వచ్చాడంటే కష్టాలంతే!

ABN , First Publish Date - 2022-09-28T08:01:33+05:30 IST

ఓ తెలుగు సినిమాలో సీఎం హెలికాప్టర్‌లో వెళ్తుంటే.. కింద రోడ్డుపై వాహనాలను ఆపేసిన దృశ్యంతో ప్రేక్షకులకు కితకితలు పెట్టారు. విజయవాడలో పోలీసులు దాదాపుగా అదే పని చేస్తున్నారు.

వచ్చాడంటే కష్టాలంతే!

జగన్‌ పర్యటనలతో జనం బెంబేలు

వీధులకు వీధులు ‘గృహ నిర్బంధం’

ఒకరోజు ముందు నుంచే ఆంక్షలు

రోడ్లపై బారికేడ్లు.. ఇళ్ల ముందు డేరాలు

దుకాణాలు, ఆలయాలూ మూసివేత

అధికార దర్పంతో సామాన్యులకు ఇక్కట్లు

పాదయాత్ర సమయంలో ముద్దులే ముద్దులు

అధికారమెక్కాక గిట్టని పేదల ముఖం


ఓ తెలుగు సినిమాలో సీఎం హెలికాప్టర్‌లో వెళ్తుంటే.. కింద రోడ్డుపై వాహనాలను ఆపేసిన దృశ్యంతో ప్రేక్షకులకు కితకితలు పెట్టారు. విజయవాడలో పోలీసులు దాదాపుగా అదే పని చేస్తున్నారు. రామవరప్పాడు రింగ్‌ మీదుగా సీఎం కాన్వాయ్‌ వెళితే.... అక్కడికి మూడు కిలోమీటర్ల అవతల ఉన్న రింగ్‌ రోడ్డుపై వాహనాలను ఆపేస్తారు. మధ్యలో రెండు ఫ్లైఓవర్లు ఉన్నా, ఒకవైపు నుంచి వాహనాలను పంపే అవకాశమున్నా వదలనే వదలరు.


ముఖ్యమంత్రి ఒక సందర్భంలో విశాఖ వెళ్లినప్పుడు దాదాపు గంటన్నరపాటు జనానికి చుక్కలు చూపించారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ఫ్లైట్‌ మిస్‌ అవుతుందనే భయంతో... లగేజీ తీసుకుని కిలోమీటరు దూరం నడుచుకుంటూ వెళ్లారు.

ముఖ్యమంత్రి పర్యటనకు ఆటంకం కలిగిస్తారనే అనుమానం ఉంటే... పార్టీలు, ప్రజా సంఘాల నేతలను గృహ నిర్బంధంలో ఉంచడం సహజం! కానీ... జగన్‌ పర్యటన ఉందంటే ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ గృహ నిర్బంధమే!


ఆయనొచ్చారంటే ఊరంతా బంద్‌. జనం ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు వీలుండదు. రోడ్లపై అడ్డంగా బారికేడ్లు. ఇళ్లు, దుకాణాల ముందు డేరాలు. చివరికి ఆలయాలూ మూసివేయాల్సిందే. ఎమ్మెల్యేలను గడపగడపకూ వెళ్లాలని ఆదేశించిన జగనన్న తాను మాత్రం గడప గడపకు వెళ్లరు. ఆయన గడప దాటారంటే మాత్రం జనం గడప బయటికి వచ్చే పరిస్థితి ఉండదు.  


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అనేక మంది మహామహా నాయకులు ముఖ్యమంత్రులుగా పని చేశారు. వారూ జిల్లాల్లో పర్యటించారు. వారు వచ్చే మార్గంలో బందోబస్తు, కాన్వాయ్‌ వెళ్లే సమయంలో కొద్దిసేపు వాహనాలు ఆపడం సహజం. జగన్‌ సీఎం అయ్యాక మొత్తం సీన్‌ మారిపోయింది. ఆయన అడుగు బయటపెట్టారంటే... ఇంకెవరూ గడప దాటకూడదు. ఆయన వెళ్లే దారి పొడవునా బారికేడ్లు కట్టేస్తారు. డేరాలు పెట్టేస్తారు. రాజులు, చక్రవర్తులకు సామాన్యులు కంటపడకూడదు... అన్నట్లుగా అందరినీ ‘బందీ’లను చేసేస్తారు.


చివరికి... జగన్‌ సొంత నియోజకవర్గం, ఆయన అడ్డా పులివెందులకు వెళ్లినా ఇదే పరిస్థితి. సీఎం పర్యటనకు రెండు రోజుల ముందు నుంచే పోలీసు ఆంక్షలు మొదలవుతాయి. పర్యటించే ప్రాంతమంతా 144వ సెక్షన్‌ విధిస్తారు. నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలు, సూపర్‌ బజార్లు కూడా మూసివేయిస్తున్నారు. సీఎం వెళ్లే దారంతా పోలీసులు డేరాలతో కప్పేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే గుమ్మం ముందు ఇనుప బారికేడ్లు అడ్డంగా ఉంటున్నాయి. అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాలన్నా కనుచూపుమేర ఆటోలూ కనిపించవు. బయటికి వెళ్లాలంటే పోలీసుల హూంకరింపులు పెరిగిపోతున్నాయి. దీంతో సీఎం తమ జిల్లా పర్యటనకు వస్తున్నారంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ‘మా జిల్లాకు రావద్దయ్యా.. మా ఊరికి అసలే రావద్దయ్యా’ అంటూ వేడుకుంటున్నారు. 


