అబద్ధాల ‘కుప్ప’లు

ABN , First Publish Date - 2022-09-24T08:48:47+05:30 IST

అబద్ధాల ‘కుప్ప’లు

అబద్ధాల ‘కుప్ప’లు

కుప్పం సభలో కొనసాగిన ‘సీరియల్‌’

పథకాలపై సీఎం జగన్‌ నోట అర్ధసత్యాలు.. పెన్షన్‌ మొత్తం పెంపుదలపై గొప్పలు

‘చేయూత’పై పొంతన లేని మాటలు.. పేదలకు ఇళ్ల నిర్మాణంపైనా కోతలు 

21 లక్షల ఇళ్లు కడుతున్నామని కలరింగ్‌

ఇప్పటి వరకు నిర్మించింది 90 వేలే 

స్వయం ఉపాధి యూనిట్లపై కథలు 

4.50 లక్షల మంది లబ్ధిపొందారని వ్యాఖ్య 

18,750తో ఎలా సాధ్యమంటున్న మహిళలు

‘అక్క చెల్లెమ్మ’లకూ తప్పుడు లెక్కలే

ఇచ్చేది రూపాయి... చెప్పుకొనేది మూడింతలు

మూడేళ్లలో రాష్ట్రానికి వచ్చిందే 5.18 లక్షల కోట్లు

ఇందులో మహిళలకే 3.12 లక్షల కోట్లు ఇచ్చేశారట

మరి... జీతభత్యాలు, ఇతర ఖర్చుల మాటేమిటి?


‘అక్క చెల్లెమ్మలు, అమ్మలు, అవ్వలు’అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తప్పుడు లెక్కల చిట్టా విప్పుతున్నారు. లక్షల కోట్లు ఇచ్చేశామంటూ అంకెల గారడీ చేస్తున్నారు. వేదిక ఏదైనా... ఇదే వరస! తాజాగా... కుప్పం సభలోనూ మాయ!


 ‘39 నెలల్లో చేయూత ద్వారా మహిళలకు (నగదు బదిలీ)  రూ.1,17,666 కోట్లు ఇచ్చాం. అదేవిధంగా మూడేళ్లలో (డీబీటీ, నాన్‌ డీబీటీ) రూ.3,12,764 కోట్లు ఖర్చు చేశాం’.. జగన్‌ చెప్పిన మాట ఇది. 

 రాష్ట్ర బడ్జెట్‌ సుమారు రూ.2 లక్షల కోట్లు. జీతాలు, పెన్షన్లు పోతే మిగిలేది దాదాపు సగం మాత్రమే. ఈ లెక్కన మహిళా సంక్షేమానికే ఇంత మొత్తం ఖర్చు చేయడం ఎలా సాధ్యం..? చెల్లించాల్సిన అప్పులు, వడ్డీలు, మిగిలిన పథకాల సంగతేమిటి? 

 అధికారంలోకి రాగానే అవ్వాతాతలకు 3 వేలు పెన్షన్‌ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. తర్వాత ఏటా 250 పెంచుతామన్నారు. అయితే, ఇప్పుడు ఇస్తోంది 2500 మాత్రమే. వచ్చే జనవరికి 2750కు పెంచుతున్నట్లు జగన్‌ ప్రకటించారు. 

 పేదల కోసం 21 లక్షల ఇళ్లు కడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. వాస్తవానికి రాష్ట్రంలో ఇప్పటి వరకు 90 వేల ఇళ్లు మాత్రమే నిర్మించారు. 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

