మట్టిని తవ్వేస్తున్నారు...

ABN , First Publish Date - 2022-11-24T23:50:53+05:30 IST

గుర్రంకొండ పరిసరాలలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. గుట్టలు, చెరువుల్లో అక్రమంగా మట్టిని తరలిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. చెరువులు, గుట్టల వద్ద ఎక్స్‌కవేటర్లతో మట్టిని తోడి ప్రతిరోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్లలో తరలిస్తూ సొమ్ము చేసుకొంటున్నారు.

మట్టిని తవ్వేస్తున్నారు...
మార్కెట్‌యార్డు సమీపంలో మట్టి కోసం తవ్వేసిన గుట్ట

గుర్రంకొండలో జోరుగా మట్టి అక్రమ రవాణా

చెరువులు, గుట్టలను మింగేస్తున్నారు

ఎక్స్‌కవేటర్‌, రెండు ట్రాక్టర్లు సీజ్‌

గుర్రంకొండ, నవంబరు 24: గుర్రంకొండ పరిసరాలలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. గుట్టలు, చెరువుల్లో అక్రమంగా మట్టిని తరలిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. చెరువులు, గుట్టల వద్ద ఎక్స్‌కవేటర్లతో మట్టిని తోడి ప్రతిరోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్లలో తరలిస్తూ సొమ్ము చేసుకొంటున్నారు. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఇటుక బట్టీ వ్యాపారులు ప్రభుత్వ అనుమతులు లేకుండానే మట్టిని తవ్వి తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మట్టి అక్రమ తవ్వకాలపై సమీప రైతులు రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులకు చెప్పినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా సమాచారమిచ్చిన వారి పేర్లను అక్రమార్కులకు చెప్పి బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. దీనిని బట్టి చూస్తే అర్థమవుతుంది అధికారులకు, మట్టి మాఫియాకు ఎటువంటి సంబంధాలున్నాయో.

గుట్టలను గుల్ల చేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు...

గుర్రంకొండ పట్టణంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వ్యవసాయ భూముల్లో వేస్తున్న లేఅవుట్‌లకు మట్టిని తోలి భూములను చదును చేస్తున్నారు. వీటి కోసం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మట్టిని సమీప చెరువుల నుంచి తరలిస్తున్నారు. దీంతో చెరువులు, గుట్టల వద్ద ఎక్స్‌కవేటర్లను ఉంచి పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టిని తవ్వి గుల్ల చేస్తున్నారు. దీంతో గుట్టలు తమ స్వరూపమే కోల్పోతున్నాయి.

ఇటుక బట్టీ కోసం తవ్వేస్తున్నారు

గుర్రంకొండలో ఇటుక బట్టీల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో పట్టణంలో సుమారు 25 మంది వ్యాపారులు బట్టీలను నిర్వహిస్తున్నారు. ఇటుక బట్టీల నిర్వాహకులు మట్టి కోసం చెరువులపై పడుతున్నారు. దీంతో చెరువుల్లో ఎక్స్‌కవేటర్‌లను ఉంచి ట్రాక్టర్లలో మట్టి తరలిస్తున్నారు. ఒక్కో ఇటుక బట్టీ నిర్వాహకుడు సుమారు 200 నుంచి 300 ట్రాక్టర్ల మట్టిని తోలుకుంటున్నారు. ఈ మట్టి తరలింపునకు ప్రభుత్వ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకపోవడం గమనార్హం.

ఎక్స్‌కవేటర్‌, ట్రాక్టర్లు సీజ్‌

గుర్రంకొండ మార్కెట్‌ యార్డు సమీపంలోని నరసయ్యబండ చెరువులో అక్రమంగా మట్టిని తోడుతున్న ఎక్స్‌కవేటర్‌తో పాటు రెండు ట్రాక్టర్లను ఆదివారం రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు. చెరువులో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎక్స్‌కవేటర్‌తో మట్టిని తరలిస్తున్నట్లు రెవెన్యూ అధికారులకు సమాచారం రావడంతో ఆర్‌ఐ చంద్రమోహన్‌, వీఆర్వో నాగరాజ వెళ్లారు. ఈ క్రమంలో చెరువులో అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు, ఎక్స్‌కవేటర్‌లను పట్టుకుని సీజ్‌ చేశారు. అనంతరం అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని వీఆర్వో నాగరాజ పోలీసులకు ఫిర్యాదు చేసి వాటిని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వీఆర్వో తెలిపారు.

రెవెన్యూ అధికారులకు మట్టి మాఫియా బెదిరింపులు..?

మా గ్రామంలో మట్టి తరలింపునకు మీ అడ్డుంకులేంటి అంటూ మట్టి మాఫియాకు చెందిన కొందరు వ్యక్తులు రెవెన్యూ అధికారులను బెదిరింపులకు గురి చేసినట్లు అధికారుల మధ్య చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం నరసయ్యబండ కాలనీ చెరువులో అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలను రెవెన్యూ అధికారులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. దీంతో మట్టి మాఫియా తమ ట్రాక్టర్లనే పట్టుకుంటావా...? నీకు ఎంత ధైర్యం...నీ అంతు చూస్తామంటూ బెదిరించినట్లు తెలిసింది. దీంతో సంబంధిత అధికారి మట్టి మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నాయంటూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫోన్‌ నెంబర్లను ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరారు.

లోడ్‌ ట్రాక్టర్‌ మట్టికి రూ.170 ఇవ్వాల్సిందే

గుర్రంకొండ పట్టణంలో ఎవరికైనా మట్టి తోలాలంటే ముందుగా మామూళ్లు ఇవ్వాల్సిందే అంటూ కొందరు నాయకులు హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మట్టి మాఫియాకు చెందిన వారందరూ వెళ్లి ఆ నాయకుడితో మాట్లాడారు. ఈ క్రమంలో చెరువులు, గుట్టల నుంచి ట్రాక్టర్‌ మట్టి తోలాలంటే రూ.170 తమకు చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా గుర్రంకొండలో మట్టి మాఫియా విచ్చలవిడిగా మట్టిని తరలిస్తోంది.

మట్టి అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తాం

- ఖాజాబీ, తహసీల్దార్‌, గుర్రంకొండ

ప్రభుత్వ భూములు, చెరువుల్లో మట్టిని అక్రమంగా తరలిస్తే వారిపై చర్యలు తప్పవు. మట్టి తరలింపునకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. మట్టి వ్యాపారులు అక్రమాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేయిస్తాం.

Updated Date - 2022-11-24T23:50:53+05:30 IST

Read more