అధికారుల సమన్వయంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-04-06T05:13:19+05:30 IST

కోదండరాముని బ్రహ్మోత్సవాలను అధికారుల సమన్వయంతో వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ డిప్యూటీ ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు.

అధికారుల సమన్వయంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు
అధికారులకు సూచనలు ఇస్తున్న టీటీడీ డిప్యూటీ ఈఓ ధర్మారెడ్డి

టీటీడీ డిప్యూటీ ఈఓ ధర్మారెడ్డి


ఒంటిమిట్ట, ఏప్రిల్‌ 5: కోదండరాముని బ్రహ్మోత్సవాలను అధికారుల సమన్వయంతో వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ డిప్యూటీ ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి కల్యాణ వేదిక, రామాలయం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ విజయరామరాజుతో కలసి జిల్లా అధికారులు, టీటీడీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా టీటీడీ డిప్యూటీ ఈఓ మాట్లాడుతూ ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి నిర్వహించే ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 15వ తేదీ సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తామ న్నారు. కల్యాణ వేదికపై మంత్రులు, ఇతర వీఐపీల కోసం ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. స్వామి వారి కల్యాణానికి లక్ష మందికి పైగా భక్తులు వస్తారని జిల్లా అధికారులు అంచనా వేశారని చెప్పారు. టీటీడీ, పోలీసు, రెవెన్యూ, ప్రజారోగ్యం ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రతి గ్యాలరీలో తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. కల్యాణం ముగిశాక ఒక్కసారిగా భక్తులు బయటకు వెళ్లకుండా నిదానంగా బయటకు పంపే ఏర్పాట్లు చేయాలన్నారు. వీఐపీలు, ఇతరుల వాహనాల పార్కింగ్‌ ప్రదేశాలు గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కల్యాణ వేదిక ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. అన్ని శాఖల సమన్వయం కోసం కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలన్నారు. వైర్‌లెస్‌ సెట్లు తగినన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ టీటీడీ అధికారులతో కలిసి జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో బ్రహ్మోత్సవాలకు సహకరిస్తుందని తెలిపారు. అంతకు ముందు వారు  ఏప్రిల్‌ 9న పూర్తిస్థాయిలో సమీక్ష జరిపి అధికారులకు విధులు, బాధ్యతలు అప్పగిస్తామన్నారు. జేఈఓ వీరబ్రహ్మం, జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ, కడప ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి, అదనపు ఎస్పీ మహేష్‌కుమార్‌, టీటీడీ సీఈ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈఓ రమణ ప్రసాద్‌, వీజీఓ మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-04-06T05:13:19+05:30 IST