ఎల్‌హెచ్‌ఎంఎ్‌స యాప్‌తో దొంగతనాలకు చెక్‌

ABN , First Publish Date - 2022-05-30T05:30:00+05:30 IST

జిల్లా పోలీసుశాఖ అమలు చేస్తున్న లాక్డ్‌హౌస్‌ మానిటరింగ్‌సిస్టమ్‌ (ఎల్‌హెచ్‌ఎంఎ్‌స) యాప్‌ ద్వారా దొంగతనాలకు చెక్‌ పెట్టవచ్చు.

ఎల్‌హెచ్‌ఎంఎ్‌స యాప్‌తో దొంగతనాలకు చెక్‌

దొంగలు ఇంట్లోకి ప్రవేశిస్తే ఇట్టే పట్టేసే అవకాశం 

జిల్లా వ్యాప్తంగా 1,73,369 మంది యాప్‌ డౌన్‌లోడ్‌ 

ఎల్‌హెచ్‌ఎంఎస్‌కు విశేష ఆదరణ   


కడప(క్రైం), మే 30 : జిల్లా పోలీసుశాఖ అమలు చేస్తున్న లాక్డ్‌హౌస్‌ మానిటరింగ్‌సిస్టమ్‌ (ఎల్‌హెచ్‌ఎంఎ్‌స) యాప్‌ ద్వారా దొంగతనాలకు చెక్‌ పెట్టవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,73,369 మంది యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని పేర్లను నమోదు చేసుకున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఎల్‌హెచ్‌ఎంఎ్‌స యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఇంట్లో పరిస్థితిని వీక్షించవచ్చు. పోలీసు స్టేషన్ల ద్వారా నిఘా ఉంచి, దొంగలు ఇంట్లోకి ప్రవేశిస్తే ఇట్టే పట్టేసే అవకాశం ఉంటుంది. జిల్లాలోని కడప నగరంతో పాటు ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి మున్సిపాలిటీలలో యాప్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. 


యాప్‌ను ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి... 

ఆండ్రాయిడ్‌ మొబైల్‌ కలిగిన వారు ముందుగా ప్లేస్టోర్‌లోకి వెళ్లి... లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. యాప్‌ను ఓపెన్‌ చేయగానే రిజిష్టర్‌, రిక్వెస్ట్‌ పోలీస్‌ వాచ్‌ అనే రెండు ఆప్షన్‌లు కనిపిస్తాయి. ముందుగా రిజిష్టర్‌ను ఎంచుకోవాలి. అక్కడ పేరుతో పాటు, అడ్రస్‌, సెల్‌ నెంబర్‌ను నమోదు చేయాలి. గెట్‌ మైలొకేషన్‌ ఆప్షన్‌ కూడా ఉంటుంది. దానిపై క్లిక్‌ చేసి ఇంటి లొకేషన్‌ గూగుల్‌ మ్యాప్‌ ద్వారా అందులో ఎంట్రీ చేయాలి. ఇదంతా ఇంటిలో కూర్చునే చేయవచ్చు. తద్వారా పోలీసులు మన ఇంటికి  భద్రత ఇవ్వడానికి సులువైన మార్గం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఒక యూజర్‌ ఐడీ జనరేట్‌ అవుతుంది. దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి.


ఇంటికి రక్షణ ఈ యాప్‌

లాక్డ్‌హౌస్‌ మానిటరింగ్‌ యాప్‌ ద్వారా ఇళ్లు సురక్షితమని చెప్పవచ్చు.  మనం ఎక్కడికి అయినా యాత్రలు, అత్యవసర సమయాల్లో ఆస్పత్రులు, ఇతర ఊర్లకు వెళ్లినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వెంటనే పోలీసులు ఆ ఇంటికి కాపలాగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. స్టేషన్‌ నుంచే ఇంట్లో ఏం జరుగుతుందో నిఘా పెడతారు.  ఒక వేళ దొంగలు ఇంట్లోకి ప్రవేశిస్తే పోలీసులు అమర్చిన కెమెరాలు వెంటనే పని చేసి పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సమాచారాన్ని క్షణాల్లో అందిస్తాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి క్షణాలలో దొంగలను పట్టుకునే అవకాశం ఈ సిస్టం ద్వారా వీలవుతుంది. ఇక మనం కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సెల్‌ఫోన్‌ ద్వారా ఇంటిని పరిశీలించుకోవచ్చు.  


సద్వినియోగం చేసుకోండి

ఈ యాప్‌ ద్వారా పోలీసు సేవలను ఉపయోగించుకొని ఇళ్లలోని విలువైన వస్తువులకు రక్షణ కల్పించుకోవాలి. ప్రజలందరూ సహకరిస్తే దొంగతనాలను అరికట్టడమే కాక, దొంగల ఆటలను సులువుగా అరికట్టవచ్చు. ఎల్‌ఎంహెచ్‌ఎ్‌స నెంబర్‌ : 8186881100

- జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ 

Read more