏర్పాటు చేశారు. ఇసుక తవ్వకాలతో అవి దెబ్బతిన్నాయి. ఐడీసీ నిధులతో సాగునీటికు పైపులైన్లు వేశారు. ఇవన్నీ అక్రమ తవ్వకాల వల్ల దెబ్బతిన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారులు దృష్టి సారించాలని నదీపరివాహక ప్రజలు కోరుతున్నారు.

నిబంధనల మేర కే ఇసుక తవ్వకాలు జరపాలి

- వెంకటేశ్వర్‌రెడ్డి, మైన్స్‌ డీడీ

కేటాయించిన ఇసుక రీచ్‌లలో నిబంధనల ప్రకారమే తవ్వకాలు జరపాలి. మీటరు లోతుకు మించి తవ్వకూడదు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చ్యలు తీసుకుంటాం. రాత్రిపూట తవ్వకాలకు అనుమతి లేదు. అయితే ఇసుక కొరత లేకుండా చూసేందుకు కలెక్టరు ఆర్డరు ఇచ్చారు.

Updated Date - 2022-11-30T23:45:48+05:30 IST

Read more