చెలరేగిపోతున్న భూమాఫియా

ABN , First Publish Date - 2022-11-30T23:39:18+05:30 IST

నియోజకవర్గ కేంద్రంలో భూమాఫియా చెలరేగిపోతోంది. రోజురోజుకు అక్రమంగా ప్లాట్లు వెలుస్తున్నాయి. భూమాఫియాకు ఖద్దరు అండదండలు పుష్కలంగా ఉండడంతో వారి ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. అక్రమంగా వేసిన ప్లాట్లకు అనుమతి లేకున్నా క్రయవిక్రయాలు జరిగిపోతున్నాయి.

చెలరేగిపోతున్న భూమాఫియా
గుంజననదికి సమీపంలో వేసిన ఇంటి ప్లాట్లు

పెరిగిపోతున్న అక్రమ ప్లాట్లు

భూమాఫియాకు ఖద్దరు అండదండలు

ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న వైనం

రైల్వేకోడూరు, నవంబరు 30: నియోజకవర్గ కేంద్రంలో భూమాఫియా చెలరేగిపోతోంది. రోజురోజుకు అక్రమంగా ప్లాట్లు వెలుస్తున్నాయి. భూమాఫియాకు ఖద్దరు అండదండలు పుష్కలంగా ఉండడంతో వారి ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. అక్రమంగా వేసిన ప్లాట్లకు అనుమతి లేకున్నా క్రయవిక్రయాలు జరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. వివరాల్లోకి వెళితే... రైల్వేకోడూరు మండలంలోని అనంతరాజుపేట నుంచి మైసూరివారిపల్లె, శెట్టిగుంట వరకు అక్రమ ప్లాట్లు వెలుస్తున్నాయి. ఇక్కడ భూమాఫియా చెప్పిందే వేదంగా మారింది. వారి కనుసన్నల్లోనే భూముల కొనుగోలు, క్రయవిక్రయాలు సాగుతున్నాయి. ఈ దందాలో చాలామంది ప్రముఖులు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనంతరాజుపేట, రైల్వేకోడూరు, మైసూరివారిపల్లెల్లో భూదందా ఎక్కువగా జరుగుతోంది. మామిడి తోటలు సాగు చేస్తున్న భూములే ప్లాట్లుగా మారుతున్నాయి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడానికి రెవెన్యూ శాఖలో దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూమి విలువలో ఎకరాకు 5 శాతం చెల్లించి తర్వాత ప్లాట్లు చేసుకుని క్రయవిక్రయాలు చేసుకోవాల్సి ఉందని రెవెన్యూ శాఖాధికారులు చెబుతున్నారు. కానీ అలా కొందరు ప్రభుత్వానికి డబ్బు చెల్లించకుండానే ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. వందలో పది శాతం మేరకు మాత్రమే వ్యవసాయేతరంగా ప్లాట్లు చేసుకున్న వారు ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి 5 శాతం చెల్లించారని రెవెన్యూ శాఖాధికారులు చెబుతున్నారు. అక్రమంగా ప్లాట్లు వేసిన వారికి రెవెన్యూ శాఖ రెండుసార్లు నోటీసులు జారీ చేసినా ఖద్దరు బాబుల అండతో అక్రమార్కులు వాటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మూడో నోటీసు ఇవ్వడానికి రెవెన్యూ శాఖాధికారులు సిద్ధంగా ఉన్నారు. గుంజననది ఆనుకుని ప్లాట్లు వేస్తున్నారు. నదీ పొరంబోకు స్థలాలు కూడా ప్లాట్లలో కలుపుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్లాట్లు వేసిన భూములు అన్నీ వ్యవసాయం చేసేవే ఉన్నాయి. రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములను ఇంటి ప్లాట్లుగా మార్చుతున్నారు. ఉదాహరణకు ఒక ఎకరా కొంటే రెండు ఎకరాలుగా తయారు చేస్తున్నారు. ఐదు ఎకరాలు తీసుకున్న వారు ఇంకో ఐదు ఎకరాలు కలిపేసుకుంటున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా రెవెన్యూ శాఖాధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చట్టప్రకారం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకుని 5 శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ఇంటి ప్లాట్లు వేసుకుని పంచాయతీ అప్రూవల్‌ చేసుకోవాలి. తాగునీరు, విద్యుత్‌ తదితర సౌకర్యాలు కల్పించాలి. ఇలా కాకుండా ముందుగానే ప్లాట్లు వేసి అమ్మకాలు మొదలు పెట్టేస్తున్నారు. వీరికి ఖద్దరు బాబుల అండతో పాటు అందులో వాటాలు కూడా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో రక్షణ గోడలు లేకుండా ఆక్రమించి ప్లాట్లు వేస్తున్నారు. భవిష్యత్తులో వరదలు వచ్చి ఇల్లు కూలిపోతే బాధ్యత ఎవరు వహిస్తారని స్థానికులు అంటున్నారు. రైల్వేకోడూరు మండలంలో సుమారుగా 20 ఇంటి ప్లాట్లు చేస్తున్నారు. ఎక్కువగా మైసూరివారిపల్లె పంచాయతీలోనే జరుగుతున్నాయి. కొన్ని ప్లాట్ల వారు మాత్రమే పంచాయతీ అప్రూవల్‌కు డబ్బులు చెల్లించి ఉన్నారు. చాలా మంది ఓ ప్రజాప్రతినిధి అండదండలు చూసుకుని భూమాఫియా చేస్తున్నారనేది బహిరంగంగా చెప్పుకోవడం కొసమెరుపు.

అక్రమంగా ఇంటి ప్లాట్లు వేస్తే చర్యలు తప్పవు

- బి.రామమోహన్‌, తహసీల్దార్‌, రైల్వేకోడూరు

అక్రమంగా ఇంటి ప్లాట్లు వేస్తే చర్యలు తప్పవు. ఇప్పటికే ప్లాట్లు వేసిన వారికి రెండు సార్లు నోటీసులు ఇచ్చి ఉన్నాము. మొదట అయితే 5 శాతంతో చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత అయితే 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది. మూడవ నోటీసులకు స్పందించకుంటే స్థలాలను బైండోవర్‌ చేసుకుంటాము. కొందరు మాత్రం ఇప్పటికే ప్రభుత్వానికి డబ్బు చెల్లించారు. మిగిలిన వారు ఇంకా చెల్లించలేదు. వారికి కూడా నోటీసులు ఇస్తాం. నదీపరివాహక ప్రాంతాలను ఆక్రమిస్తే చర్యలు తప్పవు.

Updated Date - 2022-11-30T23:39:18+05:30 IST

Read more