భలే మంచి చౌక బేరం...

ABN , First Publish Date - 2022-09-18T04:31:43+05:30 IST

రాజంపేట పట్టణానికి నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ స్థలం లీజుకు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది.

భలే మంచి చౌక బేరం...
లీజుకు ఇవ్వనున్న సిబ్బంది ఆర్టీసీ క్వార్టర్స్‌ ప్రాంగణం

లీజుకు ఆర్టీసీ స్థలం 

రూ.కోట్ల విలువ చేసే స్థలం 30 ఏళ్ల లీజుకు సన్నాహాలు 

రూ.25 లక్షల డిపాజిట్‌... రూ.2.50 లక్షల అద్దె

లీజుపై సర్వత్రా విమర్శలు 


రాజంపేట పట్టణానికి నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ స్థలం లీజుకు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. కోట్లాది రూపాయల విలువ చేసే రెండున్నర ఎకరాల స్థలాన్ని 30 సంవత్సరాలు లీజుకు ఇచ్చేందుకు అధికారులు అన్నీ సిద్ధం చేస్తున్నారు. రూ.25 లక్షల డిపాజిట్‌, నెలకు రూ.2.50 లక్షల అద్దె వసూలు చేయడానికి నిర్ణయించారు. ఇప్పటికే ఆర్టీసీ బస్టాండుకు ముందు ఉన్న స్థలాన్ని పెట్రోల్‌ బంకుకు, వ్యాపార సముదాయాలకు లీజుకు ఇవ్వగా, ప్రస్తుతం సిబ్బంది క్వార్టర్స్‌ ప్రాంగణాన్ని కూడా లీజుకు ఇవ్వనున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


రాజంపేట, సెప్టెంబరు 17: పార్లమెంటరీ, రెవెన్యూ డివిజన్‌, నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట జిల్లా కేంద్రం కాకపోగా ఉన్న వనరులు కూడా లేకుండా చేస్తుండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. జిల్లా కేంద్రం కాకపోగా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలో ఉన్న స్థలాలను ప్రైవేట్‌ వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజంపేట పట్టణంలో పట్టణ ఔన్నత్యాన్ని కాపాడేవి మూడు ప్రభుత్వ ఆస్తులు. అవి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణం, ఆర్టీసీ డిపో ప్రాంగణం, ఆర్‌అండ్‌బీ అతిథి గృహ ప్రాంగణాలు. ఈ మూడు ప్రభుత్వ ఆస్తులే ప్రస్తుతం రాజంపేట పట్టణానికి ఆయువు పట్టు. ఆర్టీసీ ప్రాంగణం కోట్ల రూపాయల విలువ చేస్తుంది. సుమారు 50 సంవత్సరాల కిందట అప్పటి పాలకులు పట్టణానికి నడిబొడ్డున 13.4 ఎకరాల సువిశాలమైన భూమిని ఆర్టీసీకి కేటాయించారు. ఆ స్థలంలో ఆర్టీసీ డిపో, బస్టాండు, గ్యారేజీ, డిపో మేనేజరు కార్యాలయం, ఆఫీసు సిబ్బంది, సిబ్బంది క్వార్టర్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం విలీనం చేసుకుంది. ఆర్టీసీ కార్పొరేషన్‌కు బదులు ప్రభుత్వ సముదాయంగా ఈ ఆస్తులు మారిపోయాయి. గతంలో సుమారు 130 బస్సులతో ఆర్టీసీ బస్టాండు కళకళలాడేది. సిబ్బందికి కావాల్సిన క్వార్టర్స్‌ను కూడా ప్రాంగణంలోనే ఏర్పాటు చేయడం వల్ల సిబ్బందికి మంచి సౌకర్యాలు ఉండేవి. అయితే ఆర్టీసీ రానురాను అథోగతి పాలైంది. ఆర్టీసీ బస్సుల స్థానంలో ప్రైవేటు బస్సులు, ప్రైవేటు డ్రైవర్లు ఎక్కువ శాతం వచ్చేశారు. కేవలం ఆర్టీసీ పాత బస్సులు, కొంతమంది కండక్టర్లు, మెకానిక్‌ ఇంజనీరింగ్‌ సిబ్బంది మాత్రమే ఉన్నారు. క్వార్టర్స్‌ ప్రాంగణం పూర్తిగా పాడైపోయింది. ఆర్టీసీ సిబ్బంది క్వార్టర్స్‌ శిథిలావస్థకు చేరుకుంది. ఆర్టీసీ ప్రాంగణం ముందు భాగం పూర్తిగా కంపచెట్లకు నిలయంగా మారింది. ఈ సమయంలో ఆర్టీసీ స్థలాల ద్వారా ఆదాయం గడించాలన్న ఆలోచన సంబంధిత అధికారులకు పడింది.