జగన్‌ మూడున్నరేళ్ల పాలన గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే... అంతులేని అప్పులు, అలవికాని అబద్ధాలు! కాగ్‌, కోర్టులు, ఏజీ కార్యాలయం, ఎన్నికల కమిషన్‌, అసెంబ్లీ, బహిరంగ సభలు... ఇలా వేదికే మారుతోంది. అబద్ధాల సీరియల్‌ మాత్రం యథేచ్ఛగా కొనసాగుతోంది. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పం ఇందుకు వేదికైంది. తాను చెప్పేవన్నీ జనం నమ్ముతారనో... అబద్ధాలని నిలదీయరనేమో కానీ ముఖ్యమంత్రి జగన్‌ ఏ మాత్రం వెరవకుండా పదే పదే అబద్ధాలు, అర్థ సత్యాలు చెప్పారు. సామాజిక పింఛన్లు, చేయూత, పేదలకు ఇళ్లు, స్వయం ఉపాధి యూనిట్ల గురించి లేనిపోని గొప్పలు చెప్పారు. శుక్రవారం కుప్పంలో జరిగిన చేయూత మూడో విడత బటన్‌ నొక్కుడు కార్యక్రమంలో సీఎం జగన్‌ ప్రసంగం ఆద్యంతం ఇదే రీతిలో సాగింది. 


పెన్షన్లపై సా...గదీత

మేనిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్లు రూ.3 వేలకు తీసుకెళ్తున్నామని, వచ్చే జనవరి నుంచి రూ.2750కు పెంచుతున్నట్లు కుప్పం సభలో జగన్‌ ప్రకటించారు. పెన్షన్ల పెంపుపై మూడేళ్లుగా అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. అధికారంలోకి వస్తే రూ.3 వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అంటే.. ఒకేసారి 3 వేలు ఇస్తారని అందరూ భావించారు. అయితే అధికారంలోకి రాగానే జగన్‌ మాట మార్చి ఏటా రూ.250 చొప్పున పెంచుకుంటూ పోతామని మెలిక పెట్టారు. మొదటి ఏడాది 2 వేలు నుంచి రూ.2,250కు పెంచారు. తర్వాత రెండేళ్ల పాటు ఆ విషయమే పట్టించుకోలేదు. అనేక విమర్శలు రావడంతో ఈ ఏడాది జనవరిలో మరో రూ.250 పెంచారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారమైతే ఈపాటికి ఎప్పుడో ప్రతి లబ్ధిదారుడికీ రూ.3 వేల పెన్షన్‌ పంపిణీ చేయాలి. ఒకవేళ అధికారంలోకి వచ్చాక చెప్పినట్టు ఏటా 250 పెంచినా వచ్చే జనవరికి పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచాల్సి ఉంది. అయితే క్రమేణా రూ.3 వేలు చేస్తామని, వచ్చే జనవరిలో రూ.2750కు పెంచుతామని బహిరంగ సభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. పెన్షన్లపై ఇన్ని అబద్ధాలు చెప్పిన సీఎం మరెవరూ ఉండరని పలువురు విమర్శిస్తున్నారు.


జగనన్న కాలనీలపై కహానీ 

చేయూత ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఇచ్చే సాయంపైనా సీఎం జగన్‌ గొప్పలు చెప్పారు. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా, పరోక్షంగా (నాన్‌ డీబీటీ) ఏకంగా సాయం లక్షల కోట్లలో చేసినట్టు చెప్పారు. నాన్‌ డీబీటీ కింద మహిళలకు భారీగా లబ్ధి చేకూర్చామని ప్రకటించారు. 31 లక్షల మంది అక్కాచెల్లెళ్లకు ఇంటి స్థలాలు ఇచ్చామని, 21 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ ఇళ్లకు సంబంధించి ఒక్కో మహిళకు రూ.7-10 లక్షల దాకా లబ్ధి చేకూరనుందని చెప్పుకొచ్చారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరిట జగనన్న ఇళ్ల కాలనీలు ప్రారంభించిన ప్రభుత్వం 10 శాతం మందికి కూడా ఉపయోగపడే ఇంటి స్థలాలు ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తప్ప మిగతా చోట్ల గ్రామాలకు దూరంగా కొండలు, కోనలు, శ్మశానాల్లో ప్లాట్లు ఇచ్చారు. ఇచ్చిన ఇంటి పట్టాలు బీరువాల్లో దాచుకునేందుకు మాత్రమే పనికొస్తున్నాయి. 21 లక్షల ఇళ్లు కడుతున్నామని జగన్‌ మరో అబద్ధం చెప్పారు. అయితే, రాష్ట్రంలో ఇప్పటి వరకు 90 వేల ఇళ్లు మాత్రమే నిర్మించారు. అనువైన స్థలం కాకపోవడం, ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలు చాలకపోవడంతో చాలామంది ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు.


