తెలుగు యువత నాయకుల ధర్నా

ABN , First Publish Date - 2022-11-30T23:34:50+05:30 IST

మదనపల్లెలో సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా స్థానిక టౌన్‌బ్యాంకు సర్కిల్‌ వద్ద తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు ఆధ్వర్యంలో తెలుగు యువత నాయకులు హఠాత్తుగా వెళ్లి ధర్నాకు దిగారు.

తెలుగు యువత నాయకుల ధర్నా
తెలుగు యువత నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు

సీఎం గోబ్యాక్‌, డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు

అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు

మదనపల్లె టౌన్‌, నవంబరు 30: మదనపల్లెలో సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా స్థానిక టౌన్‌బ్యాంకు సర్కిల్‌ వద్ద తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు ఆధ్వర్యంలో తెలుగు యువత నాయకులు హఠాత్తుగా వెళ్లి ధర్నాకు దిగారు. బుధవారం స్థానిక బీటీ కళాశాల మైదానంలోని హెలీప్యాడ్‌ నుంచి సీఎం జగన్‌ కాన్వాయ్‌ సభా స్థలికి చేరుకున్నాక, ఓ వైపు బహిరంగ సభ జరుగుతుండగా మరోవైపు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు, నియోజకవర్గ అధ్యక్షుడు అరుణ్‌తేజ్‌ సీఎం కాన్వాయ్‌ వెళ్లే మార్గంలో ధర్నాకు యత్నించారు. పోలీసులు అడ్డుకుని వీరిని పట్టుకునేందుకు ప్రయత్నించినా వారికి దొరకకుండా తెలుగు యువత నాయకులు తప్పించుకుని టౌన్‌బ్యాంకు సర్కిల్‌ వద్దకు చేరుకుని అక్కడ ధర్నాకు దిగారు. మదనపల్లె అభివృద్ధికి ఏమాత్రం సహకరించని సీఎం జగన్‌ గోబ్యాక్‌, సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని టూటౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా శ్రీరామ్‌చినబాబు మాట్లాడుతూ ఈ రోజు పోలీసులు అడ్డుకున్నా.. ఏదో ఒకరోజు ఇదే ప్రజలు సీఎంను తిప్పి పంపుతారన్నారు. మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలని ఆందోళనలు చేస్తే స్పష్టత లేదు, హంద్రీనీవా పూర్తి చేయలేదు. ఎలాంటి అభివృద్ధి చేయకనే చేతులూపుకుంటూ వచ్చి వెళ్లిన జగన్‌ను, వైసీపీని మదనపల్లె ప్రజలు ఎలాంటి పరిస్థితిల్లోనూ నమ్మరన్నారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు ప్రణయ్‌రాయల్‌, శ్రీనాథ్‌, సుదర్శన్‌, బాబ్‌జాన్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:34:50+05:30 IST

Read more