2.50 ఎకరాల భూమి 30 ఏళ్ల లీజుకు...

ఆర్టీసీ డిపో ముందు భాగాన సువిశాలమైన స్థలం ఉండేది. ఇది ఆర్టీసీకి ఎంతో విలువైన ఆభరణంగా ఉండేది. అటువంటి స్థలాన్ని ప్రయాణికులు కూడా లోనికి సక్రమంగా పోలేని విధంగా పెట్రోలు బంకుకు, ఇతర వ్యాపార సముదాయాలకు ఇచ్చేశారు. ఏకంగా 30 సెంట్ల ముఖద్వార స్థలాన్ని అప్పజెప్పారు. మిగిలిన స్థలాన్ని వ్యాపార సముదాయాలు పెట్టుకోవడానికి లీజుకు ఇచ్చేశారు. ఇప్పుడు ఆర్టీసీ డిపో ప్రాంగణంలోని సిబ్బంది క్వార్టర్స్‌పై కన్ను పడింది. సిబ్బంది క్వార్టర్స్‌ శిథిలావస్థలో ఉండటంతో ఈ స్థలాన్ని ఏకంగా 30 ఏళ్లకు లీజుకు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. ఎకరాకు 9 లక్షల చొప్పున ముందస్తు డిపాజిట్‌ చేసి ఎకరాకు 90 వేల రూపాయల చొప్పున నెలసరి అద్దె చెల్లిస్తే వారికి ఈ భూమిని 30 ఏళ్లకు లీజుకు ఇవ్వనున్నారు. మొత్తం రెండున్నర ఎకరాలు లీజుకు ఇస్తే సుమారు 25 లక్షల రూపాయల డిపాజిట్‌, రెండున్నర లక్ష అద్దె చెల్లించేవారికి ఈ మొత్తం ఆస్తిని 30 ఏళ్లకు లీజుకు ఇవ్వడానికి పావులు కదుపుతున్నారు. లీజుకు తీసుకున్న వారు ఈ స్థలంలో కల్యాణ మండపాలు, ఇతర ప్రజాప్రయోజనాల వ్యాపార సముదాయాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా కోట్ల రూపాయల విలువ చేసే రెండున్నర ఎకరాల భూమిని 25 లక్షల డిపాజిట్‌తో, నెలకు రెండున్నర లక్ష అద్దెతో ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. ఆర్టీసీ ముఖద్వారాన్ని ఇప్పటికే పెట్రోలుబంక్‌కు, ఇతర వ్యాపార సముదాయాలకు అప్పగించి తిరిగి రెండున్నర ఎకరాల భూమిని పూర్తిగా లీజుకు ఇవ్వడం చూస్తుంటే అందునా 30 ఏళ్లకు లీజుకు ఇస్తున్నారంటే ఈ 30 ఏళ్లలో ఎన్ని మార్పులు జరుగుతాయి, అసలు ఆర్టీసీ మనుగడ ఉంటుందా, ఈ ఆస్తులు కాపాడుకోగలుగుతారా..? అలాగే కొనసాగుతాయా..? ఇక రానురానూ పూర్తిగా ఆర్టీసీ ఆస్తులు ఏమవుతాయన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ స్థలాన్ని లీజుకు ఇవ్వడానికి ఆర్టీసీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. 


ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే...

