రెచ్చిపోయిన ఇసుక మాఫియా

ABN , First Publish Date - 2022-12-06T23:23:24+05:30 IST

మదనపల్లె మండలంలో మట్టి, ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. మండలంలోనీ సీటీఎం అడవుల్లో నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తుండగా అడ్డుకున్న అటవీ సిబ్బందిపై దాడి చేసి పరారైన సంఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది.

రెచ్చిపోయిన ఇసుక మాఫియా
అటవీ సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తి

అక్రమ రవాణాను అడ్డుకున్న అటవీ సిబ్బందిపై దాడి

కేసు నమోదు చేసిన తాలూకా పోలీసులు

మదనపల్లె టౌన్‌, డిసెంబరు 6: మదనపల్లె మండలంలో మట్టి, ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. మండలంలోనీ సీటీఎం అడవుల్లో నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తుండగా అడ్డుకున్న అటవీ సిబ్బందిపై దాడి చేసి పరారైన సంఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. సీటీఎం పంచాయతీ చిన్నాయనచెరువు అడవుల్లో (తరిగొండ బీట్‌)లో సోమవారం రాత్రంతా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు ఎఫ్‌బీవో సుబ్బలక్ష్మికి సమాచారం అందింది. దీంతో ఆమె మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ (ఏబీవో) రాజారెడ్డిని వెంటబెట్టుకుని చిన్నాయన చెరువు అడవిలోకి వెళ్లారు. అడవి నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అటవీశాఖ అధికారులు అడ్డుకుని ట్రాక్టర్లను మదనపల్లెకు తీసుకురావాల్సిందిగా చెప్పారు. దీంతో ఇసుక మాఫియా సభ్యులైన శివకుమార్‌, అతడి తండ్రి, ఇంకో వ్యక్తి ఏబీవో రాజారెడ్డిని కిందపడేసి పిడిగుద్దులు గుద్ది, అతడి వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్‌, టార్చ్‌లైట్‌ తీసుకుని ట్రాక్టర్‌తో పాటు పారిపోయారు. దీంతో అటవీ శాఖ ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్‌వో మదనమోహన్‌ దృష్టికి జరిగిన సంఘటన గురించి సిబ్బంది చెప్పగా అయన సూచనల మేరకు మదనపల్లె తాలూకా సీఐ సత్యనారాయణకు బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐ మాట్లాడుతూ దాడికి గురైన అటవీ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితులను గుర్తించి త్వరలో అరెస్టు చేస్తామన్నారు. కాగా మదనపల్లె మండలం సీటీఎం గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల మట్టి, ఇసుక అక్రమ రవాణా జోరందుకుంది. ఈ అక్రమ రవాణాపై రెవెన్యూ, మైనింగ్‌, పోలీసు అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-12-06T23:23:25+05:30 IST