మంత్రి ‘కొట్టు’కు జనసేన సెగ

ABN , First Publish Date - 2022-11-21T03:17:00+05:30 IST

వైసీపీ నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులకే ప్రభుత్వ కార్యక్రమాల్లోనేకాదు... కార్తీక వన సమారాధనల్లోనూ నిరసనలు తప్పటం లేదు. ఉప ముఖ్యమంత్రి కొట్టు

మంత్రి ‘కొట్టు’కు జనసేన సెగ

‘గంజి’ని అడ్డుకున్న టీడీపీ.. వనసమారాధనల్లో కాక

తాడేపల్లిగూడెం రూరల్‌, పిడుగురాళ్ల, నవంబరు 20: వైసీపీ నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులకే ప్రభుత్వ కార్యక్రమాల్లోనేకాదు... కార్తీక వన సమారాధనల్లోనూ నిరసనలు తప్పటం లేదు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, వైసీపీ చేనేత విభాగ రాష్ట్ర అధ్యక్షుడు గంజి చిరంజీవిలను ఆయా కార్యక్రమాల్లో అడ్డుకుని, వారి తీరును తప్పు పట్టారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో ఆదివారం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కాపు వనసమారాధన కార్యక్రమానికి వెళ్లారు. ఆహ్వాన కమిటీ ఆయనను స్టేజిపైకి పిలిచింది. జనసేన పార్టీ యువత జై పవన్‌ కల్యాణ్‌ అంటూ 20నిముషాల పాటు నినాదాలతో హోరెత్తించారు. ఎంతకూ ఆ నినాదాలు ఆగకపోవడంతో చేసేదేమి లేక అలానే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘కాపులంతా ఐక్యంగా ఉండాలి. ఇలా గోల చేయడం వల్ల జనసైనికులకు ఒరిగేదేమి ఉండదు. ఇలాంటి చర్యల వల్ల కాపుల్ని ఇతర కులాల్లో చులకనగా చూస్తున్నారు. ఈ విధానాన్ని విడనాడాలి’’ అంటూ మంత్రి కొట్టు హితవుపలికారు.

కుల భోజనాలా..... వన భోజనాలా..!: ముశ్యం

పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగిన పద్మశాలి వనభోజన కార్యక్రమంలో పార్టీల గురించి మాట్లాడుతున్న వైసీపీ నాయకుడు, చేనేత విభాగ రాష్ట్ర అధ్యక్షుడు గంజి చిరంజీవి ప్రసంగాన్ని పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన బీసీ నాయకుడు అడ్డుకున్నారు. ‘‘వన భోజనాలకు వచ్చామా... తిని వెళ్లామా... అన్నట్టుగా ఉండాలే కానీ పార్టీల గురించి మాట్లాడితే మీకన్నా ఎక్కువే మాట్లాడతాం’’ అంటూ టీడీపీకి చెందిన ముశ్యం శ్రీనివాసరావు హెచ్చరించారు. ‘‘బీసీలకు టీడీపీ అన్యాయం చేసింది. మంగళగిరిలో లోకేశ్‌ గెలవడు’’ అని గంజి మాట్లాడుతుండగా నియోజకవర్గ బీసీ నాయకుడు ముశ్యం శ్రీనివారావు వేదిక ఎక్కి చిరంజీవి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ‘‘ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన 34శాతం బీసీల రిజర్వేషన్‌ ఇచ్చాకే ఎందరో నాయకులయ్యారు. దమ్ముంటే ఎవరైనా మంగళగిరిలో పోటీ చేయవచ్చు. రాసిపెట్టుకోండి... అక్కడ గెలిచేది లోకేశ్‌ మాత్రమే! ఆప్కో చైర్మన్‌ చల్లపల్లి మోహనరావైనా, గంజి చిరంజీవైనా ఈస్థాయికి వచ్చారంటే ఎన్టీఆర్‌ తెచ్చిన రిజర్వేషన్‌ పుణ్యమే’’ అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయింది.

Updated Date - 2022-11-21T03:17:00+05:30 IST

Read more