జగనన్నా.. జెండాలేవీ?

ABN , First Publish Date - 2022-08-14T08:03:51+05:30 IST

జగనన్నా.. జెండాలేవీ?

జగనన్నా.. జెండాలేవీ?

1.62 కోట్ల పతాకాలు ఇస్తున్నట్టు ఆర్భాటం

సాక్షాత్తు కేంద్ర హోం మంత్రికే చెప్పిన సీఎం

గత నెలలో పంద్రాగస్టుపై వీడియో కాన్ఫరెన్స్‌ 

సగం కూడా పంపిణీ చేయలేదని విమర్శలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా 1.62 కోట్ల జాతీయ జెండాలు పంపిణీ చేస్తాం’.. ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌  షాకు సీఎం జగన్‌ చెప్పిన మాట ఇది. పంద్రాగస్టు వేడుక వచ్చేస్తోంది. అయితే జగన్‌ చెప్పిన స్థాయిలో జెండాలు పంపిణీ చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం చెప్పిన దాంట్లో సగం కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. రాష్ట్రంలో 65 లక్షల జెండాలు కూడా ఎగరేయలేని పరిస్థితి ఉందని సమాచారం. గ్రామ, వార్డు సచివాలయాలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు మినహా చాలా చోట్ల జెండాలు కనిపించడం లేదని చెబుతున్నారు. ప్రజల ఇళ్లపై జెండాలు ఎగరడం లేదని అంటున్నారు. 


జగన్‌ ఏం చెప్పారు..? 

ఆగస్టు 15నాటికి ప్రతిఇంటిపైనా మూడు రంగుల జెండా ఎగరేసేలా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమాయత్తం చేసింది. గత నెలలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్‌ షా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆర్భాటంగా జెండా పండుగ నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా జగన్‌ చెప్పారు. ప్రజల్లో దేశభక్తి పెంపొందించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటిపైనా, పరిశ్రమలు, సంస్థలు, వాణిజ్య సముదాయాలు, షాపులపై జెండాలు ఎగరేస్తామని చెప్పారు. 5.2 లక్షల రేషన్‌ షాపులు, 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు, 1.20 లక్షల అంగన్వాడీ, ఆశా వర్కర్ల నివాసాలు, 1.20 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇళ్లు, 2.60 లక్షల గ్రామ, వార్డు వలంటీర్ల ఇళ్లపై జెండాలు ఎగరవేయనున్నట్లు సీఎం గొప్పగా చెప్పారు. మొత్తం 1.62కోట్ల జెండాలు పంపిణీ చేస్తామన్నారు. జెండా పండుగ నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా చెప్పారు. 


వాస్తవం ఏంటంటే... జగన్‌ చెప్పినట్టుగా రాష్ట్రంలో అలాంటి వాతావరణం కనపడటం లేదు. జెండాలు కావాలనుకున్న వారికి ఎక్కడ దొరుకుతాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ కార్యాలయాలకు, గ్రామ, వార్డు సచివాలయాలకు జెండాలు పంపిణీ చేసి ఎగరేయాలని ఆదేశాలిచ్చింది. పింఛన్లు పొందుతున్న వారి కుటుంబాలకు సచివాలయాల్లో వలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. చేయూత పెన్షన్‌ పొందుతున్న కుటుంబాలకు పట్టణాల్లో పొదుపు గ్రూపు సీఆర్‌పీలు పంపిణీ చేస్తున్నారు. మిగిలిన వారికి జెండాలు అందడంలేదు. మొత్తంగా 65 లక్షల లోపు జెండాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ సర్కారు చెప్పే మాటలకు చేసే పనులకు చాలా విషయాల్లో పొంతన ఉండటం లేదు. అదే రీతిలో జెండాల పంపిణీ కూడా ఆర్భాట ప్రకటనలకే పరిమితమైందని చెబుతున్నారు. 

Updated Date - 2022-08-14T08:03:51+05:30 IST