‘ఆసరా’ పేరుతో వంచన...

‘ఆసరా’తో డ్వాక్రా మహిళలను ఉద్ధరిస్తున్నామని వైసీపీ గొప్పగా  చెప్పుకొంటోంది. కానీ... చంద్రబాబు హయాంలో జరిగిన లబ్ధితో పోల్చితే ఇప్పుడు వారికి నష్టమే జరుగుతోంది. అప్పట్లో కోటీ ఐదు లక్షల మంది ఉన్న డ్వాక్రా మహిళలందరికీ రెండు విడతల్లో రూ.20 వేలు ఇచ్చారు. ఇప్పుడు జరుగుతున్నది వేరు. 2019 ఏప్రిల్‌ 1వ తేదీ వరకు రుణాలు తీసుకున్న వారికి మాత్రమే ‘ఆసరా’ వర్తిస్తుంది. రుణం తీసుకోని డ్వాక్రా మహిళలకు పైసా కూడా అందదు. 


మహిళలకు పట్టం కట్టిందెవరు?

ఇల్లు, ఇంటి స్థలాలను మహిళల పేరిట ఇప్పుడే కొత్తగా ఇస్తున్నట్లు వైసీపీ సర్కారు చెబుతోంది. నిజానికి... 1990ల్లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం మహిళల పేరుతో ఇళ్ల పట్టాలిచ్చింది. మహిళా సాధికారతే లక్ష్యంగా డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసింది. గ్యాస్‌ సిలిండర్లను కూడా వారి పేరిటే కేటాయించింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. కానీ, ఇప్పుడు సీఎం జగన్‌ మాత్రం ఇవన్నీ తామే మొదలుపెట్టినట్టు, మహిళలకు తామే ఇళ్ల పట్టాలిచ్చినట్టు, తామే డ్వాక్రా మహిళలకు డబ్బులిస్తున్నట్టు గొప్పలు చెప్పుకోవడం గమనార్హం.


స్వయం ఉపాధి యూనిట్లు ఎక్కడ? 

చేయూత పథకం ద్వారా మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించారని సీఎం తన ప్రసంగంలో పేర్కొన్నారు. 1.10 లక్షల మంది మహిళలు కిరాణా షాపులు, 60,995 మంది వస్త్ర వ్యాపారం ప్రారంభించారని, 2.96 లక్షల మంది మహిళలు ఆవులు, గేదెలు, మేకలు కొనుగోలు చేశారని చెప్పడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. వాస్తవాలను పరిశీలిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలు ఇతర పథకాలు పొందకుంటే వారికి చేయూత పథకం కింద డీబీటీ ద్వారా రూ.18,750 ఇస్తున్న మాట ఒక్కటే నిజం. అయితే, ఏడాదికి రూ.18,750తో పైన పేర్కొన్న ఏ యూనిట్‌ కూడా కొనుగోలు చేయగలిగే పరిస్థితి లేదు. పైగా రుణాల ద్వారా ఈ యూనిట్లు కొనుగోలు చేశామని చెబుతున్నారు. పొదుపు గ్రూపులకు రుణాలివ్వడం, వారు తిరిగి చెల్లించడం  రెండు దశాబ్దాల నుంచి జరుగుతున్న ప్రక్రియ. కొత్తగా డ్వాక్రా గ్రూపులకు రుణాలిప్పించేందుకు ప్రభుత్వాలు సిఫారసులు చేయాల్సిన పరిస్థితి లేదు. చేయూత డబ్బులతో పాటు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వారికి స్వయం ఉపాధి యూనిట్లు కల్పిస్తున్నామని అభూత కల్పనలు ప్రచారం చేస్తున్నారు. అధికారులు, బ్యాంకర్ల సహాయంతో యూనిట్లు ఏర్పాటు చేశామని బోర్డులు పెట్టడం, బ్యాంకులు రుణాలివ్వకపోయినా ఇచ్చినట్లు చెప్పుకొంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటోంది. జగనన్న తోడు పథకం కూడా ఇదే విధంగా ఉంది. రాష్ట్రంలో కొత్త స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేశారన్న విషయం అబద్ధమని గ్రామాల్లో ఏ మహిళను అడిగినా చెబుతారు. 


