కేరళ తర్వాత కోడూరులో విస్తరిస్తున్న వైనం

ABN , First Publish Date - 2022-09-29T05:52:14+05:30 IST

ఎర్ర అరటిసాగు కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఉండేది. క్రమేణా రైల్వేకోడూరులోని రైతులు కూడా ఈ రకం అరటిని సాగుచేయం ప్రారంభించారు. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో తర్వాత రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఎర్ర అరటి సాగును రైతులు విస్తారంగా చేపట్టారు. ఇక్కడ దాదాపు రెండు వేల హెక్టార్లకు పైగా రైతులు ఎర్ర అరటిపంటను సాగు చేశారు. పంట సాగుకు ఎకరాకు రూ.50వేల వరకు పెట్టుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు.

కేరళ తర్వాత కోడూరులో విస్తరిస్తున్న వైనం
అరటి తోటలో సేంద్రియ వ్యవసాయం కోసం ఏర్పాటు చేసిన డ్రమ్ములు

తోటలో పట్టలు పరిచి గడ్డి నివారణ చర్యలు

రైతుగా మారిన రిటైర్డ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌


రైల్వేకోడూరు, సెప్టెంబరు 27: ఎర్ర అరటిసాగు కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఉండేది. క్రమేణా రైల్వేకోడూరులోని రైతులు కూడా ఈ రకం అరటిని సాగుచేయం ప్రారంభించారు. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో తర్వాత రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఎర్ర అరటి సాగును రైతులు విస్తారంగా చేపట్టారు. ఇక్కడ దాదాపు రెండు వేల హెక్టార్లకు పైగా  రైతులు ఎర్ర అరటిపంటను సాగు చేశారు. పంట సాగుకు ఎకరాకు రూ.50వేల వరకు పెట్టుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. దిగుబడి, ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రిటైర్డ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌  సింగారపు మురళి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో ఎర్ర అరటి సాగు చేపట్టి.. మంచి దిగుబడి సాధించడంతో అందరి మన్ననలు పొందుతున్నారు. ఆదాయం పొందడంతో పాటు సేంద్రయ పద్ధతిలో పంటలు సాగు చేసి వినియోగదారులకు మంచి ఆహారం అందించడమే తన ఆశయం అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే రైతులందరూ సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించి పంటల సాగు చేపట్టాలని కోరుతున్నారు.


రైల్వేకోడూరు మండలంలోని రెడ్డివారిపల్లె పంచాయతీ పరిధిలోని కేసీ అగ్రహారం గ్రామానికి చెందిన సింగారపు మురళి (ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌) ఎర్ర అరటి సాగును చేపట్టారు. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను మళ్లించాలనే ఉద్దేశ్యంతో ఆయన తన ఐదు ఎకరాల పొలంలో ఈ ఏడాది ఎర్ర అరటి సాగు చేపట్టారు.  బెంగళూరుకు చెందిన మైక్రోబిల్‌ మినింగ్‌ బయో టెక్నాలజీ వారి నుంచి ఎర్ర అరటి టిష్యూ కల్చర్‌ తీసుకువచ్చి నాటారు. ఎకరాలో 250 ఎర్ర అరటిచెట్లు సాగు చేశారు. సాగులో వరస వరసకు 14 అడుగులు దూరం పెట్టారు. చెట్టుకు చెట్టుకు మధ్య 10 అడుగుల దూరంలో నాటారు.  


సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో....

ఎర్ర అరటి సాగు పూర్తి స్థాయిలో సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో చేపట్టారు. అరటి  సాగు చేపట్టాక తోటలో విపరీతంగా గడ్డి వచ్చేది... దాన్ని తొలగించడానికి కూలీల ఖర్చులు కూడా పెరిగిపోయేవి. దీంతో ఆయన నల్లటి పట్టలు తెప్పించి తోటలో పరిచంతో గడ్డి సమస్య లేకుండా పోయింది. ఇక అరటి తోటలో వ్యాప్తి చెందుతున్న పురుగుల నివారణకు బెంగళూరు నుంచి సేంద్రియ మందులు తెప్పించి పిచికారి చేయిం చారు. తోటలోనే పది ప్లాస్టిక్‌ డ్రమ్ములను పెట్టి వాటిలో ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న పదార్థాలను కలిపి తోటకు అందించారు.  పంటకు సేంద్రియ ఎరువులు అందించి.. చీడపీడలు ఆశించకుండా జాగ్రత్తలు పాటించారు. ప్రతిరోజూ అరటితోటను పరిశీలించి చెట్లకు కావాల్సిన పోషకాలను అందించే ప్రక్రియ చేపట్టారు. ఏయే సమయంలో నీరు అందించాలి, ఎరువులు ఎలా వేయాలి,  కోత తర్వాత చేపట్టాల్సిన చర్యలు తదితర విషయాలను క్షుణ్ణంగా తెలుసుకొని.. ఆచరణలో పెట్టడంతో మంచి దిగుబడులు వచ్చాయి. మొదటి కటింగ్‌లో 120 గెలలు తెగాయి. ఒక్కో గెల 15 కిలోల బరువు ఉంది. గెల రూ.400 ధర పలికింది. ఈ లెక్కన దాదాపు రూ.48వేలు ఆదాయం వచ్చింది. దీంతో ఆయన ఆశయం ఫలించింది. 


ఎర్ర అరటికి మంచి డిమాండ్‌

ఎర్ర అరటికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ అరటి పండును ప్రజలు ఇష్టపడి తింటారు. ఇందులో కార్బోహైడ్రేట్స్‌ 40 శాతం ఉంటాయి. దీంతో తక్షణ శక్తి ఇస్తుంది. 0.02 విటమిన్‌-సి ఉంటుంది. కొద్దిగా బీ-కాంప్లెక్స్‌ ఉంటుంది. జీర్ణశక్తి కూడా ఇస్తాయి. ఇదిలా ఉండగా మామూలు అరటి పండ్లు ఆకుపచ్చగా ఉంటాయి. ఈ అరటి తోలు ఎర్రగా ఉంటుంది. ఎక్కువ బరువు ఉంటుంది. రుచి, వాసన కలిగి ఉంటుంది. ఇక్కడ పండిన ఎర్ర అరటి పండ్లను మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి రైతులు ఎగుమతులు చేస్తున్నారు. 


రసాయనిక మందుల వాడకం తగ్గించాలి

- సింగారపు మురళి, రైతు, కేసీ అగ్రహారం

రసాయనిక మందుల వాడకం తగ్గించాలి.  రైతులు ఎక్కువ శాతం సేంద్రియ వ్యవసాయం చేపట్టాలి. పుట్ట మట్టి, బెల్లం, ఆవు పేడ తదితరాలను తీసుకుని వాటిని కుళ్ల బెట్టి ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో ఉంచి మోటారు ద్వారా తోటకు అందిస్తున్నాం. కాయలు నాణ్యత గా ఉంటే తీసుకున్న వినియోగదారుల ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. ఎర్ర అరటికి మంచి డిమాండ్‌ ఉంది. పిలకలు ఆరోగ్యంగా ఉన్నవి ఎంచుకోవాలి. మంచి కంపెనీకి చెందినవి నాటాలి. ఎరువులు, మందులు సమపాళ్లలో ఉండాలి.


 

Read more