యువతకు లక్ష్యం తప్పనిసరి

ABN , First Publish Date - 2022-12-09T23:36:36+05:30 IST

యువత లక్ష్యసాధన దిశగా పయనించాలని, చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తే విజయం సొంతమవుతుందని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అన్నారు. శుక్రవారం రాయచోటి ప్రభుత్వం పాలిటెక్నిక్‌ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్‌ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు.

యువతకు లక్ష్యం తప్పనిసరి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

రాయచోటి(కలెక్టరేట్‌), డిసెంబరు 9: యువత లక్ష్యసాధన దిశగా పయనించాలని, చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తే విజయం సొంతమవుతుందని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అన్నారు. శుక్రవారం రాయచోటి ప్రభుత్వం పాలిటెక్నిక్‌ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్‌ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఈ మేళాకు కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా, మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దాదాపు 28 ప్రైవేట్‌ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెగా జాబ్‌మేళా నిర్వహించామని, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ జాబ్‌ మేళాలో రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో స్కిల్‌ హబ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, అక్కడకు వెళ్లి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని యువతకు సూచించారు. జీవితంలో ఏదైనా సాధించాలనే కసి, తపన, లక్ష్యం ఉండాలని ఉద్యోగం చిన్నదా, పెద్దదా అనే ఆలోచన కంటే ముందు జీవితంలో స్థిరపడాలనే లక్ష్యం ఉండాలన్నారు. పనిచేసే కంపెనీకి మంచిపేరు తీసుకురావాలన్నారు. ఈ మెగా జాబ్‌ మేళాలో జిల్లా పరిశ్రమశాఖ అధికారి నాగరాజు, డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ, జిల్లా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి హరికృష్ణ, పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శివశంకర్‌, వివిధ కంపెనీల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:36:46+05:30 IST