ఇచ్చింది ఎంత... చేప్పేది ఎంత?

ఈ మూడేళ్లలో  ప్రభుత్వానికి అప్పులు, ఇతర అన్ని మార్గాల్లో కలిపి అందిన నిధులు సుమారు రూ.5.18లక్షల కోట్లు. ఇందులో మహిళలకే డీబీటీ, నాన్‌ డీబీటీ కింద రూ.3.12 లక్షల కోట్లు పంచానని సీఎం చెబుతున్నారు. అంటే... మిగిలింది రూ.2.06 లక్షల కోట్లు. ఇందులో ఏటా సగటున అప్పుల అసలు, వడ్డీ కింద ఏడాదికి రూ.50,000 కోట్లు! ఆరు నూరైనా, తలకిందులుగా తపస్సు చేసైనా ఈ మొత్తం కట్టాల్సిందే. అంటే మూడేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఈ పద్దు కింద కట్టారు. ఇక మిగిలింది రూ.56,000 కోట్లు. ఉద్యోగుల జీత భత్యాలు, రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లు, గొప్పగా చెప్పుకొనే ఇతర పథకాలు, ఎంతోకొంతైనా చేయక తప్పని బిల్లుల చెల్లింపులు.. వీటి మాటేమిటి? మూడేళ్లలో రూ.56వేల కోట్లతోనే ఇవన్నీ చేసేశారా? కచ్చితంగా చేయలేదు, చేయలేరు కూడా! అంటే... డీబీటీ, నాన్‌-డీబీటీ కింద మహిళలకే రూ.3.12 లక్షల కోట్లు పంచిపెట్టానన్న జగన్‌ మాటలు అంకెల గారడీ తప్ప... నిజం కానేకాదు. మహిళలకు ఇచ్చామంటున్న నిధులనే... కులాల వారీగా విభజించి, మళ్లీ అదనంగా కార్పొరేషన్‌ ఖర్చు కింద కూడా చూపిస్తారు. ఒక్కరూపాయి ఇచ్చి... మూడు రూపాయలుగా లెక్కేస్తారు. 


బడ్జెట్‌ బుక్కుల సాక్షిగా... 

జగన్‌ లెక్కల ప్రకారం.. మూడేళ్ల బడ్జెట్‌ మొత్తం మహిళలకే పంచేసినట్లు! కానీ బడ్జెట్‌లో చూస్తే నవరత్నాల కింద మొదటి మూడేళ్లు... ఏటా సగటున రూ.40వేల కోట్లు కేటాయించారు. ఈ సంవత్సరం రూ.48వేల కోట్లు కేటాయించారు. అంటే ఈ మొత్తం రూ.1.68 లక్షల కోట్లు. ఈ మూడేళ్లలో పంచిన సామాజిక పెన్షన్ల మొత్తాన్ని తీసేస్తే... మిగిలేది రూ.1,03,000 కోట్లు. (సామాజిక పెన్షన్లు డీబీటీ కిందకు రావు. ఒకవేళ కలిపినా మొత్తం రూ.1.60 లక్షల కోట్లు అవుతుంది.) ఈ మూడున్నరేళ్లలో డీబీటీ ద్వారా మహిళలతోపాటు పురుషులు, విద్యార్థులకు ఇచ్చిన మొత్తం ఇది. బడ్జెట్లో ప్రభుత్వం స్వయంగా రాసి అసెంబ్లీలో పెట్టి ఆమోదం తీసుకున్న గణాంకాలు ఇవి. అయినా సరే... ముఖ్యమంత్రి తనకు నచ్చిన అంకెలను వేదికలపై చెప్పేశారు. మహిళలకే రూ.3.12 లక్షల కోట్లు పంచినట్లు చెప్పడం గమనార్హం.

Read more