వెదురు కష్టాలు

ABN , First Publish Date - 2022-10-12T04:31:58+05:30 IST

అడవిలో విస్తారంగా వెదురు ఉన్నా అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే అటవీ శాఖాధికారులు అనుమతులు లేవని అడ్డుకుంటున్నారని మాకు వెదురు కష్టాలు తప్పడం లేదని గిరిజనులు వాపోతున్నారు.

వెదురు కష్టాలు
సగం వరకు అల్లి పెట్టిన వెదురు బుట్టలు

అడవిలో వెదురుకు అనుమతించని అధికారులు

బయటి ప్రాంతాల నుంచి అధిక రేటుకు కొనుగోలు

వెదురు దొరక్క... వ్యాపారాలు లేక అష్టకష్టాలు

ఆదుకోమని వేడుకుంటున్న గిరిజనులు


రైల్వేకోడూరు, అక్టోబరు 11: రెక్కాడితే గాని డొక్కాడదు. రోజంతా కష్టపడి బుట్టలు అల్లి వాటిని అమ్ముకుని జీవనం గడుపుతున్నారు. అడవిలో విస్తారంగా వెదురు ఉన్నా అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే అటవీ శాఖాధికారులు అనుమతులు లేవని అడ్డుకుంటున్నారని మాకు వెదురు కష్టాలు తప్పడం లేదని గిరిజనులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే... రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేలి, పుల్లంపేట, పెనగలూరు మండలాల్లో వెదురు బుట్టలు అల్లే గిరిజనుల కుటుంబాలు 2 వేల వరకు ఉన్నాయి. వారంతా వెదురుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కుక్కలదొడ్డి, నేతివారిపల్లె, ధర్మాపురం, వెంకటేశ్వరపురం, తడికలబైలు, శెట్టిగుంట తదితర ప్రాంతాలకు చెందిన గిరిజనులు బుట్టలు అల్లి వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. పెద్ద సైజు గంప రూ.150, చిన్న గంప రూ.60, తమలపాకు గంప రూ.20, కోడి గంప రూ.300 విక్రయాలు చేస్తున్నారు. గతంలో అడవికి వెళ్లి వెదురు తెచ్చుకుని బుట్టలు అల్లుతుండేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. అటవీ శాఖాధికారులు అనుమతి లేదని చెబుతున్నారని గిరిజనులు వాపోతున్నారు. కొందరు రైతులు తమ పొలాల్లో వెదురు సాగు చేసేవారు. వారి వద్ద నుంచి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం వారు కూడా వెదురు సాగు నిలిపివేశారని దీంతో తాము మరింత కష్టాలు పడుతున్నామని వాపోతున్నారు. కొందరు వ్యాపారులు బయటి ప్రాంతాల నుంచి వెదురును తెప్పించి గిరిజనులకు అమ్ముతున్నారు. వారు ఒక్కో వెదురు రూ.75 నుంచి 90 రూపాయలకు అమ్ముతున్నారని, అదే రైతుల దగ్గర అయితే రూ.40 నుంచి 30 రూపాయలకు లభించేదని చెబుతున్నారు. దూర ప్రాంతాల్లో లభించే వెదురును తీసుకుని భాగాలు వేస్తారు. అందులో ఒక్కో గిరిజనుడికి 10 వెదుర్లు వస్తున్నాయి. ఒక్క పెద్ద వెదురుతో ఒక్క పెద్ద గంపను అల్లవచ్చు. నెలకు ఒక్కసారి మాత్రమే వెదురు వస్తుందని అప్పుడే పని ఉంటుందని, మిగిలిన రోజులు కూలి పనులకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. డిమాండ్‌ను బట్టి వెదురు బుట్టల విక్రయాలు సాగుతాయి. గతంలో మామిడి కాయలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు వెదురు బుట్టలు ఉపయోగించేవారు. ప్రస్తుతం ప్లాస్టిక్‌ ట్రేలల్లో కాయలు ఎగుమతి చేస్తుండటంతో వెదురు బుట్టలకు గిరాకీ తగ్గింది. ప్రస్తుతం రైతులు ఎరువులతో పాటు తమలపాకులకు గంపలను ఉపయోగిస్తున్నారు. కోడి గంపలు కూడా ఎవరో అడిగితే గాని తయారు చేయడం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా అడవుల్లో పుష్కలంగా ఉన్న వెదురును టెండర్‌ రూపంలో ఇవ్వాలని గిరిజనులు కోరుతున్నారు. అంతేకాకుండా కొందరు ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లలో ఉండగా చాలామంది అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటున్నామని దీంతో జీవనం కష్టంగా ఉందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. 


వెదురు సమస్యను తీర్చాలి

- బుడిగి శంకరయ్య, ధర్మాపురం, రైల్వేకోడూరు

వెదురు సమస్యకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. వెదురు కోసం చాలా కష్టాలు పడుతున్నాము. బుట్టలు అల్లుకుని జీవనం సాగిస్తున్నాము. గతంలో రైతుల పొలాల్లోంచి వెదురు కొనుగోలు చేస్తుండేవారం. ప్రస్తుతం వారు సాగు నిలిపేస్తున్నారు. ఎక్కడైనా అరకొర దొరికిన వెదురు తీసుకుని వచ్చి బుట్టలు అల్లుతున్నాము. అటవీ శాఖాఽధికారులు, సిబ్బంది దాడులు ఆపాలి. గిరిజనులకు ప్రభుత్వం న్యాయం చేయాలి.


అడవిలో ఉన్న వెదురుకు అనుమతి ఇవ్వాలి

- కావేటి చంగల్రాయుడు, ధర్మాపురం, రైల్వేకోడూరు

అడవిలోని వెదురుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. వెదురు ఉంటే ప్రతిరోజూ పనులు ఉంటాయి. తెలియని కూలీ పనులకు వెళ్లి ఏమీ చేయలేకపోతున్నాము. ఇంటిలో అందరికీ మూడు పూటలా భోజనాలు పెట్టాలంటే వెదురు కష్టాలను ప్రభుత్వం తీర్చాలి. చాలా కాలంగా వెదురుతో ఇబ్బందులు పడుతున్నాము. వెదురు ఇతర ప్రాంతాల్లో ఉన్నా చాలా ఎక్కువ ధరలకు ఇస్తున్నారు. దీంతో గిట్టుబాటు కావడం లేదు. రాజకీయ నాయకులు దృష్టి సారించి వెదురు కష్టాలను తీర్చాలి.



Updated Date - 2022-10-12T04:31:58+05:30 IST