‘లోన్‌యాప్‌’ కమిషన్‌ ఏజెంట్‌ అరెస్టు

ABN , First Publish Date - 2022-09-27T05:56:13+05:30 IST

లోన్‌యా్‌పలకు సంబంధించి మోసగాళ్లకు సహకరించడంతో పాటు వారి వద్ద నుంచి కమిషన్‌ తీసుకుంటున్న ఏజెంటును సైబర్‌ సెల్‌, సీకేదిన్నె పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ సోమవారం

‘లోన్‌యాప్‌’ కమిషన్‌ ఏజెంట్‌ అరెస్టు
అరెస్టయిన లోన్‌యాప్‌ కమిషన్‌ ఏజెంటు వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌

వివరాలను వెల్లడించిన ఎస్పీ

కడప (క్రైం), సెప్టెంబరు 26 : లోన్‌యా్‌పలకు సంబంధించి మోసగాళ్లకు సహకరించడంతో పాటు వారి వద్ద నుంచి కమిషన్‌ తీసుకుంటున్న ఏజెంటును సైబర్‌ సెల్‌, సీకేదిన్నె పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ సోమవారం ఏఎస్పీ తుషార్‌ డూడీతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.

చింతకొమ్మదిన్నె మండలం ఎర్రమాచుపల్లెకు చెందిన బండి సాయికుమార్‌రెడ్డి ఓ సిమెంటు కంపెనీలో మార్కెటింగ్‌ మేనేజరుగా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో రూపీస్‌ లోన్‌లో తన ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రూ.95వేలకు అప్పు కావాలని రిక్వెస్ట్‌ పెట్టుకున్నాడు. అందులో కంపెనీ మాడల్స్‌ ప్రకారం ముందుగానే క్యాపిటల్‌ అమౌంటు నుంచి తగ్గించి రూ.65వేలు మాత్రమే ఇతి అకౌంటులో వేశారు. ఈ అప్పునకు సంబంధించి వివిధ తేదీల్లో ఈఎంఐ రూపంలో రూ.3,71,950 అతను చెల్లించాడు. అయినప్పటికీ ఇంకా రూ.99వేలు చెల్లించాలని పదే పదే ఇతడి మొబైల్‌కు బెదిరింపు కాల్స్‌ చేసేవారు. స్నేహితులు, బంధువులకు మీ ఫొటోలు, ఆధార్‌ పెడతామంటూ బెదిరించేవారు. దీంతో లోన్‌యా్‌ప మోసగాళ్ల వేధింపులు తాళలేక బండి సాయికుమార్‌రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌ 19న చింతకొమ్మదిన్నె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. 

కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి, రూరల్‌ సీఐ శ్రీరామ్‌ శ్రీనివాసులు, సైబర్‌ సెల్‌ డీఎస్పీ శ్రీధర్‌నాయుడు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసుకున్నారు. కేసు పరిశోధనలో భాగంగా బాధితుడు డబ్బు చెల్లించిన యూపీఐ ఐడీలను సేకరించి వాటి ద్వారా నిందితులు ఉపయోగించిన అకౌంటు వివరాలు సేకరించి విచారణ చేశారు. లోన్‌యాప్‌ల ద్వారా మోసం చేస్తున్న ప్రధాన నిందితులకు అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్‌, కృష్ణాపురం 8వ రోడ్డుకు చెందిన లింగుట్ల రంగనాధ్‌ సహకరిస్తున్నట్టు గుర్తించారు. ఇతను వివిధ పేర్లతో, వివిధ బ్యాంకుల్లో, అకౌంట్లు ఓపెన్‌ చేస్తూ ఆ అకౌంట్ల వివరాలను నిందితులకు చేరవేస్తూ అందుకు ప్రతిఫలంగా అకౌంట్లో క్రెడిట్‌ అవుతున్న డబ్బులకు లక్షకు పదివేలు కమిషన్‌ తీసుకుంటున్నట్టు గుర్తించారు. ఇతను లోన్‌యాప్‌ మోసగాళ్లకు కమిషన్‌ ఏజంటుగా పనిచేస్తున్నట్టు గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన సీఐలు శ్రీరామ్‌ శ్రీనివాసులు, శ్రీధర్‌నాయుడు, పెండ్లిమర్రి ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి, సీకేదిన్నె ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి, సైబర్‌ సెల్‌ ఎస్‌ఐ మధుమల్లేశ్వర్‌రెడ్డిలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - 2022-09-27T05:56:13+05:30 IST