జగనన్నా.. డాక్టరెక్కడ?

ABN , First Publish Date - 2022-08-15T08:08:19+05:30 IST

జగనన్నా.. డాక్టరెక్కడ?

జగనన్నా.. డాక్టరెక్కడ?

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై మడమ తిప్పిన సర్కారు 

ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని ఆర్భాటం 

గ్రామాలకెళ్లి సేవలని ప్రకటన

హడావుడితోనే సరి.. 

గడువు వచ్చే సరికి వాయిదా

కొత్తగా 3,500 మంది వైద్యులు అవసరం

ఆర్థిక భారంతో వెనక్కి  

కాన్సెప్ట్‌కు తూట్లు.. 

పీహెచ్‌సీ వైద్యులతోనే సేవలు!


సీఎం జగన్‌ ప్రకటించిన ఆర్భాటపు పథకం అడ్రస్‌ లేకుండా పోయింది. సరికొత్త విప్లవాత్మక మార్పునకు అడుగులు వేస్తున్నామని వెనకడుగు వేశారు. ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామన్న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కొట్టుకుపోయింది. ఫ్యామిలీ డాక్టర్‌ పల్లెకు రావడం లేదు. ఎప్పటి నుంచి వస్తారో తెలియదు. అంతేగాక ఈ కాన్సెప్ట్‌ కూడా మారిపోయింది. జగన్‌ చెప్పిన స్థాయిలో వైద్య సేవలు అందుబాటులో ఉండవు. పీహెచ్‌సీలో ఉన్న వైద్యులతోనే మమ అనిపించనున్నారు. వెరసి.. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ఆరంభ శూరత్వంగా మిగిలిపోయింది. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

‘‘రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ అందుబాటులోకి వచ్చేస్తారు. ఐదు నుంచి ఏడు గ్రామాలకు ఒక డాక్టర్‌ అందుబాటులో ఉంటారు. గ్రామంలోని ప్రతి రోగి, ప్రతి గ్రామస్థుడి దగ్గరికి వెళ్తారు. వైద్య పరీక్షలు నిర్వహించి మందులిస్తారు. నెలకు ఒకసారి ఫ్యామిలీ డాక్టర్‌ గ్రామాల్లో పర్యటిస్తారు. ఏపీలోనూ యూకే మాదిరిగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సె్‌ప్టను అమలు చేస్తున్నాం. ఒక సరికొత్త విప్లవాత్మక మార్పు తీసుకువచ్చేందుకు అడుగులు వేస్తున్నాం’’ అంటూ ముఖ్యమంత్రి జగన్‌ గొప్పగా ప్రకటించారు. మారుమూల గ్రామాలకు డాక్టర్‌ వచ్చి సేవలందిస్తే మంచిదే కదాని..  ఫ్యామిలీ డాక్టర్‌ కోసం గ్రామీణులు ఎదురు చూశారు. ఆగస్టు 15 రానే వచ్చింది. కానీ ఫ్యామిలీ డాక్టర్‌ మాత్రం పల్లెకు రావడం లేదు. పంద్రాగస్టు సందర్భంగా అమలు చేయాల్సిన ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ వాయిదా పడింది. ఎప్పటి నుంచి అమలు చేస్తారన్నదానిపైనా స్పష్టత లేదు. జగన్‌ మాటిచ్చి ఇలా మడమ తిప్పడంపై గ్రామీణులు పెదవి విరుస్తున్నారు. 


వైద్యుల నియామకాల్లేవ్‌.. 

ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన మూడు నెలల నుంచే ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు చేస్తామని ఆర్భాటం చేశారు. మూడేళ్ల తర్వాత అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సె్‌ప్టపై చర్చలు జరుగుతున్న సమయంలో అంతా ప్లాన్‌ ప్రకారమే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. డబ్ల్యూహెచ్‌వో నిబంధనల ప్రకారం ప్రతి 1000 కుటుంబాలకు ఒక డాక్టర్‌ ఉండాలి. దీని ప్రకారం ప్రతి 4000 మంది నుంచి 4500 మంది జనాభాకు ఒక డాక్టర్‌ అందుబాటులో ఉండాలని ప్రభుత్వ వైద్య సంస్థలు సూచిస్తున్నాయి. డబ్ల్యూహెచ్‌వో నిబంధనల ప్రకారమే తొలుత ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రతి సబ్‌ సెంటర్‌ లేదా రెండు మూడు సబ్‌ సెంటర్లకు ఒక డాక్టర్‌ను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. గతంలో ఏడు వేలకు పైగా ఉన్న సబ్‌సెంటర్లను వైసీపీ ప్రభుత్వం 10,032కు పెంచి, వైఎ్‌సఆర్‌ విలేజ్‌ క్లినిక్స్‌గా మార్పు చేసింది. ప్రతి మూడు సబ్‌ సెంటర్లలో  ఒక డాక్టర్‌ను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న డాక్టర్లు కాకుండా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కోసం కొత్తగా 3500 మంది వైద్యులను నియమించాలి. ఈ స్థాయిలో వైద్యుల నియామకం చేపట్టడం వల్ల ఆర్థిక భారం పడుతుంది. ప్రతి నెలా జీతాల కోసం రూ.18.55 కోట్లు కేటాయించాలి. ఏడాదికి రూ.222.60 కోట్లు అవుతుంది. ప్రభుత్వం అదనపు ఆర్థిక భారం భరించలేక ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ మొత్తాన్ని మార్చేసింది. కొత్తగా వైద్యుల నియామకం చేపట్టడం కంటే పీహెచ్‌సీ వైద్యుల్ని వాడేసుకోవడం మంచిదని నిర్ణయించింది. ఈ సలహా ఇవ్వడం వెనుక ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ప్రమేయముంది. ఈ కాన్సె్‌ప్టపై ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో వ్యవహరిస్తోంది. ఒక ప్లాన్‌ లేదు. పద్ధతి లేదు. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ నిబంధనలు పాటించలేదు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ సూచనలు తీసుకోలేదు. గుడ్డిగా గాలిల్లో లెక్కలు వేసింది. పీహెచ్‌సీల్లో ఉన్న వైద్యులనే అటూ ఇటూ సర్దేసి.. ‘మాది కొత్త పథకం. దేశంలోనే సరికొత్త పథకం’ అంటూ కలరింగ్‌ ఇచ్చింది. పైగా దానికి ఆరోగ్యశాఖలో 20 రోజులు శిక్షణ పేరుతో హడావుడి చేశారు. లక్షల రూపాయిలు ఖర్చు చేశారు. చివరాఖరుకు పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్న వైద్యులనే ఫ్యామిలీ డాక్టర్లుగా మార్చేశారు. ఈ మాత్రం దానికి అంత హడావుడి ఎందుకని ప్రభుత్వ వైద్యులే నిట్టూరుస్తున్నారు.


ఫ్యామిలీ డాక్టర్‌ అంటే... 

ఫ్యామిలీ డాక్టర్‌ అంటే ప్రతి 1000 కుటుంబాలకు ఒక డాక్టర్‌ కచ్చితంగా ఉండాలి. 

వెయ్యి కుటుంబాల్లో ప్రతి వ్యక్తికి సంబంధించి ఆరోగ్య డేటా సదరు వైద్యుడి వద్ద అందుబాటులో ఉండాలి. 

అత్యవసరమైతే డాక్టర్‌ రోగి ఇంటికి వెళ్లాలి. లేదంటే రోగిని తన వద్దకు రప్పించుకునేంత దగ్గరగా ఉండాలి. 

వైద్యులు నిత్యం ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉండాలి. 

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు చేయాలంటే ఈ స్థాయిలో పక్కా ప్లాన్‌తో ఉండాలి.


ప్రభుత్వం చేసేది ఏంటంటే.. 

ఒక పీహెచ్‌సీ పరిధిలో 20 గ్రామాలుంటే.. 10 గ్రామాలకు ఒక డాక్టర్‌ను కేటాయించారు. 

పీహెచ్‌సీలోని ఇద్దరు డాక్టర్లలో రోజూ ఒకరు ఉదయం 9 గంటలకు 104 వాహనంతో గ్రామానికి వెళ్తారు. రోగులకు బీపీ, షుగర్‌ టెస్టు చేసి, మందులు ఇస్తారు.

మరో డాక్టర్‌ పీహెచ్‌సీలోనే ఉండి  రోగులకు ఓపీ చూడాలి.

ఆ తర్వాతి రోజు ఆ డాక్టర్‌ గ్రామంలోకి వెళ్లి రోగులను పరీక్షించి రావాలి. ముందురోజు గ్రామంలోకి వెళ్లిన డాక్టర్‌ పీహెచ్‌సీలో రోగులకు ఓపీ చూస్తారు. 

104 వాహనాలు చేస్తున్న పనినే వైద్యులకు అప్పగించారు.

దీన్ని ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అని ఎలా అంటారో అర్థం కావడం లేదని వైద్య నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Read more