విజయవాడ ప్రజలకు నరకమే..

జిల్లాల పర్యటన సమయంలో ఆ ప్రాంతాల వారి గోస ఎలా ఉన్నా.. ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం వరకూ ఉండే జనం మాత్రం జగన్‌ బయటకు వెళ్లి, వస్తున్నారంటేనే ఆ కష్టాలను తలచుకొని గజగజలాడిపోతున్నారు. ముఖ్యంగా విజయవాడ ప్రజలు నరకం చూస్తున్నారు. జిల్లాల పర్యటన సందర్భంగా జగన్‌ గన్నవరం వస్తున్నారంటే.. విజయవాడలోని రామవరప్పాడు రింగు రోడ్డు దాకా వాహనాలు గంటల కొద్దీ నిలిచిపోవాల్సింది. ఎందుకు ఆపారో పోలీసులు చెప్పరు. ఎంతసేపు ఆపుతారో కూడా చెప్పరు. జగన్‌ వెళ్లేదాకా ఎండయినా .. వానయినా జనం అనుభవించాల్సిందే! 


రాష్ట్రంలోకి డేరా సంస్కృతి..

జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే రాష్ట్రంలో డేరా సంస్కృతి మొదలైంది. అమరావతి రాజధాని పట్ల ఆయనకు విముఖత ఉన్నందునో ఏమో తాడేపల్లిలోనే క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే పాలన సాగిస్తున్నారు. మూడు రాజధానుల బిల్లు తెచ్చిన తర్వాత అమరావతి రాజధాని ప్రాంత ప్రజల ముఖం తనకు కనిపించకుండా వెలగపూడి సచివాలయానికి వెళ్లి వచ్చే ప్రతిసారీ పోలీసులు రోడ్డుకు ఇరువైపులా డేరాలు కడుతున్నారు. షాపులు మూసేయించి పహరా కాస్తున్నారు. జగన్‌ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఈ పరదాల సంస్కృతి కొనసాగుతోంది. 
గంగమ్మ దర్శనాలు నిలిపివేత...

ముఖ్యమంత్రి జగన్‌ వస్తున్నారంటే... దైవ దర్శనాలూ ఆగిపోతాయి. తిరుపతిలో అదే జరిగింది. సీఎం జగన్‌ మంగళవారం తిరుపతి పర్యటనలో భాగంగా సాయంత్రం 6.10 గంటలకు తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి వచ్చారు. ఈ ఆలయంలో ఆయన గడిపింది 20 నిమిషాలే. కానీ... దీనికోసం ఉదయం నుంచే ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. గుడి పరిసరాల్లో దుకాణాలన్నీ ఉదయం నుంచే మూయించేశారు. శరన్నవరాత్రులకు వ్యాపారం జోరుగా ఉండే ఈ సమయంలో రోజంతా మూసివేతతతో దుకాణదారులు నష్టపోయారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులూ నిరాశగా వెనుదిరిగారు.ప్రాంతమేదైనా నిర్భంధమే!

 • వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి, వర్ధంతి నాడు ఇడుపులపాయలో వైఎస్‌ సమాధి వద్ద నివాళులర్పించేందుకు జగన్‌ వచ్చినప్పుడూ డేరాల సంస్కృతి కొనసాగుతోంది. జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలోనూ ఆయన వచ్చారంటే డేరాలు పెడుతుండటం గమనార్హం.
 • ఈ నెల 6న నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీని జగన్‌ ప్రారంభించారు. హెలిప్యాడ్‌ నుంచి శివాలయం సెంటర్‌ దాకా జాతీయ రహదారి వెంబడి దుకాణాలకు అడ్డంగా ముందు రోజు నుంచే బారికేడ్లు పెట్టేశారు. దుకాణాలు మూసేశారు. జగన్‌ తిరిగి వెళ్లేంత వరకూ జనార్దనరెడ్డి కాలనీ నుంచి ఎవరూ బయటికి రాకుండా నిరోధించారు.
 • ఈ నెల 23న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి రాగా, కుప్పం ప్రజలెవరూ బయటకు రాకుండా బారికేడ్లు వేసేసి... బయటి నుంచి బస్సుల్లో జనాన్ని తీసుకొచ్చారు.   
 • జూలై 5న కర్నూలు జిల్లా ఆదోని మునిసిపల్‌  హైస్కూల్‌  మైదానంలో విద్యాదీవెన కార్యక్రమానికి జగన్‌ వచ్చినప్పుడు మూడు కిలోమీటర్ల మేర దుకాణాలు మూసేశారు. కర్నూలు నగరంలో ఉంటున్న పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కుమారుడి పెళ్లి సందర్భంగా దంపతులను ఆశీర్వదించడానికి జగన్‌ రాగా, ఏపీఎస్పీ బెటాలియన్‌ నుంచి కృష్ణానగర్‌ వరకూ రోడ్డుకు ఇరువైపులా ఇనుప బారికేడ్లు వేశారు. 
 • జూలై 26న బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో వరద బాధితులకు జగన్‌ పరామర్శ అంతా పోలీసు దిగ్బంధంలోనే కొనసాగింది. బాధితుల ఇళ్ల ముందు కూడా రెండు వరసల బారికేడ్లు పెట్టారు. అదేరోజు రాజమండ్రిలో జగన్‌ బసచేసినా, అక్కడి ప్రజల లెవరినీ కలువలేదు. 
 • జూన్‌ 14న రాప్తాడు నియోజకవర్గం కొత్తపల్తిలో జగన్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లోకి పంటల బీమా నగదు జమ చేసిన సందర్భంగా 44వ జాతీయ రహదారిని కూడా వన్‌వేగా మార్చేశారు. అదే రోజు చెన్నే కొత్తపల్లికి సీఎం జగన్‌ రాగా, హైదరాబాద్‌ - బెంగళూరు జాతీయ రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
 • ఏప్రిల్‌ 7న పల్నాడు జిల్లా నరసారావుపేటలో వలంటీర్ల సత్కార కార్యక్రమానికి జగన్‌ రాగా, ఆ రోజు అక్కడి షాపులు మూయించేశారు. ముందు రోజునుంచే ఆప్రాంతంలో ఆంక్షలు విధించారు. 
 • మే 19న రైతు భరోసా బటన్‌ నొక్కుడుకు ఏలూరు జిల్లా గణపవరం రాగా, ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ ప్రజలను బయటకు రానివ్వలేదు. 
 • 2019 అక్టోబరు 10న అనంతపురం జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో కంటివెలుగు కార్యక్రమానికి జగన్‌ రాగా, ఆ కాలేజీలో ఆయన ఉన్నంత సేపూ వాహనాల రాకపోకలను నిలిపేశారు. దుకాణాలు మూసేశారు. 
 • జనవరి 1న గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పింఛన్‌ రూ.2500కు పెంచే కార్యక్రమానికి జగన్‌ రాగా, ఐదు కిలోమీటర్ల పొడవున బారికేడ్లు వేసేవారు. జవనరి 12న ఐటీసీ హోటల్‌ ప్రారంభోత్సవానికి జగన్‌ గుంటూరు రాగా, ఏడు కిలోమీటర్ల మేర ఆంక్షలు అమలు చేశారు. 
 • విశాఖపట్నంలోని శారదా పీఠానికి జగన్‌ వచ్చిన ప్రతిసారి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిబ్రవరి 9న పీఠం వార్షికోత్సవానికి జగన్‌ రాగా, వాహనాలను నిలిపేయడంతో విమాన ప్రయాణికులు సకాలంలో విమానాశ్రయానికి చేరుకోడానికి ముప్పుతిప్పలు ఎదుర్కొన్నారు. పోలీసులను బతిమాలినా కరుణించకపోవడంతో కొందరు వాగ్వాదానికి దిగారు. మరికొందరు వాహనాలను ట్రాఫిక్‌లోనే వదిలేసి, లగేజీతో కాలినడకనే విమానాశ్రయానికి చేరుకున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్నవారు చాలా ఇబ్బందులు పడ్డారు. ీసీఎం వె ళ్లిపోగానే అన్ని మార్గాలను తెరవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. అప్పటివరకు ఉన్న పోలీసులు, ఇక మీ పాట్లు మీరు పడండి అన్నట్టు వెళ్లిపోయారు.
 • ఈనెల 5న విజయవాడలో గురుపూజోత్సవంలో జగన్‌ పాల్గొన్నారు. ఉపాఽధ్యాయులు నిరసన తెలుపుతారన్న అనుమానంతో  చుట్టుపక్కల నిషేధాజ్ఞలు విధించారు. లబ్బీపేటలోని ఏ కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద అన్ని ప్రాంతాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 • ఆగస్టు 23న కృష్ణా జిల్లా పెడనలో నేతన్న నేస్తం మూడో విడత నిధుల విడుదలకు జగన్‌ రాగా అన్ని ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాణిజ్య సముదాయాలను తెరవనివ్వలేదు. 
 • గతేడాది నవంబరు 20న విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో ఎమ్మెల్సీ కరీమున్నీసా గుండెపోటుతో మరణించడంతో నివాళులర్పించడానికి సీఎం రాగా, కేదారేశ్వరిపేట మార్కెట్‌ వద్ద చిరువ్యాపారులను ఖాళీ చేయించారు.

Read more