పల్లెనూ.. ఆన్‌లైన్‌ చేసేశారు..

ABN , First Publish Date - 2022-12-06T23:37:51+05:30 IST

ఎక్కడైనా ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారు అధికారులతో లాలూచీపడి ఆన్‌లైన్‌ చేయించుకోవడం చూసి ఉంటాం. కానీ ఇక్కడ ఓ తహసీల్దార్‌ ఓ గ్రామాన్నే ఓ వ్యక్తి పేరు మీద ఆన్‌లైన్‌ చేసేసింది.

పల్లెనూ.. ఆన్‌లైన్‌ చేసేశారు..
సర్వే నెంబరు 75/2లో ఉన్న పొత్తుకూరుపల్లె

అవినీతికి పరాకాష్ట..

అడిగినంత ఇస్తే చాలు.. రికార్డులు లేకున్నా మ్యుటేషన్‌

చెరువులు, కుంటలను వదలని వైనం

ఆ మేడమ్‌ తీరే.. అంత..!!

ఎక్కడైనా ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారు అధికారులతో లాలూచీపడి ఆన్‌లైన్‌ చేయించుకోవడం చూసి ఉంటాం. కానీ ఇక్కడ ఓ తహసీల్దార్‌ ఓ గ్రామాన్నే ఓ వ్యక్తి పేరు మీద ఆన్‌లైన్‌ చేసేసింది. డబ్బు కోసం కక్కుర్తిపడి.. ఏది పడితే.. అది చేసేస్తే.. ఉద్యోగానికే ఎసరొస్తుంది.. శాఖాపరమైన చర్యలు.. లేదా ప్రైవేటు కేసులు వంటి కఠిన చర్యలు తప్పవనే భయం ఏమాత్రం లేకుండా.. దాదాపు 50 సంవత్సరాల నుంచి ప్రజలు నివశిస్తున్న పల్లెను వేరే వారి పేరు మీద ఆన్‌లైన్‌ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ తతంగంలో పెద్ద మొత్తం చేతులు మారి ఉంటుందని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. రికార్డులతో పని లేకుండా.. నిబంధనల భయం లేకుండా... ఈ పనిచేసిన ఆ తహసీల్దార్‌.. ఎంచక్కా.. మరో మండలానికి బదిలీపై వెళ్లిపోయారు.

(రాయచోటి-ఆంధ్రజ్యోతి): రామాపురం మండలం బండపల్లె గ్రామం పొత్తుకూరుపల్లెలో సర్వే నెంబరు 75/2లో 6.02 ఎకరాల భూమి ఉంది. ఇందులో సుమారు రెండు ఎకరాలలో 40 ఇళ్లు ఉన్నాయి. దాదాపు 50 సంవత్సరాల నుంచి ఈ పల్లె ఉన్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. మిగిలిన 4.02 ఎకరాల భూమి తమదే అని నందలూరు నాగబసిరెడ్డితో పాటు మరో ఐదుగురు పేర్కొంటున్నారు. ఇది తమ పెద్దల నుంచి వచ్చిన ఆస్తి అని.. పల్లె నిర్మించుకోవడానికి కూడా 1970 సంవత్సరంలో స్థలం ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. ఈ భూమి తమదే అనడానికి తమ వద్ద అన్ని రికార్డులు ఉన్నాయని పేర్కొంటున్నారు. అయితే 4.02 ఎకరాలకు అదే గ్రామానికి చెందిన సదిపిరాళ్ల రాంబాబురెడ్డి పేరు మీద పట్టాదారు పాసుపుస్తకాలు, 1బీ వంటి రికార్డులు ఉన్నాయి. ఇవన్నీ తప్పుడు రికార్డులతో రాంబాబు రెడ్డి పొందాడని నాగబసిరెడ్డి, ఇతరులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో సర్వే నెంబరు 75/2 విషయమై ఇరువురి మధ్య వివాదం నడుస్తోంది. తొలుత ఈ వివాదం కడప జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులో నడిచింది. అయితే తర్వాత ఈ వివాదాన్ని కోర్టులో పరిష్కరించుకోమని జాయింట్‌ కలెక్టర్‌ ఇరువురికీ నోటీసులు ఇచ్చారు. ఈ వివాదం ఇలా ఉండగానే అప్పట్లో రామాపురం తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఖాజాబీ రాంబాబురెడ్డి పేరు మీద సర్వే నెంబరు 75/2లో ఉన్న మొత్తం 6.02 ఎకరాలను 28/6/2022న ఆన్‌లైన్‌ చేశారని బాధితులు చెబుతున్నారు. రెండు ఎకరాలలో ప్రజలు నివశిస్తున్న పల్లె ఉందన్న విషయాన్ని కూడా పక్కనపెట్టి ఆన్‌లైన్‌ చేయడానికి తహసీల్దార్‌ పూనుకుందంటే.. ఆమెకు ఎంత ముట్టి ఉంటుందోనని ఆరోపణలు బలంగా ఉన్నాయి. సర్వే నెంబరు 75/2 స్థలం వివాదంలో ఉందని రామాపురం రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్‌వో నుంచి తహసీల్దార్‌ వరకు అందరికీ తెలుసని, అయితే సరైన పత్రాలు లేకుండానే రాంబాబు రెడ్డి పేరు మీద తహసీల్దార్‌ ఆన్‌లైన్‌ చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. రాంబాబు రెడ్డి తప్పుడు పత్రాలతో రికార్డుల్లో పాసుపుస్తకం తీసుకున్నాడని తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తహసీల్దార్‌ పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. అతడి వద్ద ఉన్న రికార్డులు ఏంటో.. ? ఒకసారి పరిశీలించమని అడిగినా.. తహసీల్దార్‌ నుంచి ఎటువంటి స్పందన లేదని పేర్కొంటున్నారు. రాంబాబు రెడ్డి పేరు మీద పల్లె సైతం ఆన్‌లైన్‌ అయిన విషయాన్ని గుర్తించి పలుమార్లు తహసీల్దార్‌ను కలిసి ఎలా ఆన్‌లైన్‌ చేస్తారని అడిగినట్లు బాధితులు పేర్కొంటున్నారు. అందుకు సమాధానం చెప్పని తహసీల్దార్‌ అదిగో చేస్తా.. ఇదిగో చేస్తా. అంటూ కాలయాపన చేసి ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోయిందని బాధితులు వాపోతున్నారు.

