ఇంద్రకీలాద్రికి జగన్.. సీఎం డౌన్ డౌన్ అంటూ భక్తుల నినాదాలు

ABN , First Publish Date - 2022-10-03T00:05:37+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ వస్తున్నారంటే... దైవ దర్శనాలూ ఆగిపోతాయి. ఇంద్రకీలాద్రిలో ఇదే జరిగింది...

ఇంద్రకీలాద్రికి జగన్.. సీఎం డౌన్ డౌన్ అంటూ భక్తుల నినాదాలు

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్‌ వస్తున్నారంటే... దైవ దర్శనాలూ ఆగిపోతాయి. ఇంద్రకీలాద్రిలో ఇదే జరిగింది. ఇక్కడ కూడా సీఎం రాకతో దుర్గగుడి దగ్గర భక్తుల ఇక్కట్లు తప్పులేదు. ఆయన వచ్చి వెళ్లేవరకూ దర్శనాలు నిలిపారు. దుర్గమ్మ దర్శనం కోసం గంటల తరబడి భక్తుల పడిగాపులు కాశారు. ఉదయం నుంచి క్యూలైన్లలో ఉన్నామంటూ భక్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గగుడి అధికారుల తీరుపై భక్తుల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘సీఎం జగన్‌ డౌన్ డౌన్’ అంటూ భక్తుల నినాదాలు చేశారు. 


జగన్‌ ఇటీవల తిరుపతి పర్యటనలో భాగంగా సాయంత్రం 6.10 గంటలకు తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి వచ్చారు. ఈ ఆలయంలో ఆయన గడిపింది 20 నిమిషాలే. కానీ... దీనికోసం ఉదయం నుంచే ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. గుడి పరిసరాల్లో దుకాణాలన్నీ ఉదయం నుంచే మూయించేశారు. శరన్నవరాత్రులకు వ్యాపారం జోరుగా ఉండే ఈ సమయంలో రోజంతా మూసివేతతతో దుకాణదారులు నష్టపోయారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులూ నిరాశగా వెనుదిరిగారు.


ముఖ్యమంత్రి ఒక సందర్భంలో విశాఖ వెళ్లినప్పుడు దాదాపు గంటన్నరపాటు జనానికి చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ఫ్లైట్‌ మిస్‌ అవుతుందనే భయంతో... లగేజీ తీసుకుని కిలోమీటరు దూరం నడుచుకుంటూ వెళ్లారు. అప్పుట్లో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే ముఖ్యమంత్రి పర్యటనకు ఆటంకం కలిగిస్తారనే అనుమానం ఉంటే... పార్టీలు, ప్రజా సంఘాల నేతలను గృహ నిర్బంధంలో ఉంచడం సహజం. ఆయనొచ్చారంటే ఊరంతా బంద్‌. జనం ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు వీలుండదు. రోడ్లపై అడ్డంగా బారికేడ్లు. ఇళ్లు, దుకాణాల ముందు డేరాలు. చివరికి ఆలయాలూ మూసివేయాల్సిందే. ఎమ్మెల్యేలను గడపగడపకూ వెళ్లాలని ఆదేశించిన జగనన్న తాను మాత్రం గడప గడపకు వెళ్లరు. ఆయన గడప దాటారంటే మాత్రం జనం గడప బయటికి వచ్చే పరిస్థితి ఉండదని ప్రజలు వాపోతున్నారు.

Read more