మజ్జిగలో విషపు గుళికలు కలిపి...

ABN , First Publish Date - 2022-09-09T04:25:22+05:30 IST

విషపు గుళికలను మజ్జిగలో కలిపిలో తనతో పాటు తన ముగ్గురి పిల్లలకు తాపి ఓ తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

మజ్జిగలో విషపు గుళికలు కలిపి...
కోడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేస్తున్న వైద్యులు

చిన్నారులతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం

అపస్మారక స్థితిలో ముగ్గురు చిన్నారులు, తండ్రి

తిరుపతి రుయా ఆస్పత్రికి తరలింపు


రైల్వేకోడూరు, సెప్టెంబరు 8: విషపు గుళికలను మజ్జిగలో కలిపిలో తనతో పాటు తన ముగ్గురి పిల్లలకు తాపి ఓ తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న వారిని గ్రామస్థులు గుర్తించి వెంటనే రైల్వేకోడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థానికులు అందించిన వివరాల మేరకు... మండలంలోని చియ్యవరం పంచాయతీ కేఆర్‌ కండ్రిక గ్రామ సమీపంలో ఉన్న ఎస్‌ఆర్‌ గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న కొండా మణి అనే వ్యక్తికి కొన్ని సంవత్సరాల కిందట అదే గ్రామానికి చెందిన లక్ష్మీదేవితో వివాహమైంది. వీరికి శ్రీవాషిణి, సంగీత, లతీష్‌ అనే పిల్లలు ఉన్నారు. కుటుంబ జీవనం కష్టంగా ఉండటంతో లక్ష్మీదేవి జీవనోపాధి నిమిత్తం రెండేళ్ల కిందట కువైత్‌కు వెళ్లింది. అక్కడ షేఠ్‌ ఇంట్లో పని కష్టం కావడం, ఇబ్బందులకు పడి సేఠ్‌ ఇంట్లోంచి పరారీ కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. పాస్‌పోర్టు షేఠ్‌ దగ్గర ఉండిపోవడంతో ఇండియాకు వచ్చే మార్గం లేక అక్కడే దొంగతనంగా పనులు చేసుకుంటోందని స్థానికులు తెలిపారు. పిల్లల పోషణ, బతుకు భారమైందని, అప్పులు ఉన్నాయని, భార్య రాలేక ఇబ్బందులు పడుతోందని మణి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. మద్యం అలవాటుతో మరింత కుంగిపోతున్నాడని స్థానికులు తెలిపారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన అతడు గురువారం తన ముగ్గురు పిల్లలకు మజ్జిగలో విషపు గుళికలు తాపించి తాను కూడా తాగాడు. మజ్జిగ తాగిన ఒక్కొక్కరు అపస్మారక స్థితిలోకి వెళ్లడం గమనించిన గ్రామస్థులు వెంటనే వారిని రైల్వేకోడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా మారడంతో ఇక్కడి నుంచి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా తమకు దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. 

Read more