వైసీపీని గద్దె దించేంత వరకూ అలుపెరుగని పోరాటం

ABN , First Publish Date - 2022-10-01T05:22:52+05:30 IST

అవినీతి, అక్రమాలతో పరిపాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకూ నాయకులు, కార్యకర్తలు అలుపెరుగని పోరా టం చేయాల్సిందేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కు మార్‌రెడ్డి, పార్టీ పాలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

వైసీపీని గద్దె దించేంత వరకూ అలుపెరుగని పోరాటం
పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతున్న కిశోర్‌కుమార్‌ రెడ్డి

నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, ఆర్‌.శ్రీనివాసరెడ్డి
కలికిరి, సెప్టెంబరు 30:
అవినీతి, అక్రమాలతో పరిపాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకూ నాయకులు, కార్యకర్తలు అలుపెరుగని పోరా టం చేయాల్సిందేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కు మార్‌రెడ్డి, పార్టీ పాలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మద్యం, ఇసుక, మైనింగ్‌తో రూ.కోట్లు కొల్లగొట్టారని, ఆ డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసి తిరిగి అధికారంలోకి రావాలని వైసీపీ వేస్తున్న ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పీలేరు నియోజక వర్గంలోని ఆరు మండలాలకు చెందిన యూనిట్‌, క్లస్టర్‌, బూత్‌ కన్వీనర్లు, వివిధ అనుబంధ విభాగాల నాయకులతో శుక్రవారం నగరిపల్లెలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కిశోర్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డిలు మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక వనరులన్నీ కొల్లగొడుతూ, ప్రజలు చెల్లించే పన్నులు మాత్రం బటన్‌ నొక్కుడుతో పంచిపెడుతున్నారని విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలను అటకెక్కించి ఆర్థిక వ్యవస్థను చిద్రం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసం కాపలాదారుడిగా వుండాల్సిన ముఖ్యమంత్రి దోపిడీదారుడిగా తయారయ్యాడన్నారు. నియోజకవర్గంలో ఒక రోడ్డుగానీ, ఒక చెరువుగానీ, ఒక సబ్‌స్టేషన్‌ గానీ మరే అభివృద్ధి లేకుండా మూడేళ్లు గడిపేశారని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో అన్ని రకాల ధరలూ మూడు రెట్లు పెరిగిపోయాయన్నారు. రానున్న ఎన్నికల నాటికి ప్రజలందరిలో అవగాహన కల్పించి వైసీపీకి వ్యతిరేకంగా సమాయత్తం చేయాల్సిన బాధ్యత గ్రామ, బూత్‌ స్థాయి నాయకులదే అన్నారు.

Read more