జీపుల్లేవ్‌ జగనన్నా!

ABN , First Publish Date - 2022-07-05T08:24:46+05:30 IST

‘మీ ఫోన్లో దిశ యాప్‌ ఉంటే చాలు.. మీకు ఆపద వచ్చినప్పుడు మొబైల్‌ షేక్‌ చేస్తే చాలు.. నిమిషాల్లోనే పోలీసులు వచ్చి మిమ్మల్ని రక్షిస్తారు’... రాష్ట్రంలోని మహిళలు, యువతులకు..

జీపుల్లేవ్‌ జగనన్నా!

135 పోలీస్‌స్టేషన్లలో వాహనతిప్పలు

దేశంలోనే అత్యధికంగా ఏపీలోనే కొరత

జిల్లాలు పెరగడంతో అవసరాలు రెట్టింపు

కానీ, ఆ స్థాయిలో కనిపించని ప్రాధాన్యం

రక్షణ పరికరాలూ లేవంటున్న పోలీసులు

నేరాల కట్టడికి సొంత బైకులపై ప్రయాణం

కేంద్ర హోంశాఖ హెచ్చరించినా పట్టని వైనం


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘మీ ఫోన్లో దిశ యాప్‌ ఉంటే చాలు.. మీకు ఆపద వచ్చినప్పుడు మొబైల్‌ షేక్‌ చేస్తే చాలు.. నిమిషాల్లోనే పోలీసులు వచ్చి మిమ్మల్ని రక్షిస్తారు’... రాష్ట్రంలోని మహిళలు, యువతులకు ముఖ్యమంత్రి జగన్‌ పదే పదే ఇచ్చే భరోసా ఇది. ‘మా పోలీస్‌ స్టేషన్‌కు జీపు లేదు.. ఏదైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే మెన్‌తో వెళ్లడానికి సొంత బైకులే గతి’...ఇదీ ఏపీలోని పలు పోలీసు స్టేషన్లలో ఎస్‌హెచ్‌వోలు వ్యక్తం చేస్తోన్న ఆవేదన. మాట తప్పను.. మడమ తిప్పను అనే జగన్‌... తన పాలనలో పోలీసులకు వాహనాలు ఇవ్వను.. రక్షణ పరికరాలు సరఫరా చేయను.. అంటే కచ్చితంగా సరిపోతోందనే వ్యాఖ్యలు పోలీసు శాఖలోనే వినిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు కోట్ల మంది ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడేందుకు 1,021పోలీస్‌ స్టేషన్లున్నాయి. వాటిలో పనిచేసే సిబ్బంది గస్తీ తిరుగుతూ తమ పరిధిలోని సంఘ విద్రోహ శక్తులను కట్టడి చేస్తూ శాంతి భద్రతలు పరిరక్షిస్తుంటారు. ఇందులో ప్రధాన భూమిక పోషించేది పోలీసు వాహనాలు. నేరాలు చేయాలనుకునే వారు సైతం పోలీస్‌ జీపు వస్తోందన్న అలికిడి వినపడగానే ఆ ప్రయత్నం విరమించుకుని పారిపోతారు. ఇంత కీలమైన వాహనాలు పోలీసు స్టేషన్‌లో లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 135 పోలీసు స్టేషన్లకు జీపులు లేవు. కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌హెచ్‌వో వరకూ సొంత వాహనాల్లోనే తిరగాల్సి వస్తోంది. 

ఇక్కడే అన్నీ ఇక్కట్లు..

దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే ఏపీలోనే అత్యధికంగా పోలీసుస్టేషన్లలో వాహనాల కొరత ఉన్నట్లు కేంద్ర హోంశాఖ ఇటీవలే రాష్ట్ర పోలీసుశాఖను హెచ్చరించింది. బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ (బీపీఆర్‌ అండ్‌ డీ) నివేదిక ఆధారంగా కేంద్రం ఈ హెచ్చరికలు చేసినట్టు తెలిసింది. వాహనాలు వీలైనంత త్వరలో సమకూర్చకపోతే కేంద్ర హోంశాఖ అందించే పోలీసు అభివృద్ధి నిధుల్లో కోత విధిస్తామని కూడా వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. అయినా జగన్‌ ప్రభుత్వం కొత్త వాహనాల కొనుగోలుకు ఏ మాత్రం ఆసక్తి చూపలేదని, పోలీసులకు రక్షణ పరికరాలు కొనుగోలు చేసుకోవడానికి కూడా నిధులు విడుదల చేయడంలేదని అధికార వర్గాలు వాపోతున్నాయి. ఈ పరిస్థితిపై ఒక సీనియర్‌ అధికారి స్పందించారు. ‘‘ముంబైలో 26/11 దాడుల్లో హెల్మెట్‌ సరిగా లేక ఒక ఐపీఎస్‌ అధికారిని దేశం కోల్పోయింది. ఇటీవల కోనసీమలో నిరసనకారుల రాళ్లదాడిలో జిల్లా ఎస్పీ తల పగిలి రక్తం కారింది. రక్షణ పరికరాలు తగినన్ని ఉంటే అలా జరిగేదా.?’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 13కు మరో 13కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అంతకు ముందు 18గా ఉన్న పోలీసు యూనిట్లు 26కు చేరాయి. కానీ ఒక్క కొత్త జిల్లాలోనూ పూర్తిస్థాయిలో మౌళిక సదుపాయాలు లేవు. వాహనాలు, సిబ్బందే కాదు.. రక్షణ పరికరాల కొరత కూడా ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. మావోయిస్టుల ప్రభావం ఉండే అల్లూరి సీతారామరాజు జిల్లా అయినా సీఎం సొంత జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా అయినా పోలీసు దుస్థితి చూస్తే మన కన్నా యూపీ, బిహార్‌ లాంటి రాష్ట్రాలే నయం అనిపించేలా పరిస్థితి ఉందని పోలీసు వర్గాలే వాపోతున్నాయి. 


సిబ్బందికి వాహనాలు వీలైనంత త్వరగా సమకూర్చకపోతే తాము అందించే పోలీసు అభివృద్ధి నిధుల్లో కోత విధిస్తామని కేంద్ర హోంశాఖ వార్నింగ్‌ ఇచ్చింది. అయినా జగన్‌ ప్రభుత్వం కొత్త వాహనాల కొనుగోలుకు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. రక్షణ పరికరాలు సమకూర్చుకోవడానికి నిధులు కూడా విడుదల చేయడంలేదు. తమను తిప్పలు పెడుతున్న జగన్‌ సర్కారు తీరుపై పోలీసు వర్గాలే విస్తుపోతున్నాయి. 


పోలీ్‌సస్టేషన్లలో 25శాతమే’

రాష్ట్ర పోలీసు శాఖ వద్ద ప్రస్తుతం అన్ని రకాల వాహానాలు కలిపి 9,681ఉండగా, అందులో 2,641మాత్రమే పోలీసు స్టేషన్లలో ఉన్నాయి. హెవీ డ్యూటీ వాహనాలు, కార్లు, జీపులు, బైకులు, యాంటీ రాయిట్‌ వాహనాలు, బుల్లెట్‌ ప్రూఫ్‌, మైన్‌ ప్రొటెక్టెడ్‌ వెహికల్స్‌ ఉన్నాయి. వాటిలో 1477 బైకులు, 1146 లైట్‌ డ్యూటీ వాహనాలు. ఇతర వాహనాలు పోలీసు స్టేషన్లతో సంబంధం లేకుండా పోలీసు శాఖ వద్ద ఉన్నాయి. డిపార్ట్‌మెంట్‌ లెక్కల ప్రకారం కార్లు, జీపులు ఇతర నాలుగు చక్రాల వాహనాలు కలిపి 4,178ఉండగా, బైకులు, ఇతర లైట్‌ డ్యూటీ వెహికల్స్‌ 4,484ఉన్నాయి. అయితే పోలీసు స్టేషన్లకు కేటాయించిన వాహనాల్లో నాలుగు చక్రాల బండ్లు 25శాతం కాగా, ద్విచక్ర వాహనాలు 35శాతం మాత్రమే. ఇక... రాష్ట్ర పోలీసు శాఖ పరిధిలోని వాహనాల్లో హెవీ డ్యూటీ 56, మీడియం డ్యూటీ 506, లైట్‌ డ్యూటీ 4,484, బైకులు 4178, పడవలు 457, పీసీఆర్‌ వాహనాలు ఏడు, మైనింగ్‌ ప్రొటెక్ట్‌ వాహనాలు ఏడు, బుల్లెట్‌ ప్రూఫ్‌ వెహికిల్స్‌ 107, అల్లర్లు నిరోధించే వజ్ర వాహనాలు29, నీటి ఫిరంగులు రెండు ఉన్నాయి. 

Updated Date - 2022-07-05T08:24:46+05:30 IST