వైసీపీ ప్రభుత్వంతో సీమ వెనుకబాటు

ABN , First Publish Date - 2022-03-17T05:28:28+05:30 IST

‘‘రాష్ర్టానికి ఈ మూడేళ్లలో ఒక్క పరిశ్రమా రాలేదు. నిరుద్యోగులు ఉపాధిలేక ఇతర రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి వచ్చింది. రాయలసీమకు చెందిన జగన్‌ సీఎంగా ఉన్నా సీమలో అభివృద్ధి శూన్యం. ఈ ప్రభుత్వంవ ల్ల ఈ ప్రాంతం వెనుకబాటుకు గురైంది’’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌ అన్నారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

వైసీపీ ప్రభుత్వంతో సీమ వెనుకబాటు
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌

కడప(మారుతీనగర్‌), మార్చి 16: ‘‘రాష్ర్టానికి ఈ మూడేళ్లలో ఒక్క పరిశ్రమా రాలేదు. నిరుద్యోగులు ఉపాధిలేక ఇతర రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి వచ్చింది. రాయలసీమకు చెందిన జగన్‌ సీఎంగా ఉన్నా సీమలో అభివృద్ధి శూన్యం. ఈ ప్రభుత్వంవ ల్ల ఈ ప్రాంతం వెనుకబాటుకు గురైంది’’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌ అన్నారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో కల్తీసారా తాగి 25 మంది దాకా చనిపోతే అవి సహజ మరణాలని అసెంబ్లీలో సీఎం జగన్‌ వెటకారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మద్యం రేట్లు పెంచడం వల్లే తక్కువ ధరకు వస్తుందని కల్తీ సారా తాగి పేదలు ప్రాణాలు వీడుతున్నారని, ఇవి ప్రభుత్వ హత్యలే అని అన్నారు. ఈ ప్రభుత్వ విధానాలు, వైసీపీ నాయకులను చూసి ఒక్క పరిశ్రమ కూడా రాష్ర్టానికి రావడం లేదని, ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోతున్నాయని అన్నారు. ఉక్కుపరిశ్రమ నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. 

నాడు చంద్రబాబునాయుడు... నేడు జగన్‌ సొంతంగానే పరిశ్రమ నిర్మిస్తామని ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి గ్రామాలకు గ్రామాలు ముంపునకు గురై సర్వం కోల్పోయారని, అన్నమయ్య ముంపు బాధితులకు రెండు నెలల్లో ఇళ్లు కట్టిస్తామని సీఎం హామీ ఇచ్చారే కానీ ఇప్పటికీ పునాదులు కూడా తవ్వలేదన్నారు. ఒక్కచాన్స్‌ ఇస్తే ఏపీని అగ్రస్థానంలో నిలుపుతానని అధికారంలోకి వచ్చిన జగన్‌ రివర్స్‌ పాలనతో రాష్ట్రాభివృద్ధిని రివర్స్‌లోకి తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఆటవిక పాలన, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే ఈనెల 19న సీఎం స్వంత జిల్లా కడప అడ్డాగా 25వేల మందితో రాయలసీమ రణభేరి నిర్వహిస్తున్నామని, జనాగ్రహం చూస్తుంటే రెట్టింపు జనం వచ్చేలా ఉన్నారన్నారు. విద్యాలయాల్లో విద్యార్థులంతా సమానమేనని పాఠశాలల్లో హిజాబ్‌ ధరించడం మంచిదికాదని కర్ణాటక హైకోర్టు కూడా సూచించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, వంగళ శశిభూషణ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కె.యల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-17T05:28:28+05:30 IST