ప్రమాదపుటంచుల్లో వంతెన

ABN , First Publish Date - 2022-09-22T04:43:35+05:30 IST

పీలేరు-తలపుల మార్గంలోని గూడరేవుపల్లె వంకపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకుని ప్రమాదపుటంచుల్లో ఊగిసలాడుతోంది.

ప్రమాదపుటంచుల్లో వంతెన
ప్రమాదకరంగా ఉన్న గూడరేవుపల్లె వంతెన

వంకలో పడ్డ ఆటో.. డ్రైవర్‌ గల్లంతు

నిండుకుండలా నీరు

ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళనలో ప్రజలు


పీలేరు, సెప్టెంబరు 21: పీలేరు-తలపుల మార్గంలోని గూడరేవుపల్లె వంకపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకుని ప్రమాదపుటంచుల్లో ఊగిసలాడుతోంది. నిత్యం ప్రయాణీకులు, వాహనాలతో రద్దీగా ఉండే ఆ రోడ్డు మార్గంలో ఆ వంతెన కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని అటు గూడరేవుపల్లె గ్రామస్తులు, ఆర్టీసీ అధికారులు, వాహనచోదకులు నిత్యం భయం గుప్పిట్లో ఆ మార్గంలో ప్రయాణించాల్సి వస్తోంది. మంగళవారం రాత్రి మండలంలోని జాండ్ల గ్రామం నుంచి పీలేరు పట్టణానికి వస్తున్న ఆటో  గూడరేవుపల్లె వంకలో బోల్తాపడింది. వంక మీదున్న కాజ్‌వే చాలా తక్కువ ఎత్తులో ఉండడాన్ని డ్రైవర్‌ గమనించపోవడంతో ఆటో నేరుగా అందులోకి దూసుకెళ్లింది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో ఆటోను వెలికితీసినా డ్రైవర్‌ ఆచూకీ తెలియలేదు. ఆ మార్గంలో ప్రయాణించే అధికారులు, ప్రజాప్రతినిధులు దాని బాగోగులకు పట్టించుకోకపోవడంతో అది నేడో, రేపో కూలిపోయే దశలో ఉంది. పీలేరు పట్టణం నుంచి తలపుల, యల్లమంద, బోడేవాండ్లపల్లె, రొంపిచెర్ల ప్రాంతాలకు రాకపోకలకు సాగించడానికి గూడరేవుపల్లె వద్ద ఉన్న వంతెన దాటడం తప్పనిసరి. దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ వంతెన పెరిగిన వాహనాల రద్దీ తాకిడితో మరమ్మతులకు గురైంది. సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో కుంచించుకుపోయింది. గూడరేవుపల్లె వంకలో నిత్యం నీళ్లు నిండుకుండను తలపిస్తూ ఉంటాయి. అటువంటిది ఆ వంతెనపై ప్రయాణించేటప్పుడు చిన్న పొరపాటు జరిగినా ప్రాణనష్టం జరిగే అవకాశం లేకపోలేదు. 2019లో ఆ వంతెనపై ఓ ఆటో అదుపు తప్పి వంకలో పడడంతో డ్రైవర్‌ మృతి చెందాడు. గూడరేవుపల్లె నుంచి పీలేరు వైపు వస్తున్నప్పుడు రోడ్డు విశాలంగా ఉండడంతో వంతెనను గమనించని అనేకమంది డ్రైవర్లు సరిగ్గా వంతెన వద్దకు వచ్చినప్పుడు సకాలంలో తమ వాహనాలను అదుపు చేయలేకపోతున్నారు. అదేవిధంగా పీలేరు వైపు నుంచి గూడరేవుపల్లెకు వచ్చేటప్పుడు వంక సమీపంలోనే మలుపు ఉండడం కూడా ప్రమాదాలకు కారణంగా నిలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెనను బాగు చేయాలని ప్రయాణీకులు కోరుతున్నారు. 


దొరకని ఆచూకీ

గూడరేవుపల్లె వంకలో మంగళవారం రాత్రి ఓ ఆటో బోల్తాపడడం, అందులోని డ్రైవర్‌ కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి చీకటి కారణంగా విరమించుకున్నారు. బుధవారం మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెదికినా ఎటువంటి ఆనవాళ్లు చిక్కకపోవడంతో ఆటో బోల్తాపడిన తరువాత అందులోని డ్రైవర్‌ లేచి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడని, మద్యం మత్తులోనో, ఆటో బోల్తా పడిందన్న భయంతోనో అతను ఎవరికీ చెప్పుకోలేక అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. Read more