ఇసుక మాఫియాతోనే ప్రాజెక్టులకు నష్టం!

ABN , First Publish Date - 2022-09-27T05:20:32+05:30 IST

పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు తెగి ఆస్తి, ప్రాణ నష్టం జరిగేందుకు ఇసుక మాఫియానే కారణమని, వైసీపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి లేక పలువురు పక్క రాష్ర్టాలకు వలస వెళుతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు విమర్శించారు

ఇసుక మాఫియాతోనే ప్రాజెక్టులకు నష్టం!
సమావేశంలో మాట్లాడుతున్న రమేష్‌నాయుడు

సుండుపల్లె, సెప్టెంబరు 26:  పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు తెగి ఆస్తి, ప్రాణ నష్టం జరిగేందుకు ఇసుక మాఫియానే కారణమని, వైసీపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి లేక పలువురు పక్క రాష్ర్టాలకు వలస వెళుతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు విమర్శించారు. ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా సోమవారం సుండుపల్లె నాలుగు రోడ్ల కూడలిలో ఆయన మాట్లాడారు రాష్ట్రం విడిపోయిన తర్వాత విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన ఘనత ప్రధాన మంత్రి మోదీకి దక్కుతుందని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద రూ. 25 వేల కోట్లు ఇచ్చిందని,  కరోనా వ్యాక్సిన్లను ఉచితంగా అందజేసి ప్రాణదాతగా నిలిచారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా రేషన్‌ బియ్యాన్ని ఇస్తే వాటిని సీఎం విదేశాలకు పంపారని ఆరోపించారు.  భూకబ్జాలు, ఇసుక అక్రమ రవాణాతో పాటు ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో  మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని, మద్యపాన నిషేధం పేరుతో నాసిరకమైన మద్యం విక్రయిస్తూ దోచుకుంటున్నారన్నారు. బీజేపీ సీనియర్‌ నాయకుడు పొత్తూరు శ్రీకాంత్‌, రాజంపేట లోక్‌సభ అభ్యర్థి సాయిలోకేశ్‌ మాట్లాడారు.  రాజంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి రమేష్‌ నాయుడు, నందలూరు మాజీ జెడ్పీటీసీ షబ్బీర్‌అలీ, అన్నమయ్య జిల్లా మహిళా కార్యదర్శి సుభద్ర, వీరబల్లి మండల అధ్యక్షులు నాగేంద్ర, బీజేపీ మండల అధ్యక్షులు జగదీశ్వరస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుబ్బరాజు, బీజేపీ నాయకులు వెంకటరామరాజు, రెడ్డిరాజాచారి, గోపాలరాజు, వెంకట్రమణనాయుడు, రాచరాయుడు తదితరులు పాల్గొన్నారు. 

‘జగన్‌ ప్రభుత్వ పతనం ప్రారంభం’

రాజంపేట:  వైసీపీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర పొలిటికల్‌ సలహా మండలి సభ్యుడు, రాజంపేట పార్లమెంట్‌ ఇన్‌చార్జి సాయిలోకేష్‌ తెలిపారు. వరదయ్యగారిపల్లె పంచాయతీ పరిధిలోని వెంకటంపల్లెలో  సోమవారం  నిర్వహించిన ప్రజాపోరు యాత్రలో ఆయ న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వ ఆస్తు లు కూల్చడం, అవినీతి, అరాచకం, లంచగొండితనం, నిత్యావసరాల ధరల పెరుగుదల, ప్రతిపక్ష పార్టీల నేతలపై వేధింపులు, అక్రమ కేసులు పెట్టడం  మూడేళ్ల  జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాధించిన విజయాలన్నా రు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రాజంపేట అసెంబ్లీ ఇన్‌చార్జి పోతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ ఓట్లు, సీట్ల కోసం కాకుండా ప్రజల పక్షాన ప్రజాపోరు నిర్వహిస్తూ బీజేపీ రాష్ట్రంలో రోజురోజుకు బలపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.సురేష్‌రాజు, మైనారిటీ నాయకులు షబ్బీర్‌ అహమ్మద్‌, మహిళామోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభద్ర, జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, సునీత, రమణ తదితరులు పాల్గొన్నారు.

Read more