కుంటలు, చెరువులనూ వదలని వైనం

బండపల్లె గ్రామంలోని పలు కుంటలు, చెరువులను ఇతరుల పేరు మీద ఆన్‌లైన్‌ చేసినట్లు బాఽధితులు ఆరోపిస్తున్నారు. సర్వే నెంబరు 166, 169, 151లలో చెరువులు, కుంటలు ఉన్నాయని, వాటిని కూడా కొనుగోలు, వంశపారంపర్యం పేరుతో తహసీల్దార్‌ ఖాజాబీ ఆన్‌లైన్‌ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. చెరువులు, కుంటలను ఇతరుల పేరు మీద్‌ ఆన్‌లైన్‌ చేసిన విషయం ఎవరైనా గుర్తించి అడిగితే వాటిని ఆన్‌లైన్‌లో తీసేస్తారని, లేకుంటే అలాగే ఉంచేస్తారని పలువురు పేర్కొంటున్నారు. గతంలోనూ ఆమె పనిచేసిన చోట అవినీతి, అక్రమాల ఆరోపణలు ఉన్నట్లు బాధితులు పేర్కొంటున్నారు.

డబ్బు ఇస్తే.. ఎవరి పేరైనా తీసేస్తాం.. ఎక్కిస్తాం

సాధారణంగా భూములకు సంబంధించి ప్రభుత్వ రికార్డుల్లో నుంచి ఎవరి పేరైనా తీసేయాలన్నా? నమోదు చేయాలన్నా? కొన్ని నిబంధనలు పాటించాలి. ఎవరి పేరైనా తొలగించాలంటే రికార్డుల్లో ఉన్న వ్యక్తికి నోటీసులు ఇచ్చి సంజాయిషీ తీసుకుని ప్రభుత్వ పరంగా అన్ని నిబంధనలు పాటించి అతడి పేరు తొలగించాలి. అదే ఎవరి పేరైనా నమోదు చేయాలంటే అతను ఆ ఆస్తికి సంబంధించి సమర్పించే రికార్డులన్నీ పరిశీలించి నిబంధనలను అనుసరించి నమోదు చేయాలి. అయితే ఇక్కడ అటువంటి నిబంధనల ప్రస్తావనే లేకుండా అన్నీ జరిగిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇదే మండలంలో ఆర్‌ఐగా పనిచేసి బదిలీపై వెళ్లిన ఓ అధికారి, తహసీల్దార్‌తో తరచూ ఓ మాట అనే వాడని బాధితులు పేర్కొంటున్నారు. రికార్డుల్లో ఎవరి పేరైనా తీసేద్దాం.. నమోదు చేద్దాం.. మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు.. అంతకు ఎవరైనా అడిగితే.. కోర్టుకు వెళ్లండని చెప్దాం.. అని చెప్పేవాడంటున్నారు. అయితే అధికారులు లంచాలు తీసుకుని రికార్డుల్లో పేర్లు తొలగించి. నమోదు చేయడం వల్ల వివాదాలు ఏర్పడి.. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్వయంగా స్పందించి.. ఈ బాగోతంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి.. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

పల్లె ఆన్‌లైన్‌ చేసిన విషయం వాస్తవమే

- సత్యానందం, తహసీల్దార్‌, రామాపురం

బండపల్లె గ్రామం పొత్తుకూరుపల్లెలో సర్వే నెంబరు 75/2లో సుమారు రెండు ఎకరాలల్లో పల్లె ఉంది. 40 ఇళ్ల వరకు ఉన్నాయి. ఈ పల్లెను గతంలో ఉన్న వాళ్లు ఆన్‌లైన్‌ చేసిన విషయం వాస్తవమే. ఈ విషయమై కొందరు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. దీంతో గత వారంలో ఈ స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించాను.

Updated Date - 2022-12-06T23:37:55+05:30 IST