మదనపల్లె అభివృద్ధికి రూ.56 కోట్లు

ABN , First Publish Date - 2022-11-30T23:33:13+05:30 IST

మదనపల్లె అభివృద్ధికి రూ.56 కోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. విద్యాదీవెన నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని సీఎం బుధవారం మదనపల్లె నుంచి ప్రారంభించారు.

మదనపల్లె అభివృద్ధికి రూ.56 కోట్లు
విద్యాదీవెన మెగా చెక్కును అందజేస్తున్న సీఎం జగన్‌

నెలలో మెడికల్‌ కళాశాల పనులు ప్రారంభం

విద్యాదీవెన సభలో సీఎం జగన్‌

మదనపల్లె, నవంబరు 30: మదనపల్లె అభివృద్ధికి రూ.56 కోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. విద్యాదీవెన నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని సీఎం బుధవారం మదనపల్లె నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఎం.నవాజ్‌బాషా నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు కావాలని విభాగాల వారీగా సీఎంను కోరారు. దీంతో ఎమ్మెల్యే ప్రతిపాదించిన అంశాలన్నింటికీ సీఎం అంగీకరించడంతో పాటు రూ.56.30 కోట్లు మంజూరుకు హామీ ఇచ్చారు. ఇందులో టిప్పుసుల్తాన్‌ మైదానంలో మసీదు నిర్మాణానికి రూ.5 కోట్లు, పట్టణంలో మూడుచోట్ల రోడ్లు, భవనాల శాఖ పరిధిలో డ్రైనేజీ బ్రిడ్జిలు నిర్మించడానికి రూ.14 కోట్లు, బాహూదానదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.7.30 కోట్లు, నియోజకవర్గంలో రోడ్లు, కాలువల నిర్మాణానికి రూ.30 కోట్లు కావాలని ఎమ్మెల్యే కోరడంతో అందుకు సీఎం అంగీకరించారు. మదనపల్లె మెడికల్‌ కళాశాల పనులు నెలరోజుల్లో ప్రారంభమవుతాయని చెప్పారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వాటర్‌గ్రిడ్‌కు రూ.1800 కోట్లు మంజూరు చేయగా, అందులో మదనపల్లెకు రూ.400 కోట్లు ఉందన్నారు. అలాగే మదనపల్లె-ములకలచెరువు మార్గంలో నాలుగులేన్ల రోడ్డుకు రూ.400 కోట్లు, తిరుపతి-మదనపల్లె మార్గానికి రూ.1600 కోట్లతో కేంద్రంతో మాట్లాడి మంజూరు చేయించినట్లు సీఎం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడున్నరేళ్లలో నియోజకవర్గంలో రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ప్రకటించారు. మదనపల్లె-రామసముద్రం, మదనపల్లె-నిమ్మనపల్లె మార్గంలో డబుల్‌ రోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్లు, మున్సిపాలిటీలో రోడ్లు, కాలువలు, నీటి సరఫరాకు రూ.38 కోట్లు ఇప్పటికే మంజూరైనట్లు తెలిపారు. మదనపల్లె మున్సిపాలిటీలో 20 వేలు, మూడు మండలాల్లో పది వేల మందికి కలిపి మొత్తం 30 వేల మందికి ఇంటిపట్టాలు మంజూరు చేసినట్లు నవాజ్‌బాషా వివరించారు. ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం మన ప్రాంతానికి వచ్చినప్పుడు అవి కావాలని, ఇవి కావాలనీ ప్రతి ఒక్కరూ కోరతారని, అలా కాకుండా ఇప్పటికే తమ ప్రాంతానికి చేసిన అభివృద్ధిని వివరిస్తానంటూ గాలేరు-నగరి,హంద్రీ-నీవా అనుసంధానం, హంద్రీ-నీవా కాలువ వెడల్పుతో చెరువుకు నీటిని నింపడం, వాటర్‌గ్రిడ్‌, జాతీయ రహదారుల నిర్మాణం, తదితర అభివృద్ధిని ఎంపీ వివరించారు. కలెక్టర్‌ పి.ఎ్‌స.గిరీషా మాట్లాడుతూ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. విద్య ద్వారానే సమాజాభివృద్ధికి భావిస్తూ విద్యలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని, ఇందులో భాగంగానే జగనన్న విద్యాదీవెన పథకం రూపుదిద్దుకున్నట్లు కలెక్టర్‌ వివరించారు. ఉదయం 11 గంటలకు బి.టి.కళాశాల మైదానానికి చేరుకున్న జగన్‌ బెంగళూరు రోడ్డు, కదిరి రోడ్డు మీదుగా సభాస్థలి టిప్పుసుల్తాన్‌ మైదానానికి చేరుకోగా మధ్యాహ్నం 1:15 గంటలతో సమావేశం పూర్తయింది. మార్గమధ్యలో మహిళలు రోడ్డు వెంబడి సీఎంకు స్వాగతం పలికారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. నాలుగో విడత విద్యా దీవెనలో భాగంగా బటన్‌ నొక్కుడు కార్యక్రమం పూర్తయిన వెంటనే సీఎం మెగా చెక్కును అందజేశారు. సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.నారాయణస్వామి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ జకియాఖానం, ఎంపీలు మిథున్‌రెడ్డి, ఎన్‌.రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ఎం.నవాజ్‌బాషా, చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, వెంకటేశ్‌గౌడ్‌, జి.శ్రీకాంత్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జంగాలపల్లె శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్‌, కడప, చిత్తూరు జడ్పీ చైర్మన్లు ఆకేపాటి అమరనాథరెడ్డి, శ్రీనివాసులు (వాసు), ఏపీఎండీసీ చైర్‌పర్సన్‌ జి.షమీంఅస్లాం, మాజీ ఎమ్మెల్సీలు దేశాయి తిప్పారెడ్డి, బి.నరే్‌షకుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:33:16+05:30 IST