- రమణయ్య, ఆర్టీసీ డిపో మేనేజర్‌, రాజంపేట

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్టీసీ ప్రాంగణంలోని నిరుపయోగంగా ఉన్న క్వార్టర్స్‌ ప్రాంగణాన్ని లీజుకు ఇవ్వాలని నిర్ణయించాం. క్వార్టర్స్‌ ప్రాంగణం సుమారు రెండున్నర ఎకరాలు. క్వార్టర్స్‌ శిథిలావస్థలో ఉండటంతో మొత్తం ప్రాంగణం కంపచెట్లకు నిలయంగా మారింది. అనేక సంవత్సరాలుగా ఈ స్థలమంతా నిరుపయోగంగా ఉంది. ఇది ప్రజల సౌకర్యార్ధం, కల్యాణ మండపం, ఇతరత్రా ప్రజలకు కావాల్సిన వ్యాపార సముదాయాలు 30 ఏళ్లు లీజుకు తీసుకుని పెట్టుకోవడానికి ఎకరాకు 9 లక్షల డిపాజిట్‌, నెలకు 90 వేల రూపాయలు అద్దె చెల్లించిన వారికి సుమారు రెండున్నర ఎకరాల స్థలాన్ని లీజుకు ఇవ్వాలని తలచాం. ఎవరైనా సంబంధిత వ్యక్తులు ఉంటే వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ స్థలాన్ని లీజుకు ఇస్తాము. ఉపయోగంలో లేని స్థలాన్ని ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పనికి ఇవ్వడం మంచిదే కదా.. 


వినాశకాలే.. విపరీత బుద్ధే.. :

- అద్దేపల్లె ప్రతా్‌పరాజు, టీడీపీ పార్లమెంట్‌ అధికార ప్రతినిధి, రాజంపేట

ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే వినాశకాలే విపరీత బుద్ధే అన్న పరిస్థితులు.. ఒకప్పుడు వెయ్యి మంది కార్మికులు, వందలాది బస్సులు, చుట్టూ పచ్చని చెట్లతో కళకళలాడిన ఆర్టీసీ ప్రాంగణం నేడు వెలవెలబోతోంది. ఆర్టీసీ ప్రాంగణమంతా శిథిలావస్థలో ఉంది. మొత్తం ఆర్టీసీ స్థలమంతా ముళ్లచెట్లతో నిండి ఉంది. కోట్ల విలువ చేసే ఈ స్థలాన్ని ఉపయోగించుకోలేకపోవడంతో కంపచెట్లతో నిండిపోయాయి. అసలు ఆర్టీసీ బస్టాండు ముందు భాగాన్ని పెట్రోలు బంకుకు లీజుకు ఇవ్వడం వల్ల బస్టాండు కనపడే పరిస్థితి లేకుండా పోయింది. ప్రయాణికులు వెళ్లే మార్గాన్ని కూడా పూడ్చి వేసి పెట్రోలు బంకుకు లీజుకు ఇవ్వడం దారుణం. మరోపక్క రెండున్నర ఎకరాల క్వార్టర్స్‌ స్థలాన్ని 30 ఏళ్లకు లీజుకు ఇవ్వడం దుర్మార్గపు చర్య. 


ఆందోళనలు నిర్వహిస్తాం

- సి.హెచ్‌.చంద్రశేఖర్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి, రైల్వేకోడూరు. 

రాజంపేటలో ఉన్నది మూడు ప్రధాన ప్రభుత్వ స్థలాలు. ఒకటి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, రెండవది ఆర్టీసీ, మూడవది ఆర్‌అండ్‌బీ. ప్రజలకు నిత్యం ఉపయోగపడే ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అందునా 30 ఏళ్లకు లీజుకు ఇవ్వాలని చూడటం చాలా బాధాకరం. దీనివల్ల రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆస్తులకే కళంకంగా మారుతుంది. పట్టణ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ స్థలంలో ప్రజలు ఒకింత సేదతీరడానికి పార్కును ఏర్పాటు చేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని తీసుకోకుండా ఎవరో ప్రైవేటు వ్యక్తులకు 30 ఏళ్లకు లీజుకు ఇస్తే ఆ రోజుకు ఈ స్థలం తిరిగి ఆర్టీసీ స్వాధీనమవుతుందా, అభివృద్ధి అనేది చేస్తారా..? అంటే ఇక ఈ ఆస్తి లీజులపరమేనా ఇదే పద్ధతి కొనసాగితే.. ఆందోళనలు చేస్తాం. Read more